కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యాయీరు ఇంటిని విడిచి నజరేతును పునర్దర్శించుట

యాయీరు ఇంటిని విడిచి నజరేతును పునర్దర్శించుట

అధ్యాయము 48

యాయీరు ఇంటిని విడిచి నజరేతును పునర్దర్శించుట

దెకపొలినుండి సముద్రయానము, రక్తస్రావముగల స్త్రీని స్వస్థపరచుట, యాయీరు కుమార్తెను పునరుత్థానము చేయుటతో యేసు ఆరోజు చాలా పనిలో మునిగియుండును. కాని ఆ దినమింకా అంతటితో ముగియలేదు. యేసు యాయీరు ఇంటిని విడుచుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు “దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని” కేకలు వేయుచు ఆయనను వెంబడింతురు.

యేసును “దావీదు కుమారుడా” అని సంబోధించుటలో వారు యేసు దావీదు సింహాసనానికి వారసుడని వాగ్దానము చేయబడిన మెస్సియా ఈయనేయని నమ్మకమును ప్రదర్శించుచున్నారు. అయితే యేసు బహుశ వారి సహనమును పరీక్షించుటకు సహాయము కొరకు వారు వేయు కేకలను విననట్లేయుండును. కాని వారు ఆయనను వదలరు. యేసు నివాసమున్న స్థలము వరకు ఆయనను అనుసరించుచు వచ్చి, ఆయన ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆయనతోకూడ లోనికి వెళ్లదురు.

అక్కడ యేసు: “నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?” అని వారినడుగును.

అవును ప్రభువా అని వారు నమ్మకముతో సమాధానమిత్తురు.

కావున, యేసు వారి కన్నులను ముట్టుకొని, “మీ నమ్మికచొప్పున మీకిది కలుగును గాక” అనును. వెంటనే వారు చూడగల్గుదురు! అప్పుడు యేసు, “ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని” వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. అయితే వారు సంతోషముతో నిండుకొనినవారై యేసు ఇచ్చిన ఆజ్ఞను మరిచి ఆ ప్రాంతమంతయు ఆయనను గూర్చి తెలియజేయుదురు.

ఈ మనుష్యులు అటువెళ్లుచుండగా, ప్రజలు దయ్యము పట్టినయొక మనుష్యుని తెచ్చుదురు. ఆ దయ్యము ఆ వ్యక్తిని మూగవానిగా చేసెను. యేసు ఆ దయ్యమును వెళ్లగొట్టిన వెంటనే ఆ మనుష్యుడు మాటలాడసాగును. ఆ జనసమూహములు ఈ అద్భుతకార్యమును చూచి, “ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.”

అక్కడ పరిసయ్యులు కూడ ఉన్నారు. అద్భుత కార్యములను త్రోసిపుచ్చలేనివారై, తమ దుష్ట అపనమ్మకముతో యేసుచేసిన శక్తివంతమైన పనులను మరలా నిందిస్తు, “ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.”

ఈ సంఘటనలు జరిగిన కొద్దిసమయమునకే యేసు తన స్వస్థలమైన నజరేతుకు తిరిగివచ్చును. ఈసారి ఆయన శిష్యులును ఆయన వెంటవత్తురు. షుమారు ఒక సంవత్సరము క్రిందట ఆయన అక్కడున్న సమాజమందిరమునకు వెళ్లి బోధించెను. మొదట ప్రజలు ఆయన ప్రీతికరమైన మాటలకు ఆశ్చర్యపడిననూ, తరువాత ఆయన బోధను వ్యతిరేకించి ఆయనను చంపప్రయత్నించిరి. ఇప్పుడు యేసు, కనికరముతో తన మునుపటి పొరుగువారికి సహాయముచేయుటకై మరొకసారి ప్రయత్నించును.

ఇతర స్థలములలో మూగినట్లుగా జనసమూహములు ఇక్కడ యేసు చుట్టూ మూగుటలేదు. కాబట్టి విశ్రాంతిదినమున యేసు బోధించుటకు సమాజమందిరమునకు వెళ్లును. ఆయన బోధవిన్న అనేకులు, “ఈ జ్ఞానమును, అద్భుతకార్యములు చేయు శక్తి ఈ మనుష్యుని కెక్కడినుండి వచ్చినవి?” అని ఆశ్చర్యపడుచు, “ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా! యాకోబు, యోసేపు, సీమోను, యూదాయనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు మనతో లేరా? ఇతని ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని” వారు చెప్పుకొందురు.

‘యేసు మనలాంటి సామాన్య మనుష్యుడే,’ అని ‘ఇతని కుటుంబము మనకు తెలుసు. ఇతను మనమధ్యే ఎదిగెను. ఇతనెట్లు మెస్సీయా కాగలడు?’ అని వారు తర్కించిరి. కాబట్టి సమస్త రుజువును—ఆయన జ్ఞానమును, అద్భుతక్రియలను ప్రక్కనబెట్టి వారాయనను తిరస్కరించిరి. అతని బంధువులు సహితము, ఆయనతో తమకున్న సన్నిహిత పరిచయమునుబట్టి అభ్యంతరపడగా యేసు, “ప్రవక్త తనదేశములోను, తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.”

వారి అవిశ్వాసమునకు యేసు నిజముగా ఆశ్చర్యపడును. కావున, కొద్దిమంది రోగులమీద చేతులుంచి స్వస్థపరచుట మినహా ఆయన అక్కడ మరి ఏ అద్భుతకార్యములను చేయలేదు. మత్తయి 9:27-34; 13:54-58, మార్కు 6:1-6; యెషయా 9:7.

▪ యేసును “దావీదు కుమారుడ”ని సంబోధించుటద్వారా తమ నమ్మకమేమని గ్రుడ్డివారు చూపించిరి?

▪ యేసుచేసిన అద్భుతకార్యములకు పరిసయ్యులు ఎట్టివివరణ ఇచ్చిరి?

▪ నజరేతులోనున్నవారికి సహాయపడుటకు యేసు అక్కడకు వెళ్లుట ఎందుకు కనికరముగల పనియైయున్నది?

▪ యేసుకు నజరేతులో ఎటువంటి స్వాగతము లభించెను, ఎందుకు?