మినాలను గూర్చిన ఉపమానము
అధ్యాయము 100
మినాలను గూర్చిన ఉపమానము
యెరూషలేముకు వెళుతూ మధ్యలో తాను ఆగిన జక్కయ్య యింటిలోనే యేసు బహుశ ఇంకను యుండవచ్చును. వారు యెరూషలేముకు వెళ్లినప్పుడు, ఆయన తానే మెస్సీయనని ప్రకటించుకొని తన రాజ్యమును స్థాపించునని శిష్యులు నమ్ముదురు. ఈ తలంపును సరిదిద్ది రాజ్యము ఇంకను చాలాదూరమందు కలదని చూపించుటకు యేసు వారికి ఒక ఉపమానము చెప్పును.
“రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై వెళ్లెనని” ఆయన వివరించును. ఆ “రాజకుమారుడు” అనగా యేసు, ఆ “దూరదేశము” అనగా పరలోకమే. యేసు అక్కడికి వెళ్లినప్పుడు, ఆయన తండ్రి ఆయనకు రాజ్యాధికారము ఇచ్చును.
అయితే అక్కడికి వెళ్లకముందు, ఆ రాజకుమారుడు తన పదిమంది దాసులను పిలిచి ప్రతివానికి ఒక్కొక్క మినా ఇచ్చి వారికిట్లు చెప్పును: “నేను వచ్చువరకు వ్యాపారము చేయుడి.” ఆ పదిమంది దాసులు ప్రధమ నెరవేర్పునందు యేసు తొలి శిష్యులను సూచించెదరు. దాని విస్తరింపబడిన అన్వయింపులో, వారు పరలోక రాజ్యములో ఆయనతోకూడ వారసులుగా ఉండు ఉత్తరాపేక్షగల వారందరిని సూచిస్తున్నారు.
వెండి మినాలు విలువగల డబ్బు నాణెములైయున్నవి, ప్రతి నాణెం దాదాపు, ఒక వ్యవసాయకూలియొక్క మూడునెలల జీతమునకు సమానము. అయితే మినాలు దేనికి సూచనయైయున్నవి? మరియు దాసులు వాటితో ఎలాంటి వ్యాపారము చేయవలెను?
వాగ్దానము చేయబడిన రాజ్యమందు యేసు రాజుగావచ్చు పర్యంతము పరలోక రాజ్యమునకు ఎక్కువమంది వారసులను ఉత్పన్నముచేయుటలో ఆత్మాభిషేకులైన శిష్యులు ఉపయోగించగల సొత్తును ఈ మినాలు సూచిస్తున్నవి. పునరుత్థానమై తన శిష్యులకు కన్పించిన తర్వాత, ఆయన మరి ఎక్కువ మంది శిష్యులను తయారుచేసి ఆ విధముగా పరలోక రాజ్యతరగతిలో ప్రజలను చేర్చుటకు ఆ సూచనార్థక మీనాలను ఆయన తన శిష్యులకిచ్చెను.
“అయితే,” యేసు ఇంకను ఇట్లనును, “అతని [రాజకుమారుని] పట్టణస్థులతని ద్వేషించి, మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.” ఈ పట్టణస్థులు ఇశ్రాయేలీయులు, లేక యూదులైయున్నారు. వీరిలో ఆయన శిష్యులు చేరియుండలేదు. యేసు పరలోకమునకు వెళ్లిన తర్వాత, ఈ యూదులు ఆయన శిష్యులను హింసించుటద్వారా ఆయన తమపై రాజుగా యుండుట తమకిష్టము లేదని చూపించారు. ఈ విధముగా వారు రాయబారము పంపిన పట్టణస్థులవలె ప్రవర్తించారు.
పదిమంది దాసులు తమ మినాలను ఎట్లు ఉపయోగింతురు? యేసు ఇట్లు వివరించును: “అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించును. మొదటివాడాయన యెదుటికి వచ్చి, అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా అతడు, భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అంతట రెండవవాడు వచ్చి, అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెను అనగా అతడు, నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.”
పది మినాల ఇవ్వబడిన దాసుడు, సా.శ. 33 పెంతెకొస్తు నాటినుండి ఇప్పటివరకు, అపొస్తలులుకూడ చేరియున్న శిష్యుల తరగతికి, లేక గుంపుకు చిత్రీకరణయైయున్నాడు. ఐదు మినాలను సంపాదించిన దాసుడుకూడ తమకుగల అవకాశములు, మరియు సామర్థ్యముల ప్రకారము, అదే కాలములో భూమిపై రాజు సొత్తును అభివృద్ధిపరచిన ఒక గుంపుకు చిత్రీకరణయైయున్నాడు. ఈ రెండు గుంపులు ఆసక్తితో సువార్తను ప్రకటించుదురు, తత్ఫలితముగా, అనేకమంది సహృదయులు క్రైస్తవులుగా తయారగుదురు. దాసులలోని తొమ్మిదిమంది విజయవంతముగా వ్యాపారము సాగించి తమకివ్వబడిన దానిని వృద్ధిచేసిరి.
“అంతట,” యేసు ఇంకను ఇట్లనును, “మరియొకడు వచ్చి, అయ్యా, యిదిగో నీ మినా; నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా నీ వెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసియుండిన యెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే? అని చెప్పి, వీనియొద్దనుండి ఆ మినాలు తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను.”
చెడ్డవాడైన దాసుడు సూచనార్థక మీనాను పోగొట్టుకొనుట అనగా పరలోక రాజ్యమందు స్థానమును కోల్పోవుటయని దాని భావము. అవును, అతడు పది లేక ఐదు పట్టణములమీద సాదృశ్యముగా పరిపాలించు ఆధిక్యతలను పోగొట్టుకొనుచున్నాడు. ఏ చెడుతనము జరిగించినందువలన కాదుగాని, తన యజమానుని రాజ్య సంపదను వృద్ధిచేయుట కొరకు పనిచేయనందున అతడు చెడ్డవాడని పిలువబడెనను విషయమునుకూడ గమనించుడి.
చెడ్డ దాసుని మినా మొదటి దాసునికి ఇచ్చినప్పుడు, “అయ్యా, వానికి పది మినాలు కలవే” అను అభ్యంతరము వచ్చును. అయినను యేసు, “కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడును. . . . మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడి” అని ప్రత్యుత్తరమిచ్చును. లూకా 19:11-27; మత్తయి 28:19, 20.
▪ మినాలనుగూర్చిన ఉపమానము చెప్పుటకు యేసును ఏది పురికొల్పును?
▪ రాజకుమారుడు ఎవరు, మరియు ఆయన వెళ్లు దేశము ఏమైయున్నది?
▪ దాసులు ఎవరు, మరియు మినాలద్వారా ఏమి సూచింపబడును?
▪ పట్టణస్థులు ఎవరు, మరియు వారు ద్వేషమును ఎట్లు చూపింతురు?
▪ చెడ్డవాడని పిలువబడిన దాసుడు ఎవడు, మరియు తన మినాను పోగొట్టుకొనుట అనగా దాని భావమేమైయున్నది?