యేసుకు కలిగిన శోధనలనుండి నేర్చుకొనుట
అధ్యాయము 13
యేసుకు కలిగిన శోధనలనుండి నేర్చుకొనుట
బాప్తిస్మము తీసికొనిన వెంటనే, యేసు దేవుని ఆత్మవలన యూదా అరణ్యమునకు కొనిపోబడును. ఆయన ఆలోచించవలసినది చాలావున్నది, ఏలయనగా పరలోక సంగతులను వివేచించునట్లు, ఆయన బాప్తిస్మమప్పుడు “ఆకాశము తెరవబడెను.” నిజముగా, ఆయన ధ్యానించవలసినది చాలావున్నది.
యేసు 40 దినములు 40 రాత్రులు అరణ్యములో గడుపును, ఆయన ఈ సమయములో ఏమియు తినలేదు. అంతట, యేసు బహుగా ఆకలిగొనియున్న ఈ సమయములో, శోధించుటకు అపవాది ఆయనయొద్దకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.” అయితే తన అద్భుత శక్తులను తన స్వకీయ కోరికలను సంతృప్తిపరచుకొనుటకై ఉపయోగించుట తప్పని యేసు ఎరిగియున్నాడు. కావున ఆయన శోధింపబడుటకు నిరాకరించును.
అయితే అపవాది ఆయనను విడిచిపెట్టలేదు. అతడు మరొకవిధముగా ప్రయత్నించును. దేవుని దూతలు అతని సంరక్షించునని చెప్పుచు, దేవాలయ ప్రాకారమునుండి క్రిందికి దుముకుమని అతడు యేసును సవాలుచేయును. అయితే అటువంటి సాహసము చేయుటకు యేసు శోధింపబడలేదు. లేఖనములనుండి ఎత్తిచూపుచు, దేవుని ఈ విధముగా పరీక్షించుట తప్పని యేసు చూపించును.
మూడవసారి శోధించుచు, అపవాది అద్భుతరీతిగా యేసుకు ఈ లోక రాజ్యములన్నింటిని చూపించుచు, “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పెను.” అయితే దేవుని యెడల నమ్మకముగా ఉండుటకు ఎన్నుకొనుచు, యేసు మరలా తప్పిదమునకు నడుపు శోధనలో పడలేదు.
యేసుకు కలిగిన ఈ శోధనలనుండి మనము నేర్చుకొనవచ్చును. ఉదాహరణకు, కొంతమంది చెప్పునట్లుగా అపవాది కేవలము ఒక చెడు లక్షణము కాదని, అయితే అతడు ఒక నిజమైన, అదృశ్యమైన వ్యక్తియని అవి చూపించుచున్నవి. యేసుకు కలిగిన శోధన, లోక ప్రభుత్వములన్నియు అపవాది సొత్తనికూడ చూపించుచున్నది. అవి నిజముగా అతనివికానట్లయిన, అపవాది వాటిని క్రీస్తుకు ఇవ్వజూపుట ఎట్లు నిజమైన శోధన కాగలదు?
మరియు దీనిని ఆలోచించుము: కేవలము ఒక ఆరాధనాపూర్వక నమస్కారము చేసినంత మాత్రముననే, ప్రతిఫలముగా యేసుకు ఈ లోక రాజ్యములన్నిటిని ఇచ్చుటకు తానిష్టపడుచున్నానని అపవాది చెప్పును. అదేరీతిన మనము లోక సంపదను, అధికారమును, లేక ఆశకల్గించే ఇహలోక హోదాను సంపాదించుకొను అవకాశములను బహుశ మనముందుంచుచు మనలను శోధించుటకు అపవాది ప్రయత్నించవచ్చును. అయితే శోధన ఎటువంటిదైనను దేవునియెడల నమ్మకముగా నిలిచియుండుటద్వారా యేసుయొక్క మాదిరిని మనము అనుసరించుట ఎంత జ్ఞానయుక్తము! మత్తయి 3:16; 4:1-11; మార్కు 1:12, 13; లూకా 4:1-13.
▪ అరణ్యములో తానుండిన 40 దినములు యేసు స్పష్టముగా ఏ సంగతులను ధ్యానించుచుండెను?
▪ యేసును శోధించుటకు అపవాది ఎట్లు ప్రయత్నించును?
▪ యేసుకు కలిగిన శోధనలనుండి మనమేమి నేర్చుకొనగలము?