కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెరూషలేము లోనికి క్రీస్తు విజయోత్సాహ ప్రవేశము

యెరూషలేము లోనికి క్రీస్తు విజయోత్సాహ ప్రవేశము

అధ్యాయము 102

యెరూషలేము లోనికి క్రీస్తు విజయోత్సాహ ప్రవేశము

ఆ మరునాడు, అనగా నీసాను 9 ఉదయము యేసు శిష్యులతో బేతనియ విడిచి ఒలీవకొండ మీదుగా యెరూషలేమువైపు ప్రయాణము సాగించును. కొద్దిసమయములోనే, వారు ఒలీవకొండ మీదనున్న బేత్పగేను సమీపించుదురు. యేసు తన శిష్యులలో ఇద్దరికి ఇట్లు ఉపదేశమునిచ్చును:

మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల, అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టును.”

ఈ ఉపదేశములు బైబిలు ప్రవచన నెరవేర్పుతో ఏమైనా సంబంధము కలిగియున్నదను విషయమును శిష్యులు మొదట గ్రహించకపోయినను, ఆ తర్వాత వారు దానిని గ్రహింతురు. జెకర్యా ప్రవక్త దేవుని వాగ్దాన రాజు ఒక గాడిదమీద, అవును “[ఆడు]గాడిదను గాడిద పిల్లను ఎక్కి” యెరూషలేముకు వెళ్లునని ముందుగానే చెప్పెను. రాజైన సొలొమోను అభిషేకింపబడుటకు ఇదేవిధముగా గాడిదపిల్లనెక్కి వెళ్లెను.

శిష్యులు బేత్పగేలో ప్రవేశించి గాడిదపిల్లను దాని తల్లిని కనుగొని వాటిని విప్పుచుండగా, అక్కడ నిలిచియున్న కొందరు, “మీరేమి చేయుచున్నారు?” అని అడుగుదురు. అయితే ఆ పశువులు ప్రభువు కొరకని చెప్పినప్పుడు, శిష్యులు వాటిని తోలుకొనిపోనిచ్చుదురు. శిష్యులు తమ పైవస్త్రములను తీసి తల్లి గాడిదమీదను దాని పిల్లమీదను పరచుదురు, కాని యేసు పిల్లగాడిదనెక్కి కూర్చొనును.

యేసు యెరూషలేమువైపు ప్రయాణమగుచుండగా, ప్రజలు అధికసంఖ్యలో సమకూడుదురు. వారిలో అనేకులు తమ వస్త్రములను దారి పొడుగున పరచుదురు, మరికొందరు చెట్లనుండి కొమ్మలు నరికి వాటిని దారి పొడుగున వేయుదురు. “యెహోవా పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక! . . . పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక!” అని వారు కేకలువేయుదురు.—NW.

ఈ సమూహములోని కొందరు పరిసయ్యులు ఈ కేకలు విని విసుగుచెంది యేసుకు ఇట్లు ఫిర్యాదు చేయుదురు: “బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము.” అయితే యేసు, “వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని” వారికి ప్రత్యుత్తరమిచ్చును.

యేసు యెరూషలేమును సమీపించుచుండగా, ఆయన పట్టణమునుచూసి విలపించుచు ఇట్లనును: “నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.” యెరూషలేము ఉద్దేశ్యపూర్వకముగా లోబడనందువలన, తగిన మూల్యము చెల్లించవలెను, అందుకే యేసు ఇట్లు ప్రవచించును:

“నీ శత్రువులు [సైనికాధికారియైన టైటస్‌ నడిపింపు క్రిందవచ్చు రోమా సైనికులు] నీ చుట్టు [సూదియైన కర్రలతో] గట్టుకట్టి ముట్టడివేసి, అన్నిప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి, నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చును.” యేసు ముందేచెప్పిన యెరూషలేముయొక్క ఈ నాశనము 37 సంవత్సరముల తర్వాత అనగా సా.శ. 70లో వాస్తవముగా జరుగును.

కేవలము కొన్ని వారముల క్రితమే, ఆ జనసమూహములోని అనేకులు యేసు లాజరును పునరుత్థానము చేయుట చూశారు. ఇప్పుడు వీరు ఆ అద్భుతమును గూర్చి ఇతరులతో చెప్పుదురు. కావున యేసు యెరూషలేములో ప్రవేశించునప్పుడు, ఆ పట్టణమంతయు కలవరపడును. “ఈయన ఎవరో?” అని ప్రజలు తెలిసికొనగోరుదురు. అప్పుడు జనసమూహములు, “ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు” అని చెప్పసాగుదురు. జరుగుచున్న దానిని చూచి, పరిసయ్యులు తాము ఏమియు చేయలేకపోవుచున్నామని విలపించుచు ఇట్లందురు: “ఇదిగో లోకము ఆయనవెంట పోయినది.”

యెరూషలేమును సందర్శించినప్పుడు తన వాడుకచొప్పున, యేసు బోధించుటకు ఆలయమునకు వెళ్లును. అక్కడ ఆయన యొద్దకు గ్రుడ్డివారు, కుంటివారు రాగా ఆయన వారిని బాగుచేయును! యేసు అద్భుతములను చేయుటను, మరియు ఆలయములోని పిల్లలు, “దావీదు కుమారునికి జయము” అని కేకలు వేయుటను వినినప్పుడు ప్రధానయాజకులు మరియు శాస్త్రులు కోపోదేక్రులగుదురు. “వీరు చెప్పుచున్నది వినుచున్నావా?” అని వారు అభ్యంతరము చెప్పుదురు.

అందుకు యేసు, “వినుచున్నాను, బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనుమాట మీరెన్నడు వినలేదా?” అని ప్రత్యుత్తరమిచ్చును.

యేసు బోధించుచునే, ఆలయమును ఒకసారి అన్నివైపులా చూచును. తర్వాత కొద్దిసమయమునకు చీకటిపడును. గనుక ఆయన తన 12 మంది శిష్యులతో ఆ స్థలమును విడిచి, 3 కిలోమీటర్లు వెనుకకు లేక బేతనియకు ప్రయాణమై వెళ్లును. ఆయనక్కడ, బహుశ తన స్నేహితుడైన లాజరు ఇంటిలో, ఆదివారము రాత్రి గడుపును. మత్తయి 21:1-11, 14-17; మార్కు 11:1-11; లూకా 19:29-44; యోహాను 12:12-19; జెకర్యా 9:9.

ఎప్పుడు, ఏ విధంగా యేసు యెరూషలేములో రాజుగా ప్రవేశించును?

జనసమూహములు యేసును ఘనపరచుట ఎంత ప్రాముఖ్యము?

యెరూషలేమును చూచినప్పుడు యేసు ఎట్లు బాధపడును, మరియు ఆయన ఏ ప్రవచనమును పలుకును?

యేసు ఆలయమునకు వెళ్లునప్పుడు ఏమి సంభవించును?