యెహోవా ఆరాధన కొరకైన ఆసక్తి
అధ్యాయము 16
యెహోవా ఆరాధన కొరకైన ఆసక్తి
యేసు సహోదరులు—మరియ ఇతర కుమారులెవరనగా—యాకోబు, యోసేపు, సీమోను యూదా అనువారు. వీరందరు యేసు మరియు ఆయన శిష్యులతో కలిసి గలిలయ సముద్రమునకు సమీపమునగల కపెర్నహూమను పట్టణమునకు ప్రయాణమై వెళ్లుటకు ముందు, కావలిసిన వస్తువులను కుటుంబము తీసుకొనుటకు బహుశ వారు నజరేతులోని తమ గృహమునొద్ద ఆగుదురు.
అయితే యేసు తనపరిచర్యను కానాలోను, నజరేతులోను లేక గలిలయ కొండ ప్రాంతమునందున్న మరియే ఇతర ప్రాంతములందు కొనసాగించక కపెర్నహూమునకే ఎందుకు వెళ్లును? ఒక కారణమేమనగా, కపెర్నహూము ప్రఖ్యాతిచెందిన పెద్ద పట్టణము, మరియు యేసు క్రొత్తగా సమకూర్చుకొనిన శిష్యులలో ఎక్కువమంది కపెర్నహూములోను, సమీపప్రాంతములలోను నివసించువారు, కనుక వారు ఆయననుండి తర్ఫీదు పొందుటకు తమ గృహములను విడిచివెళ్లవలసిన అగత్యత ఉండదు.
కొన్నినెలల తర్వాత వాటినిగూర్చి ఆయనే సాక్ష్యమిచ్చినట్లు, యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు అనేక అద్భుతకార్యములను చేయును. కాని త్వరలోనే యేసు తన సహచరులతోపాటు మరలా ప్రయాణము కొనసాగించును. సా.శ. 30 వ సంవత్సరపు వసంతకాలములోని, పస్కాకు హాజరయ్యేందుకై వారు యెరూషలేముకు వెళ్లుచున్నారు. అక్కడవుండగా, ఆయన శిష్యులు బహుశ యేసునుగూర్చి వారు ముందెన్నడు చూడనిదాన్ని ఇప్పుడు చూస్తారు.
దేవుని ధర్మశాస్త్రము ప్రకారము, ఇశ్రాయేలీయులు జంతువులను బలి అర్పించవలసి యున్నారు. అందునుబట్టి, దీనికొరకు వారికి అనువుగానుండునట్లు యెరూషలేములోని వ్యాపారులు జంతువులను పక్షులను అమ్ముదురు. కాని వారు దేవాలయములోనే వాటిని అమ్ముట మొదలుపెట్టారు, పైగా వారు ఎక్కువధరకు అమ్ముచు ప్రజలను మోసగించుచున్నారు.
యేసు ఆగ్రహముతో నిండుకొని త్రాళ్లతో కొరడాచేసి అమ్మువారిని తరిమివేయును. రూకలుమార్చువారి రూకలు చల్లివేసి బల్లలను పడద్రోయును. ఆయన పావురములు అమ్మువారితో బిగ్గరగా, “వీటిని ఇక్కడనుండి తీసుకొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పెను.”
యేసు శిష్యులు దీనిని చూసినప్పుడు, “నీ ఇంటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది” అని దేవుని కుమారునిగూర్చి చెప్పిన ప్రవచనమును జ్ఞప్తికి తెచ్చుకొందురు. అయితే యూదులు, “నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచకక్రియను మాకు చూపెదవని” ఆయనను అడిగిరి. అందుకు యేసు, “ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని” వారికి జవాబిచ్చెను.
అక్షరార్థమైన దేవాలయమునుగూర్చి యేసు మాట్లాడుచున్నాడని యూదులు తలంచిరి, కావున వారిట్లడిగిరి: “ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా?” అయితే, యేసు తన శరీరమను దేవాలయమునుగూర్చి మాట్లాడుచున్నాడు. మూడు సంవత్సరముల తరువాత, ఆయన మృతులలోనుండి లేచినప్పుడు ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటలను జ్ఞప్తికి తెచ్చుకొందురు. యోహాను 2:12-22; మత్తయి 13:55; లూకా 4:23.
▪ కానాలో వివాహము తర్వాత, యేసు ఏ ప్రదేశములకు ప్రయాణమయ్యెను?
▪ యేసు ఎందుకు ఆగ్రహించును, మరియు ఆయన ఏమిచేయును?
▪ ఆయన చర్యలను చూచినప్పుడు యేసు శిష్యులు ఏమిజ్ఞప్తికి తెచ్చుకొందురు?
▪ “ఈ దేవాలయమును” గూర్చి యేసు ఏమిచెప్పును, దాని విషయమై ఆయన భావమేమి?