యెషయా ప్రవచనమును నెరవేర్చుట
అధ్యాయము 33
యెషయా ప్రవచనమును నెరవేర్చుట
పరిసయ్యులు, హేరోదు వర్గీయులు తనను చంపుటకు ప్రయత్నించుచున్నారని తెలిసికొనిన తర్వాత యేసు ఆయన శిష్యులు గలిలయ సముద్రమునకు వెళ్లుదురు. ఇక్కడకు పాలస్తీనా మరియు దాని సరిహద్దు ప్రాంతములనుండి బహుజన సమూహములు ఆయనయొద్దకు వచ్చుదురు. ఆయన అనేకులను స్వస్థపరచుచుండగా, రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుందురు.
జనసమూహములు విస్తారముగా ఉన్నందున, తన కొరకై ఎల్లప్పుడు ఒక దోనెను సిద్ధముగా ఉంచవలెనని యేసు తన శిష్యులకు చెప్పెను. దానిని ఒడ్డునుండి నీటిలోనికి తీసుకు వెళ్లుటద్వారా, జనసమూహములు తనమీద పడకుండ వారిని దూరముగా ఉంచగలడు. దోనెలోనేయుండి ఆయన వారికి బోధించగలడు లేక అలానే ప్రయాణమైవెళ్లి ఇతర ప్రజలకును అక్కడ సహాయము చేయగలడు.
శిష్యుడైన మత్తయి యేసుయొక్క పని, “ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పిన” దానిని నెరవేర్చెనని వ్రాసెను. ఆ పిమ్మట యేసు నెరవేర్చుచున్న ప్రవచనమును మత్తయి ఎత్తివ్రాసెను:
“ఇదిగో! ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు, ఈయనమీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు, విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే.”
అవును, యేసు దేవుడు అంగీకరించు ప్రియమైన సేవకుడైయున్నాడు. మరియు అబద్ధ మతాచారములద్వారా మరుగుచేయబడిన, నిజమైన న్యాయమును యేసు స్పష్టపరచును. దేవుని ధర్మశాస్త్రమును అన్యాయమైన రీతిలో వారు అన్వయించినందున, పరిసయ్యులు విశ్రాంతిదినమున రోగగ్రస్తమైన వ్యక్తినొద్దకు సహాయము చేయుటకైనను వచ్చెడివారుకారు. దేవుని న్యాయమును స్పష్టము చేయుటద్వారా యేసు అన్యాయపు ఆచారముల భారమునుండి ప్రజలకు విముక్తి కలిగించును, ఆయన ఆలాగు చేయుచున్నందుకు, మత నాయకులు ఆయనను చంప ప్రయత్నించుదురు.
‘ఆయన జగడమాడడు, కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు’ అని అనుటలో భావమేమి? ప్రజలను బాగుచేయునప్పుడు, యేసు ‘తనను ప్రసిద్ధిచేయవద్దని ప్రజలకు ఖండితముగా’ ఆజ్ఞాపించెను. ఆయన తననుగూర్చి వీధులలో కేకలువేసి ప్రచారము చేయవలెనని లేక తననుగూర్చి అనవసరమైన వార్తలను అమితోత్సాహముతో ఒకరితోనొకరు చెప్పుకోవలెనని కోరలేదు.
అదియేగాక, యేసు సాదృశ్యముగా నలిగిన రెల్లువలె కాళ్లక్రింద త్రొక్కబడుచున్న ప్రజలకు ఓదార్పుకరమైన వర్తమానమును ప్రకటించును. మరియు వారు ఆరిపోవుటకు సిద్ధముగాయున్న అవిసెనార ఒత్తివలె యున్నారు. యేసు నలిగిన రెల్లును విరువడు లేక పొగవిడుచుచు ఆరిపోవుటకు రెపరెపలాడుచున్న అవిసెనార వత్తిని అర్పడు. అయితే దీనులైన అట్టివారిని ఆయన ఆప్యాయతతో, ప్రేమతో నైపుణ్యముగా లేవనెత్తును. నిజముగా, యేసుపైననే జనాంగములు తమ నిరీక్షణను ఉంచగలరు! మత్తయి 12:15-21; మార్కు 3:7-12; యెషయా 42:1-4.
▪ జగడమాడక, వీధులలో కేకలు వేయక, యేసు ఎట్లు న్యాయమును స్పష్టముచేయును?
▪ ఎవరు నలిగిన రెల్లువలె, మకమకలాడు ఒత్తివలె ఉన్నారు, మరియు యేసు వారిని ఎట్లుచూచును?