కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మహాసభ ముందర, ఆ పిమ్మట పిలాతునొద్దకు

మహాసభ ముందర, ఆ పిమ్మట పిలాతునొద్దకు

అధ్యాయము 121

మహాసభ ముందర, ఆ పిమ్మట పిలాతునొద్దకు

రాత్రి గడిచి ఇక తెల్లవారనైయున్నది. యేసు తనకు తెలియదని పేతురు మూడుసార్లు చెప్పెను, మరియు మహాసభ సభ్యులు తమ వెటకారపు న్యాయవిచారణను ముగించి వెళ్లిపోయిరి. అయితే శుక్రవారము తెల్లవారిన వెంటనే, వారు మరలా సమావేశమగుదురు, ఈసారి వారు మహాసభ హాలులో కలిసికొందురు. రాత్రి జరిపించిన న్యాయవిచారణకు కొంత న్యాయబద్ధత ఉన్నట్లు కన్పింపజేయుటకు బహుశ వారట్లు చేయుదురు. యేసు వారియెదుటకు తీసుకొనిరాబడినప్పుడు, వారు రాత్రి చేసినట్లుగానే, “నీవు క్రీస్తువైతే మాతోచెప్పుమని” అందురు.

దానికి యేసు, “నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు” అని చెప్పును. ఏమైనను, యేసు ధైర్యముగా తన గుర్తింపును, తెల్పుచు ఇట్లనును: “ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగును.”

“అట్లయితే నీవు దేవుని కుమారుడవా?” వారందరు తెలిసికొనగోరుదురు.

అందుకు యేసు, “మీరన్నట్టు నేనే ఆయనను అని” వారికి జవాబిచ్చును.

హత్యచేయ తలపెట్టిన ఈ మనుష్యులకు ఆ జవాబు చాలును. దానిని వారు దైవదూషణగా పరిగణింతురు. “మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా” అని వారు చెప్పుదురు. కాగా వారు యేసును బంధించి, తీసికొనిపోయి రోమా గవర్నరయిన పొంతి పిలాతుకు అప్పగింతురు.

ఆయనను అప్పగించిన యూదా, జరిగిన దానినంతటిని గమనించును. యేసును వారు దోషిగా నిర్ణయించుటను అతడు చూచినప్పుడు, మనస్తాపము చెందును. కావున అతడు 30 వెండి నాణెములను తిరిగి యిచ్చివేయుటకు ప్రధానయాజకులు మరియు పెద్దలయొద్దకు వెళ్లి, “నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని” చెప్పును.

దానికి వారు “అది మాకేమి? నీవే చూచుకొనుమని” కఠినముగా చెప్పుదురు. కావున యూదా దేవాలయములో ఆ వెండినాణెములను పారవేసి, పోయి ఉరిపెట్టుకొనును. అయితే, యూదా ఉరిపెట్టుకొనిన కొమ్మ విరుగును, కాగా అతడి శరీరము క్రిందనున్న రాళ్లమీదపడి నడిమికి బ్రద్దలగును.

ఆ వెండి నాణెములతో ఏమి చేయవలెనో ప్రధానయాజకులకు సరిగా తెలియలేదు. “ఇవి రక్తక్రయధనము గనుక, వీటిని కానుకలపెట్టెలో వేయతగదను” నిర్ణయమునకు వచ్చిరి. కావున, వారందరు కలిసి సమాలోచన చేసిన తర్వాత, వారు వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. ఆ విధముగా, ఆ పొలము “రక్తపు పొలమని” పిలువబడనారంభించును.

యేసు గవర్నరు రాజసౌధమునకు తీసికొనిపోబడునప్పటికి, ఇంకా పూర్తిగా తెల్లవారదు. అయితే యేసుతోకూడ వచ్చిన యూదులు లోనికి ప్రవేశించుటకు నిరాకరింతురు ఎందుకనగా అన్యులతో అటువంటి సన్నిహితత్వము వారిని అపవిత్రులను చేయునని వారు నమ్ముదురు. కావున వారికి కలతకలిగించకుండుటకు పిలాతు బయటకు వచ్చును. “ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారు?” అని అడుగును.

“వీడు దుర్మార్గుడు కానియెడల వీని నీకు అప్పగింపకుందుమని” వారు జవాబు చెప్పుదురు.

తాను అందులో చిక్కుకొనుటకు ఇష్టములేనివాడై, పిలాతు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చును: “మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడి.”

వారి హత్యావుద్దేశ్యమును బయల్పరచుచు, యూదులు, “ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదు” అని అందురు. నిజమే, వారు యేసును పస్కా పండుగ సమయములో చంపినట్లయిన, అది బహుశ ప్రజలలో కలవరము కలుగుటకు కారణమగును, ఎలయనగా అనేకులు యేసును గొప్పగా ఎంచిరి. కాని వారు రాజకీయ నేరారోపణ విషయమై ఆయనను రోమన్లు చంపునట్లు చేసినట్లయిన, ఇది ప్రజలయెదుట వారిని దోషులుగా చేయదు.

కావున మతనాయకులు, తాము దైవదూషకుడని తీర్పుతీర్చిన తమ పూర్వ న్యాయవిచారణను ప్రస్తావించకుండా, వారిప్పుడు భిన్నమైన నేరారోపణలు చేయుచున్నారు. వారు, “ఇతడు [1] మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, [2] కైసరుకు పన్నియ్యవద్దనియు, [3] తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పుచున్నాడని” మూడు భాగముల నేరము మోపుదురు.

తాను రాజునని యేసు చెప్పుకొనెనను అభియోగము పిలాతుకు శ్రద్ధకల్గించును. కావున, అతడు మరలా సౌధములోనికి ప్రవేశించి యేసును తనయొద్దకు పిలుచుకొని ఇట్లడుగును: “నీవు యూదుల రాజువా?” మరొకమాటలో, కైసరుకు వ్యతిరేకముగా నిన్ను నీవు రాజుగా ప్రకటించుకొనుట ద్వారా చట్టమును ఉల్లంఘించితివా?

తననుగూర్చి పిలాతు ఎంతమేరకు ఎరిగియుండెనో యేసు తెలిసికొనగోరును, కావున ఆయనిట్లడుగును: “నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా?”

పిలాతు తనకు ఆయననుగూర్చి తెలియదని వాస్తవములు తెలిసికొనగోరుచున్నాడని చెప్పును. “నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివి?” అని అతడు ప్రత్యుత్తరమిచ్చును.

రాజ్యత్వమునకు చెందిన, ఈ వివాదమును తప్పించవలెనని యేసు ఏవిధముగానైనను ప్రయత్నించడు. యేసు ఇప్పుడు ఇవ్వనైయున్న జవాబు నిస్సందేహముగా పిలాతును ఆశ్చర్యపరచును. లూకా 22:66–23:3;  మత్తయి 27:1-11;  మార్కు 15:1;  యోహాను 18:28-35;  అపొ.కార్యములు 1:16-20 .

ఏ సంకల్పముతో ఉదయమున మహాసభ మరలా సమావేశమగును?

యూదా ఎట్లు చనిపోవును, ఆ 30 వెండి నాణెములతో ఏమిచేయబడెను?

తాముగా యేసును చంపుటకు బదులు, ఆయనను రోమన్లు చంపవలెనని యూదులెందుకు కోరుదురు?

యేసుపై యూదులు ఎటువంటి ఆరోపణలు చేయుదురు?