మనుష్యకుమారుడు బయలుపరచబడినప్పుడు
అధ్యాయము 93
మనుష్యకుమారుడు బయలుపరచబడినప్పుడు
యేసు ఇంకను ఉత్తరమున (సమరయలోగాని లేక గలిలయలోగాని) ఉన్నప్పుడే, రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడుగుదురు. అది ఆర్భాటముతో ఉత్సాహపూర్వకముగా వచ్చునని వారు నమ్ముచున్నారు, గానీ యేసు వారితో ఇట్లనును: “దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనేయున్నది గనుక, ‘ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని’ చెప్ప వీలుపడదు.”
“మీ మధ్యనే” అను యేసు మాటలు కొన్నిసార్లు “మీలోనే” అని తర్జుమా చేయబడినవి. కావున దేవుని రాజ్యము దేవుని సేవకుల హృదయములలో ఏలుననియే యేసు మాటల భావమని కొందరు తలంచిరి. అయితే యేసు ఎవరితో మాట్లాడుచున్నాడో ఆ అవిశ్వాసులైన పరిసయ్యుల హృదయములలో దేవుని రాజ్యము లేదు. అయినను, దేవుని రాజ్యమునకు రాజుగా నియమితుడైన యేసుక్రీస్తు వారిమధ్యలో ఉన్నందున, అది వారి మధ్యనే కలదు.
బహుశ పరిసయ్యులు వెళ్లిన తర్వాతనే యేసు తన శిష్యులతో రాజ్యము వచ్చుటనుగూర్చి ఇంకనూ మాట్లాడియుండవచ్చును. “మనుష్యులు . . . ‘ఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల’ [ఈ అబద్ధ మెస్సీయల వెంట] వెళ్లకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒకదిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును” అని హెచ్చరించినప్పుడు ఆయన ప్రత్యేకించి రాజ్యాధికారముతోవచ్చు తన భవిష్యత్ ప్రత్యక్షతను మనస్సునందుంచుకొనును. కాబట్టి, మెరుపు విశాలప్రాంతలో ప్రకాశించునట్లుగానే, దానిని చూచుటకు ఇష్టపడువారందరికి తన రాజ్యాధికార ప్రత్యక్షతయు స్పష్టముగా కన్పించునని యేసు సూచించుచున్నాడు.
తన భవిష్యత్ ప్రత్యక్షత కాలములో ప్రజల దృక్పధములు ఎలాగుండునో చూపించుటకు పిదప యేసు, ప్రాచీనకాల సంఘటనలయొక్క సమాంతరములను ఇచ్చుచున్నాడు. ఆయనిట్లు వివరించుచున్నాడు: “నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. . . . లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచునుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమునుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
నోవహు మరియు లోతు దినములలోని ప్రజలు కేవలము సామాన్య జీవిత కార్యములగు తినుట, త్రాగుట, కొనుట, అమ్ముట, నాటుట, కట్టుచూ వున్నందుననే నాశనము చేయబడిరని యేసు చెప్పుటలేదు. నోవహు మరియు లోతు కుటుంబములవారు కూడ వీటిని చేసిరి. అయితే ఇతరులు దేవుని చిత్తముయెడల ఎటువంటి శ్రద్ధనివ్వకుండ అటువంటి దైనందిన కార్యములలో మునిగియున్నందువలననే వారు నాశనము చేయబడిరి. ఈ విధానముమీదికి వచ్చు మహాశ్రమల సమయములో క్రీస్తు బయల్పరచబడినప్పుడు ప్రజలు అదే కారణము నిమిత్తము నాశనము చేయబడుదురు.
భవిష్యత్తులో తన రాజ్యాధికార ప్రత్యక్షతయొక్క రుజువునకు వెంటనే ప్రతిస్పందించు ప్రాముఖ్యతను నొక్కితెలియజేయుచు, యేసు ఇంకను ఇట్లనును: “ఆ దినమున మిద్దెమీద ఉండువాడు ఇంట ఉండు సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును (వస్తువులను తీసికొనుటకు NW) తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.”
క్రీస్తు ప్రత్యక్షతకు రుజువు కన్పించినప్పుడు, ప్రజలు సరియైన చర్య గైకొనకుండ తమ వస్తుదాయక ఆసక్తి తమను అడ్డగించుటకు వారు అనుమతించకూడదు. సొదొమనుండి వెళ్లిపోవుచు, వెనుకవిడిచివచ్చిన వాటికొరకు లోతుభార్య ఆశతో నిజంగా వెనుకకు తిరిగిచూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభమాయెను.
తన భవిష్యత్ ప్రత్యక్షతయందు నెలకొనియుండు పరిస్థితిని గూర్చి ఇంకను వర్ణించుచు, యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పును: “ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడును.”
కొనిపోబడుట, అనగా నోవహు తన కుటుంబముతో ఓడలోనికి ప్రవేశించుట మరియు దేవదూతలు లోతును అతని కుటుంబమును సొదొమ పట్టణము వెలుపటికి తీసికొనిపోవుటతో సరిసమానము. అనగా రక్షణయని దాని అర్థం. మరోవైపున, విడిచిపెట్టబడుట అనగా నాశనము ననుభవించుటయని భావము.
ఈ సందర్భములో శిష్యులు, “ప్రభువా, ఇది ఎక్కడ?” అని అడుగుదురు.
దానికి యేసు, “పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని” వారికి జవాబిచ్చును. రక్షణకొరకు “కొనిపోబడువారు,” “పీనుగు” ఉండుచోటుకు చేరుకొను దూరదృష్టిగల పక్షిరాజులను పోలియున్నారు. ఇచ్చట కళేబరము, రాజ్యాధికారములో అదృశ్యముగా ప్రత్యక్షముకానైయున్న నిజమైన క్రీస్తునకు మరియు యెహోవా దయచేయు ఆత్మీయ విందుకు సూచనగా యున్నది. లూకా 17:20-37; ఆదికాండము 19:26.
▪ రాజ్యము ఎట్లు పరిసయ్యుల మధ్యనే ఉండెను?
▪ క్రీస్తు ప్రత్యక్షత ఎట్లు మెరుపును పోలియున్నది?
▪ క్రీస్తు ప్రత్యక్షత కాలమున వారి కార్యములనుబట్టి ప్రజలెందుకు నాశనము చేయబడుదురు?
▪ కొనిపోబడుట మరియు విడిచిపెట్టబడుట అనగా అర్థమేమి?