కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భయంకర పెనుతుపానును నిమ్మళింపజేయుట

భయంకర పెనుతుపానును నిమ్మళింపజేయుట

అధ్యాయము 44

భయంకర పెనుతుపానును నిమ్మళింపజేయుట

యేసు సముద్రతీరమున జనసమూహములకు బోధించుట, అటుపిమ్మట ఏకాంతముగా ఆ ఉపమానములను తన శిష్యులకు వివరించుటతో ఆ దినమైపోయినది. సాయంత్రమయ్యే సరికి “మనము అద్దరికి వెళ్లుదమురండి” అని ఆయన వారితో అనును.

గలిలయ సముద్రమునకు తూర్పుతీరమున దెకపొలి అనే ప్రదేశమున్నది. గ్రీకు భాషలో డె’క అంటే “పది” అని, పొ’లిస్‌ అంటే “పట్టణము” అని అర్థము. అనేకమంది యూదుల గృహములచ్చట నిశ్చయముగా ఉన్నప్పటికిని దెకపొలి నందలి పట్టణములు గ్రీకు సంసృతికి కేంద్రస్థానములై యన్నవి. అయితే ఈ ప్రాంతములో యేసుచేసిన పరిచర్య చాలాతక్కువ. మనము తర్వాత పరిశీలించబోవునట్లు ఈ సందర్శనములో కూడ, ఆయన అక్కడ ఎక్కువకాలము ఉండకుండా నిరోధించబడును.

ఆవలి ఒడ్డునకు వెళ్లుదమని యేసు కోరినప్పుడు శిష్యులాయనను పడవమీద తీసుకొని వెళ్లుదురు. అయినను కొందరు వారిని గమనించి, వెంటనే వారు తమ పడవలలో ఆయనను వెంబడించుదురు. అది అంతదూరమేమి లేదు. వాస్తవానికి, గలిలయ సముద్రము 21 కి.మీ. పొడవు, ఎక్కువలో ఎక్కువ 12 కి.మీ. వెడల్పుగల ఒక పెద్దసరస్సు.

యేసు చాలా అలసిపోయినట్లు గ్రహిస్తాడు, గనుకనే ఆయన పడవ దరిని విడువగానే దాని వెనుక భాగమున తలగడపై తలవాల్చి గాఢంగా నిద్రపోవును. అపొస్తలులలో చాలా మంది గలిలయ సముద్రముపై విస్తారంగా చేపలు పట్టిన అనుభవజ్ఞులైన నావికులు. కనుక వడవ నడిపే బాధ్యతను వారు చేపట్టుదురు.

అయితే ఈసారి ప్రయాణం అంత సులభంగా లేదు. సముద్రమట్టానికి దాదాపు 213 మీ. దిగువన ఉన్న ఆ సరస్సు ఉపరితలముపై ఉన్న ఉష్ణోగ్రత, మరియు సమీపకొండలలోని చల్లనిగాలి కారణముగా, అప్పుడప్పుడు బలమైన ఈదురు గాలులు వీచుచు దానిపై భయంకరమైన పెనుతుపానును ఆకస్మికంగా సృష్టించును. ఇప్పుడు జరిగింది అదే. వెంటనే అలలు పడవను తాకుచు దానిలోనికి నీరు చిమ్ముతూ పడవ మునిగే పరిస్థితి ఏర్పడింది. అయినను, యేసు యింకను నిద్రపోవుచున్నాడు!

అనుభవజ్ఞులైన ఈ నావికులు పడవను నడుపుటకు ఎంతో ప్రయాసపడుదురు. గతంలో వారు నిస్సందేహముగా తుపానులందు ఒడుపుగా పడవలను నడిపిన వారే. కాని వారిప్పుడు పూర్తిగా అలసిపోయారు. ప్రాణభయముతో వారు యేసును లేపారు. ‘బోధకుడా, నీవు లక్ష్యపెట్టుచున్నావా? మేము మునిగి పోవుచున్నాము! మమ్ము రక్షించుము!’ అని వారు కేకలువేస్తారు.

యేసు లేచి, గాలిని సముద్రమును ‘నిశ్శబ్దమై ఊరకుండుము!’ అని గద్దిస్తాడు. చెలరేగుచున్న గాలి ఆగి సముద్రము నిమ్మళమాయెను. ఆయన తన శిష్యులవైపు తిరిగి, ‘మీరెందుకు భయపడుచున్నారు? మీరింకా విశ్వాసము లేక ఉన్నారా?’ అని అడుగును.

అంతట శిష్యులకు అసాధారణమైన భయము పుట్టును. ‘ఈయన నిజంగా ఎవరు? గాలిని నీటిని కూడా ఈయన ఆజ్ఞాపించుచున్నాడు, అవి ఆయనకు లోబడుచున్నవి’ అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.

యేసు ఎంతటి శక్తిని ప్రదర్శించును! ప్రకృతిపై మనరాజుకు ఉన్న శక్తిని తెలిసికొనుట మరియు ఆయన తన రాజ్యపరిపాలనలో మన భూమిపై తన పూర్తి అవధానమును నిలిపినప్పుడు భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలకు భయపడక ప్రజలంతా సురక్షితముగా నివసించుదురనుటకు అది ఎంత దృఢనిశ్చయత కల్గిస్తుంది!

తుపాను ఆగిపోయిన కొంతసేపటికి యేసు ఆయన శిష్యులు సురక్షితముగా తూర్పు అద్దరిని చేరుకొందురు. చెలరేగిన ఆ తుపాను బారినుండి మిగిలిన పడవలు కూడా బహుశ కాపాడబడి సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్లియుండవచ్చును. మార్కు 4:35–5:1; మత్తయి 8:18, 23-27; లూకా 8:22-26.

దెకపొలి అంటే ఏమిటి, అది ఎక్కడ ఉన్నది?

గలిలయ సముద్రముపై పెనుతుపానులు చెలరేగుటకు ఎటువంటి నైసర్గిక పరిస్థితులు కారణమైయున్నవి?

తమ నావిక నైపుణ్యములు తమ్మును రక్షించలేనప్పుడు, శిష్యులు ఏమిచేసారు?