యూదయకు కనికరముతోకూడిన ప్రయాణం
అధ్యాయము 89
యూదయకు కనికరముతోకూడిన ప్రయాణం
కొన్ని వారములముందు యెరూషలేములో జరిగిన ప్రతిష్టిత పండుగ సమయమున, యూదులు యేసును చంపుటకు ప్రయత్నించిరి. కావున ఆయన నిశ్చయంగా ఉత్తరమున, గలిలయ సముద్రమునకు ఎంతో దూరములోలేని ప్రాంతమునకు ప్రయాణమై వెళ్లును.
ఇటీవలనే ఆయన యెరూషలేమువైపు దక్షిణముగా, యొర్దాను నదికి తూర్పుననున్న పెరీయ జిల్లాయొక్క గ్రామములలో ప్రకటించుచు ముందుకు వెళ్లుచుండెను. ధనవంతుడు మరియు లాజరునుగూర్చిన ఉపమానమును చెప్పిన తర్వాత, ఆయన గలిలయలో ఇంతకుముందున్నప్పుడు బోదించిన సంగతులను తన శిష్యులకు బోధింపనారంభించును.
ఉదాహరణకు, దేవుని “చిన్నవారిలో” ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటే, “మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట” ఆ వ్యక్తికి ఎంతో మేలు అని ఆయన చెప్పును. క్షమించు అవసరతనుకూడ ఆయన నొక్కిచెప్పుచు, ఇట్లు వివరించును: “అతడు [సహోదరుడు] ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదముచేసి యేడుమారులు నీ వైపు తిరిగి, ‘మారుమనస్సు పొందితిననిన’ యెడల అతని క్షమింపవలెను.”
“మా విశ్వాసము వృద్ధిపొందించుమని” శిష్యులు ఆయనను వేడుకొనినప్పుడు, యేసు ఇట్లు సమాధానమిచ్చును: “మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి, ‘నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని’ చెప్పునప్పుడు అది మీకు లోబడును.” కావున కొద్దిపాటి విశ్వాసము సహితము గొప్ప సంగతులను నెరవేర్చగలదు.
యేసు తర్వాత, సర్వశక్తిగల దేవుని సేవకుని సరియైన దృక్పధమును దృష్టాంతపరచు ఒక నిజ-జీవిత పరిస్థితిని వివరించును. యేసు ఇలా అనును: “దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు, ‘నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని’ వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక, ‘నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని’ వానితో చెప్పును గాని, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత, ‘మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడి.” ఆ విధముగా, దేవుని సేవకులు దేవుని సేవించుటద్వారా ఆయనకు మేలు చేయుచున్నామని ఎన్నడును భావించరాదు. బదులుగా, ఆయన గృహములో నమ్మకమై సభ్యులుగా ఆయనను ఆరాధించు ఆధిక్యత కలదని వారు అన్నిసమయములలో గుర్తుంచుకొనవలెను.
స్పష్టముగా, యేసు ఈ ఉపమానము చెప్పిన కొద్దిసేపటికే, వార్తాహరుడొకడు వచ్చును. యూదయలోని బేతనియనందు నివసించు, లాజరు సహోదరీలైన మరియ మార్తలు అతనిని పంపించుదురు. అతడు, “ప్రభువా, ఇదిగో! నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడు” అని చెప్పును.
దానికి యేసు, “ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదని” జవాబిచ్చును. తానున్నచోటనే మరి రెండు దినములుకూడ ఉండి, యేసు తన శిష్యులతో, “మనము యూదయకు వెళ్లుదమని” చెప్పును. అయితే, ఆయనకు వారిట్లు గుర్తుచేయుదురు: “బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే; అక్కడకి తిరిగి వెళ్లుదువా?”
దానికి ప్రత్యుత్తరముగా యేసు ఇట్లడుగును: “పగలు పండ్రెండు గంటలున్నవి గదా? ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడును.”
‘పగటివేళ,’ లేక యేసు భూపరిచర్య కొరకు దేవుడు అనుమతించిన సమయము ఇంకను అయిపోలేదు మరియు అవి పూర్తియగు వరకు, ఆయన కెవరును హాని చేయలేరనియే యేసుయొక్క స్పష్టమైన భావము. ఆ తర్వాత తన శత్రువులు తనను చంపివేయు “రాత్రి” వచ్చును గనుక, తనకొరకు మిగిలియున్న ‘పగటివేళ’ యొక్క ఈ కొద్ది సమయమును ఆయన పూర్తిగా వినియోగించుకొనవలసిన అవసరమున్నది.
యేసు ఇంకను ఇట్లనును: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.”
లాజరు నిద్రలో విశ్రాంతి తీసికొనుచున్నాడని, అది త్వరలోనే కోలుకొనుటకు నిశ్చయమైన గురుతుయని ఆలోచించుచు, శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.”
అప్పుడు యేసు, “లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని” స్పష్టముగా వారితో చెప్పును.
యేసు యూదయలో చంపబడగలడని గ్రహించినను, ఆయనకు మద్దతుగా ఉండవలెనని కోరుచు, తోమా తన తోటి శిష్యులను ఈ విధముగా ప్రోత్సహించును: “ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదము.” కావున తమప్రాణములకు తెగించి శిష్యులు, యేసుతోకలిసి యూదయకు కనికరముతోకూడిన ఈ ప్రయాణము చేయుదురు. లూకా 13:22; 17:1-10; యోహాను 10:22, 31, 40-42; 11:1-16.
▪ ఇటీవల యేసు ఎక్కడ ప్రకటించుచుండెను?
▪ యేసు ఏ బోధలను మరలా బోధించును, ఏ అంశమును దృష్టాంతపరచుటకు ఆయన ఏ నిజ-జీవిత పరిస్థితిని వర్ణించును?
▪ యేసుకు ఏ వార్త అందును, “పగటివేళ,” మరియు “రాత్రి” అనగా ఆయన భావమేమైయున్నది?
▪ ‘ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని’ చెప్పినప్పుడు తోమా భావమేమైయున్నది?