కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మత్తయిని ఆహ్వానించుట

మత్తయిని ఆహ్వానించుట

అధ్యాయము 27

మత్తయిని ఆహ్వానించుట

పక్షవాయువుగల వానిని బాగుచేసిన తర్వాత ఎక్కువదినములు కాకముందే, యేసు కపెర్నహూమును విడిచి గలిలయ సముద్ర ప్రాంతమునకు వెళ్లును. మరలా ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనయొద్దకురాగా, ఆయన వారికి బోధింపనారంభించును. ఆయన నడచిపోవుచుండగా సుంకపు మెట్టునొద్ద లేవి అనికూడ పిలువబడిన మత్తయి కూర్చుండియుండుట చూచి, “నన్ను వెంబడించుమని” యేసు అతని ఆహ్వానించును.

పేతురు, అంద్రెయ, యాకోబు మరియు యోహానులు పిలువబడినప్పటివలెనే, బహుశ మత్తయికూడ అదివరకే యేసు బోధలతో పరిచయము కలిగియుండవచ్చును. మరియు వారివలెనే, మత్తయి ఇవ్వబడిన ఆహ్వానమునకు వెంటనే ప్రతిస్పందించును. అతడు లేచి, సుంకరిగా తన బాధ్యతలను వదిలిపెట్టి, యేసును వెంబడించును.

ఆ తర్వాత, తన పిలుపును పురస్కరించుకొని బహుశ వేడుకగా మత్తయి తన ఇంటిలో గొప్పవిందు ఏర్పాటుచేయును. యేసు ఆయన శిష్యులతోపాటు మత్తయి పూర్వస్నేహితులును ఆ విందుకు వచ్చెదరు. తాము ద్వేషించు రోమా అధికారుల కొరకు సుంకము వసూలు చేయుచున్నందున సాధారణముగా ఈ మనుష్యులను తోటి యూదులు తృణీకరించుదురు. అంతేకాకుండ, వారు తరచు ప్రజలనుండి సాధారణముగా వసూలు చేయవలసిన పన్నులకంటే, మోసముతో ఎక్కువ ద్రవ్యమును వసూలు చేసెడివారు.

యేసు అటువంటి వారితో విందునందు ఉండుట చూసి, పరిసయ్యులు, “మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని, ఆయన శిష్యులనడిగిరి.” యేసు ఆ మాటవిని పరిసయ్యులకు ఇట్లు జవాబిచ్చును: “రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా? అయితే నేను పాపులను పిలువవచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు. గనుక, ‘కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను’ అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడి.”

నిజానికి, వారు యేసు చెప్పువిషయములను విని ఆత్మీయ స్వస్థతను పొందుటకే, మత్తయి ఈ సుంకరులను తనయింటికి ఆహ్వానించును. కావున, వారు దేవునితో మంచి సంబంధమును సంపాదించుకొనులాగున సహాయము చేయుటకే యేసు వారితో సహవాసము చేయును. పరిసయ్యులవలె యేసు అటువంటి వారిని తృణీకరించలేదు. బదులుగా, కనికరముతో కదిలింపబడినవాడై, ఆయన వారియెడల ఆత్మీయ వైద్యునిగా పనిచేయును.

ఆ విధముగా యేసు పాపులయెడల కనికరము చూపుట వారి పాపములను సహించినట్లు కాదుగాని, శారీరక రుగ్మతలు గలవారియెడల ఆయన చూపిన జాలివంటిదైయున్నది. ఉదాహరణకు, “నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము” అని కనికరముతో కదిలివెళ్లి కుష్ఠరోగము గలవానిని ముట్టుకొనుటను గుర్తుతెచ్చుకొనుము. మనముకూడ అవసరతలోవున్న వ్యక్తులకు సహాయము చేయుటద్వారా, ప్రాముఖ్యముగా వారికి ఆత్మీయ రీతిలో సహాయము చేయుటద్వారా, అటువంటి కనికరము చూపుదుము గాక. మత్తయి 8:3; 9:9-13; మార్కు 2:13-17; లూకా 5:27-32.

యేసు చూసినప్పుడు మత్తయి ఎక్కడ ఉన్నాడు?

మత్తయి వృత్తి ఏమిటి, అటువంటి వారిని యూదులు ఎందుకు తృణీకరించెడివారు?

యేసుకు వ్యతిరేకముగా ఎటువంటి ఫిర్యాదు చేయబడెను, దానికి యేసు ఎట్లు ప్రత్యుత్తరమిచ్చును?

యేసు ఎందుకు పాపులతో సహవసించెను?