కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదట అన్నయొద్దకు, ఆ పిమ్మట కయపనొద్దకు తీసుకువెళ్లుదురు

మొదట అన్నయొద్దకు, ఆ పిమ్మట కయపనొద్దకు తీసుకువెళ్లుదురు

అధ్యాయము 119

మొదట అన్నయొద్దకు, ఆ పిమ్మట కయపనొద్దకు తీసుకువెళ్లుదురు

యేసును ఒక సాధారణ నేరస్థునివలె బంధించి, మంచి పలుకుబడిగల మాజీ ప్రధానయాజకుడైన అన్నయొద్దకు తీసుకువెళ్లుదురు. యేసు 12 సంవత్సరముల బాలునిగా ఆలయములోని బోధకులను ఆశ్చర్యపరచినప్పుడు ఈ అన్న ప్రధానయాజకునిగా యుండెను. ఆ తర్వాత అన్న కుమారులు అనేకమంది ప్రధానయాజకులుగా పనిచేసిరి, ప్రస్తుతము అతని అల్లుడైన కయప ఆ స్థానమందున్నాడు.

యూదా మత జీవన విధానములో అన్న దీర్ఘకాలము ప్రధానయాజకునిగా ప్రధానత్వము కలిగియుండినందున యేసును బహుశ వారు మొదట అక్కడికి తీసుకొని వెళ్లియుండవచ్చును. ఈ విధముగా అన్నయింటికి వెళ్లుట కయప 71 మంది సభ్యుల యూదా ఉన్నత న్యాయస్థానమగు మహాసభను సమావేశపరచుటకు, ఆలాగే అబద్ధ సాక్షులను సమకూర్చుటకు సమయము నిచ్చును.

ఇప్పుడు ప్రధానయాజకుడైన అన్న యేసు శిష్యులనుగూర్చి ఆయన బోధనుగూర్చి ప్రశ్నించును. అయితే యేసు జవాబుగా ఇట్లనును: “నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేల, నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు.”

అంతట యేసుకు సమీపముగా నిలువబడియున్న బంట్రౌతులలో ఒకడు, “ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా?” అని చెప్పుచు ఆయన ముఖముమీద కొట్టును.

అందుకు యేసు, “నేను కానిమాట ఆడిన యెడల కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావు?” అని అనును. ఈ మాటల అనంతరము, అన్న యేసు బంధింపబడియున్నట్టుగానే కయపయొద్దకు పంపును.

ఇప్పటికి ప్రధానయాజకులందరు, ప్రజలలోని పెద్దలు శాస్త్రులు, అవును మహాసభకు చెందిన వారందరు సమావేశగుటకు ఆరంభింతురు. వారందరు కయప ఇంటిలో సమావేశమగుదురు. పస్కాదినపు రాత్రి అటువంటి న్యాయవిచారణ జరుపుట నిజముగా యూదా ధర్మశాస్త్ర విరుద్ధము. అయితే ఇది వారి దుష్ట సంకల్పమునుండి యూదా మతనాయకులను అడ్డగించదు.

కొన్ని వారముల క్రితము, యేసు లాజరును పునరుత్థానము చేసినప్పుడు, మహాసభకు చెందిన వారు తమలో తాము అప్పటికే అతను మరణించవలెనని తీర్మానించిరి. మరియు కేవలము రెండు రోజుల క్రితము, బుధవారం మతాధికారులు యేసును పట్టుకొని కపటోపాయముతో హతమార్చవలెనని ఆలోచించిరి. ఊహించుము, నిజానికి న్యాయవిచారణకు ముందే వారయనను ఖండించిరి.

ఆయనమీద నేరస్థాపన చేయుటకుగాను ఆయనమీద అబద్ధ సాక్ష్యము పలుకుటకు సాక్షులను కనుగొను ప్రయత్నమిప్పుడు జరుగుచున్నది. అయితే తమసాక్ష్యమందు పొందికగల సాక్షులను కనుగొనుట వారికి కష్టమగును. చివరకు, ఇద్దరు ముందుకువచ్చి ఇట్లు చెప్పుదురు: “‘చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని’ వీడు చెప్పుచుండగా వింటిమి.”

కయప లేచి, “ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని” అని అడుగును. కాని యేసు మౌనముగా ఉండును. ఈ సాక్ష్యమందును, మహాసభకు అవమానము కలుగునట్లు, సాక్షులు తమ కథలు ఒకదానికొకటి సరిపడునట్లు చేయలేకపోయిరి. కావున ప్రధానయాజకుడు మరొక విధమైన యుక్తితో ప్రయత్నించును.

దేవుని కుమారుడనని ఎవరైనా చెప్పినట్లయిన దానివిషయమై యూదులు ఎంతగా స్పందింతురో కయపకు తెలుసు. అంతకుముందు రెండు సందర్భములలో, వారు యేసును మరణము నొందవలసిన దైవదూషకుడని ముద్రవేసిరి, అందు ఒకసారి ఆయన దేవునితో తనను సమానునిగా చేసికొనుచున్నాడని వారు తప్పుగా భావించిరి. ఇప్పుడు కయప కుయుక్తితో గట్టిగా ఇట్లడుగును: “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను.”

యూదులు ఏమి భావించినను, యేసు నిజముగా దేవుని కుమారుడై యున్నాడు. మౌనముగా ఉండుట తాను క్రీస్తు కాడని అంగీకరించినట్లగును. అందుచేత యేసు ధైర్యముగా, “నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని” జవాబిచ్చును.

దీనితో, కయప నాటకముగా తన వస్త్రములు చింపుకొని, “వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచుచున్నది?” అడుగును.

మహాసభలోని వారందరు, “వీడు మరణమునకు పాత్రుడనిరి.” ఆ పిమ్మట వారు ఆయనను ఎగతాళిచేయుటకు ఆరంభించి, ఆయనకు వ్యతిరేకముగా అనేక రీతులలో ఆయనను దూషించుదురు. వారాయన ముఖముమీద ఉమ్మివేసి కొట్టుదురు. ఇతరులు ఆయన ముఖమును పూర్తిగాకప్పి తమ పిడికిళ్లతో గుద్ది, “క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని” ఎత్తిపొడుచుదురు. ఈ దురాగతము, చట్టరహితమైన ఈ ప్రవర్తన రాత్రిపూట చేసిన న్యాయవిచారణలో జరుగును. మత్తయి 26:57-68; 26:3, 4; మార్కు 14:53-65; లూకా 22:54, 63-65; యోహాను 18:13-24; 11:45-53; 10:31-39; 5:16-18.

యేసు మొదట ఎక్కడికి కొనిపోబడును, ఆయనకక్కడ ఏమి సంభవించును?

ఆ తర్వాత యేసును ఎక్కడికి తీసుకువెళ్లుదురు, ఏ సంకల్పము కొరకు?

యేసు మరణమునకు పాత్రుడని మహాసభ ప్రకటించునట్లు కయప ఎట్లు చేయగల్గును?

రాత్రిపూట చేసిన న్యాయవిచారణలో ఏ దురాగతము, చట్టరహిత ప్రవర్తన చోటుచేసికొనును?