కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బేతనియలో, సీమోను గృహమందు

బేతనియలో, సీమోను గృహమందు

అధ్యాయము 101

బేతనియలో, సీమోను గృహమందు

యేసు యెరికోను విడిచి, బేతనియకు వెళ్లును. ఈ పర్యటనకు దాదాపు ఆ దినమంతయు గడచిపోవును, ఎందుకనగా అది షుమారు 19 కిలోమీటర్లు ఎగుడుగా నడువవలసిన మార్గము. యెరికో సముద్ర మట్టమునకు 250 మీటర్ల దిగువనుండగా, బేతనియ సముద్ర మట్టమునకు దాదాపు 760 మీటర్ల ఎగువన ఉన్నది. మీరు గుర్తు తెచ్చుకోవచ్చును, బేతనియ లాజరు అతని సహోదరీల స్వంత ఊరు. ఈ చిన్న గ్రామము యెరూషలేముకు దాదాపు 3 కిలోమీటర్ల దూరమున, ఒలీవ కొండకు తూర్పున పల్లపు ప్రాంతములో ఉన్నది.

పస్కాపండుగను ఆచరించుటకు అనేకులు అప్పటికే యెరూషలేముకు చేరుకొన్నారు. వారు ఆచారక్రమము చొప్పున తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకు త్వరగా అక్కడికి వచ్చారు. బహుశ మృతకళేబరమును ముట్టుకొని లేక తమను అపవిత్రపరచు మరొకపని చేసియుండవచ్చును. కావున పస్కాను అంగీకృతమైన రీతిలో ఆచరించుటకు వారు తమ్మునుతాము శుద్ధీకరించుకొను పద్ధతులను అనుసరించుదురు. వీరు త్వరగా ఆలయమునొద్దకు చేరుకొనుచుండగా, అనేకులు యేసు పస్కాపండుగకు అక్కడకు వచ్చునాయని ఆలోచింతురు.

యెరూషలేము యేసు విషయములో తీవ్రవాదోపవాదములకు వేదికగా తయారయ్యెను. మతనాయకులు ఆయనను పట్టుకొని హతమార్చ గోరుచున్నారని అందరికి తెలిసిన విషయమైపోయినది. వాస్తవానికి, ఆయన వివరములు తెలిసిన ఎవరైనను తమకు ఆ విషయమును తెలియజేయవలెనని వారు ఆజ్ఞలు జారీచేశారు. ఇటీవల నెలలలో మూడుసార్లు—పర్ణశాలల పండుగలో, ప్రతిష్ఠిత పండుగలో మరియు ఆయన లాజరును పునరుత్థానము చేసినప్పుడు, ఈ నాయకులు ఆయనను హతమార్చుటకు ప్రయత్నించిరి. కావున, యేసు మరొకసారి బహిరంగముగా ప్రజలలోకి వచ్చునాయని ప్రజలు ఆలోచించుదురు. “మీకేమి తోచుచున్నది?” అని వారు ఒకనినొకడు ప్రశ్నించికొందురు.

ఈ లోపున, యూదుల క్యాలండరు ప్రకారము నీసాను 14న వచ్చు, పస్కాపండుగకు ఆరు రోజులముందు యేసు బేతనియకు చేరుకొనును. శుక్రవారము సాయంకాలానికి, అనగా నీసాను 8 ఆరంభములో యేసు బేతనియ చేరుకొనును. శనివారము ఆయన బేతనియకు ప్రయాణించి యుండడు, ఎందుకనగా యూదుల ధర్మశాస్త్రము విశ్రాంతి దినమున—శుక్రవారము సూర్యాస్తమయము నుండి శనివారము సూర్యాస్తమయము వరకు—ప్రయాణము చేయుటను నిషేధిస్తున్నది. ఇంతకుముందు చేసినట్లుగానే యేసు బహుశ లాజరు ఇంటికి వెళ్లి, శుక్రవారము రాత్రి అక్కడే గడిపియుండవచ్చును.

అయితే, బేతనియలోని మరొక నివాసి యేసు మరియు ఆయన సహచరులను శనివారము సాయంకాలము భోజనానికి ఆహ్వానించాడు. ఆ మనుష్యుడు క్రితము కుష్ఠరోగిగాయుండిన సీమోను. ఈయనను బహుశ యేసు అంతకుముందు స్వస్థపరచియుండవచ్చును. కష్టించి పనిచేసే లక్షణముగల మార్త, అతిథిలకు పరిచారము చేయసాగును. అయితే, మరియ యథావిధిగా యేసుపై శ్రద్ధ నిలుపును, కాని ఈసారి అది వివాదమును లేవదీయును.

మరియ దాదాపు అర్ధకిలో “అచ్చ జటమాంసి” సుగంధతైలముగల పాలరాయి పెట్టెను, లేక చిన్న బుడ్డి తెరుచును. ఇది చాలా విలువైనది. నిజముగా, దాని విలువ దాదాపు ఒక సంవత్సర జీతమునకు సమానము! మరియ యేసు తలపై మరియు పాదములపై ఆ తైలమును పోసి, తన తలవెండ్రుకలతో తుడిచినప్పుడు, ఆ ఇల్లంతయు సుగంధ పరిమళముతో ఘుమఘుమ లాడును.

శిష్యులు కోపము తెచ్చుకొని ఇట్లడుగుదురు: “ఈ నష్టమెందుకు?” ఆ పిమ్మట ఇస్కరియోతు యూదా, “ఈ అత్తరెందుకు మూడువందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.” కాని యూదా నిజముగా బీదలమీద కనికరపడుట లేదు, ఏలయనగా అతడు శిష్యులు పెట్టిన డబ్బుపెట్టెలోనుండి డబ్బు దొంగిలించుచుండెను.

యేసు మరియ తరపున మాట్లాడుచు, “ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను. ఈమె యీ అత్తరు నా శరీరము మీదపోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని” వారితో అనును.

యేసు ఇప్పుడు బేతనియలో 24 గంటలకంటె ఎక్కువసేపు ఉన్నాడు, గనుక ఆయనక్కడనే ఉన్నాడను వార్త అంతటా వ్యాపించును. అందువలన, అనేకులు ఆయనను, అక్కడేయున్న లాజరును చూడవలెనని సీమోను ఇంటికి వచ్చుదురు. కావున ప్రధాన యాజకులు యేసును మాత్రమే కాకుండ లాజరునుకూడ చంపుటకు సమాలోచన చేయుదురు. ఎందుకంటే ఆయన మృతులలోనుండి లేపిన వానిని సజీవముగా చూచినందున అనేకమంది ప్రజలు యేసునందు విశ్వసించుచున్నారు! నిజముగా, ఈ మతనాయకులు ఎంత దుష్టులు! యోహాను 11:55–2212:11; మత్తయి 26:6-13; మార్కు 14:3-9; అపొ.కార్యములు 1:12.

యెరూషలేము దేవాలయములో ఏ చర్చ సాగుచుండెను, మరియు ఎందుకు?

యేసు బేతనియకు శనివారమునకు బదులు శుక్రవారము ఎందుకు చేరుకొనియుండవచ్చును?

యేసు బేతనియకు వచ్చినప్పుడు, విశ్రాంతిదినమును ఆయన బహుశ ఎక్కడ గడిపియుండవచ్చును?

మరియ చేసిన ఏ పని వివాదమును రేపెను, కాగా యేసు ఎట్లు ఆమె తరపున మాట్లాడును?

ప్రధానయాజకుల మహా దుష్టత్వమును ఏది ఉదహరించుచున్నది?