యెరూషలేముకు యేసుచేసిన చివరి పర్యటనలో పదిమంది కుష్ఠరోగులు స్వస్థతనొందుట
అధ్యాయము 92
యెరూషలేముకు యేసుచేసిన చివరి పర్యటనలో పదిమంది కుష్ఠరోగులు స్వస్థతనొందుట
యేసు యెరూషలేమును విడిచి దానికి ఈశాన్యదిశగా రమారమి 24 కిలోమీటర్ల దూరములోగల ఎఫ్రాయిమను పట్టణమునకు వెళ్లుటద్వారా ఆయనను చంపుటకు మహాసభ ప్రయత్నములను నిష్ఫలం చేయును. ఆయన అక్కడ తన శిష్యులతోపాటు తన శత్రువులకు దూరముగా ఉండును.
అయితే, సా.శ. 33 పస్కాపండుగ సమయము సమీపమగుచున్నది, గనుక యేసు త్వరలోనే మరలా బయలుదేరును. ఆయన సమరయగుండా గలిలయకు ప్రయాణముచేయును. తన మరణమునకు ముందు ఈ ప్రాంతమును సందర్శించుట ఆయనకిదే చివరిసారి. గలిలయలో ఉండగా, బహుశ ఆయన, తన శిష్యులు, పస్కా ఆచరణకొరకు యెరూషలేముకు ప్రయాణమై వెళ్లువారితో కలిసియుండవచ్చును. వారు యొర్దాను నదికి తూర్పునగల పెరీయ జిల్లాగుండా ప్రయాణము సాగింతురు.
తన పర్యటన తొలిభాగములో, యేసు సమరయ లేక గలిలయలోని ఒక గ్రామములోనికి ప్రవేశించుచుండగా, పదిమంది కుష్ఠవ్యాధిగలవారు ఆయనకు ఎదురుపడుదురు. ఈ భయంకరమైన వ్యాధి వ్యక్తియొక్క శరీరభాగములను—అతని వ్రేళ్లు, కాలివ్రేళ్లు, చెవులు, ముక్కు మరియు పెదవులను క్రమేపి తినివేయును. ఇతరులకు ఆ వ్యాధిసోకకుండ, కుష్ఠరోగి విషయములో దేవుని ధర్మశాస్త్రము ఇట్లు చెప్పుచున్నది: “వాడు తన పైపెదవిని కప్పుకొని, ‘అపవిత్రుడను, అపవిత్రుడను’ అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ (వ్యాధి) వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; . . . గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను.”
ఆ పదిమంది కుష్ఠరోగులు ధర్మశాస్త్ర ఆంక్షలను పాటించి, యేసుకు దూరముగా నిలిచెదరు. అయినను, వారు బిగ్గరగా, “యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని” కేకలు వేయుదురు.
దూరముగావున్న వారిని చూచి యేసు, “మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని” ఆజ్ఞాపించును. యేసు ఇట్లు ఎందుకు చెప్పుననగా, కుష్ఠవ్యాధిగలవారు తమ వ్యాధినుండి నివారణ పొందినప్పుడు, వారు స్వస్థతపొందినట్లు యాజకులు ప్రకటించుటకై ధర్మశాస్త్రము వారికి అధికారమిచ్చుచున్నది. ఈ విధముగా అటువంటి వారు మరలా ఆరోగ్యవంతులైన ప్రజలతో కలిసిజీవించుటకు గుర్తింపు పొందుదురు.
యేసు కలిగియున్న అద్భుతశక్తులయందు ఆ పదిమంది కుష్ఠరోగులు నమ్మికను కలిగియుందురు. కావున వారింకను స్వస్థత పొందకపోయినను వారు త్వరగా యాజకులను చూచుటకు వెళ్లుదురు. వారు వెళ్లుచుండగా, యేసునందు వారికున్న విశ్వాసమునకు ఫలితము లభించును. వారు తమకు ఆరోగ్యము పునరుద్ధరింపబడుట స్వయంగా చూచి అనుభవించసాగిరి.
స్వస్థతపొందిన తొమ్మిదిమంది కుష్ఠరోగులు అట్లే వెళ్లగా, వారిలో కుష్ఠరోగియైన సమరయుడు యేసును వెదకుచు తిరిగివచ్చును. ఎందుకు? ఎందుకనగా అతడు తనకు సంభవించిన దానియెడల ఎంతో కృతజ్ఞత కలిగియున్నాడు. అతడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, యేసును కనుగొనినప్పుడు కృతజ్ఞతలు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడును.
దానికి జవాబుగా యేసు ఇట్లనును: “పదిమంది శుద్ధులైరికారా? ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా?”
అటు పిమ్మట ఆయన ఆ సమరయునితో, “నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” అని చెప్పును.
యేసు పదిమంది కుష్ఠరోగులను బాగుచేయుటనుగూర్చి మనము చదివినప్పుడు, “ఆ తొమ్మండుగురు ఎక్కడ?” అను ఆయన ప్రశ్నద్వారా సూచింపబడిన పాఠమును మనము హృదయమునకు తీసికొనవలెను. ఆ తొమ్మిదిమంది కనబరచిన కృతఘ్నత గంభీర తప్పిదమైయున్నది. దేవుని నూతన లోకములో నిత్యజీవమునుగూర్చిన నిశ్చయమైన వాగ్దానముతోసహా, దేవునినుండి మనము పొందు వాటికొరకు సమరయుని వలెనే మనమునూ కృతజ్ఞత చూపుదుమా? యోహాను 11:54, 55; లూకా 17:11-19; లేవీయకాండము 13:16, 17, 45, 46; ప్రకటన 21:3, 4.
▪ తనను చంపు ప్రయత్నములను యేసు ఎట్లు విఫలము చేయును?
▪ తర్వాత యేసు ఎక్కడికి వెళ్లును, మరియు ఆయన గమ్యము ఏమైయున్నది?
▪ కుష్ఠరోగులు ఎందుకు దూరమున నిలిచిరి, మరియు యేసు ఎందుకు వారిని యాజకులయొద్దకు వెళ్లుమని చెప్పును?
▪ ఈ అనుభవమునుండి మనమే పాఠము నేర్చుకొనవలెను?