యేసును హత్యచేయుటకు చేసిన ఇతర ప్రయత్నములు
అధ్యాయము 81
యేసును హత్యచేయుటకు చేసిన ఇతర ప్రయత్నములు
అది చలికాలమైనందున, యేసు సొలొమోను మంటపము అనబడిన స్థలములో నీడపట్టున నడచుచున్నాడు. అది దేవాలయమునకు వారగా ఉన్నది. ఇక్కడ యూదులు యేసును చుట్టిముట్టి, “ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.”
అందుకు యేసు, “మీతో చెప్పితిని గాని మీరు నమ్మరని” ప్రత్యుత్తరమిచ్చును. తాను బావినొద్ద సమరయ స్త్రీతో చెప్పినట్లే, యేసు సూటిగా తాను క్రీస్తునని చెప్పలేదు. అయినను, మీరు క్రిందివారు, నేను పైనుండువాడను అని, అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని వివరించినప్పుడే, ఆయన వాస్తవానికి తన గుర్తింపును గూర్చి వారికి బయలుపరచాడు.
అయితే క్రీస్తు ఏమి నెరవేర్చునని బైబిలు చెప్పెనో వాటితో ఆయన కార్యములను పోల్చిచూచుటద్వారా ఆయన క్రీస్తని ప్రజలు తమంతటతామే తుదినిర్ణయమునకు రావలెనని యేసు కోరును. అందుకే యేసు అంతకుముందు తాను క్రీస్తునను మాటను ఎవరికి చెప్పవద్దని తన శిష్యులకు ఆజ్ఞాపించును. అందువలననే యేసు ఇప్పుడు తనను వ్యతిరేకించు యూదులతో ఇంకను ఇట్లనును: “నేను నా తండ్రినామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే . . . మీరు నమ్మరు.”
వారెందుకు నమ్మరు? యేసే క్రీస్తనుటకు రుజువు తక్కువైనందుకా? కాదు, అయితే దానికిగల కారణమును యేసు వారితో చెప్పినప్పుడు ఇట్లు వివరించును: “మీరు నా గొర్రెలలో చేరినవారుకారు . . . నా గొర్రెలు నాస్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నాతండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు.”
ఆ పిమ్మట యేసు తన తండ్రితో తనకున్న సన్నిహిత సంబంధమును వర్ణించుచు ఇట్లు వివరించును: “నేనును తండ్రియును ఏకమైయున్నాము.” యేసు భూమిపైనను ఆయన తండ్రి పరలోకములోనూ ఉన్నందున, తాను తనతండ్రి అక్షరార్థముగా, లేక భౌతికముగా ఏకమైయున్నారని ఆయన స్పష్టముగా చెప్పుటలేదు. బదులుగా, వారు సంకల్పమందు ఏకమైయున్నారని అనగా వారు ఐక్యమత్యము కలిగియున్నారని ఆయన భావము.
యేసు మాటలకు కోపోద్రేకులైన యూదులు, ఇంతకుముందు గుడారముల, లేక పర్ణశాలల పండుగ సమయములో చేసినట్లుగానే, ఆయనను చంపుటకు రాళ్లు చేతపట్టుకొందురు. “తనను చంపబోవువారి ఎదుట యేసు ధైర్యముగా నిలువబడి, “తండ్రియొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు?” అని వారినడుగును.
అందుకు వారు, “నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుముగాని మంచి క్రియచేసినందుకు కాదు” అని జవాబిత్తురు. యేసు ఎన్నడు తాను దేవుడని చెప్పుకొనకపోయినను, యూదులు ఎందుకు ఈ మాట అందురు?
ఎందుకనగా కేవలము దేవునికి మాత్రమే చెందినవని వారు విశ్వసించిన శక్తులను యేసు, తనకు కలవని చెప్పినందుననే వారట్లందురు. ఉదాహరణకు, యేసు ఇంతకుముందే, “గొర్రెలను” గూర్చి చెప్పుచు, “నేను వాటికి నిత్యజీవమిచ్చెదను” అనెను. దీనిని ఏ మానవుడును చేయలేడు. అయితే, తాను తన తండ్రియొద్దనుండి అధికారమును పొందుచున్నానని యేసు అంగీకరిస్తున్నాడనే వాస్తవమును యూదులు ఉపేక్షింతురు.
తాను దేవునికంటె తక్కువవాడని చెప్పుకొనుచూ, యేసు ఆ పిమ్మట ఇట్లడుగుటద్వారా చూపించును: “‘మీరు దైవములని’ నేనంటినని మీ ధర్మశాస్త్రములో [కీర్తన 82:6 లో] వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా? దేవునివాక్యమెవరికి వచ్చెనో వారే ‘దైవములని’ చెప్పినయెడల, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో ‘నీవు దేవదూషణ చేయుచున్నావని’ చెప్పుదురా?”
లేఖనములు, అన్యాయస్థులైన మానవ న్యాయాధిపతులను సహితము “దైవములని” పిలుచుచుండగా యేసు, “నేను దేవుని కుమారుడనని” చెప్పినందుకు ఈ యూదులు ఆయనలో ఏ తప్పుపట్టగలరు? యేసు ఇంకను ఇట్లనును: “నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలు నమ్ముడి.”
యేసు ఈ మాటలు చెప్పినప్పుడు, యూదులు ఆయనను పట్టుకొనవలెనని ప్రయత్నింతురు, గాని ఇంతకుముందు పర్ణశాలల పండుగ సమయములో చేసినట్లుగానే ఆయన తప్పించుకొనిపోవును. ఆయన యెరూషలేమును విడిచిపెట్టి, దాదాపు నాలుగు సంవత్సరముల క్రితము యొర్దాను అద్దరిని స్నానికుడైన యోహాను బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు వెళ్లును. ఈ స్థలము స్పష్టముగా గలిలయ సముద్రతీర దక్షిణభాగమునకు ఎంతో దూరములో లేదు, యెరూషలేమునుండి ఇక్కడకు ప్రయాణము చేయుటకు రమారమి రెండురోజులు పట్టును.
అనేకులు ఈ స్థలములో ఆయనయొద్దకు వచ్చి, “యెహాను ఏ సూచక క్రియను చేయలేదుగాని ఈయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవని” చెప్పుదురు. ఆ విధముగా ఇక్కడ అనేకులు యేసునందు విశ్వాసముంచుదురు. యోహాను 10:22-42; 4:26; 8:23, 58; మత్తయి 16:20.
▪ ఏ ఆధారమునుబట్టి ప్రజలు తనను క్రీస్తుగా గుర్తించవలెనని యేసు కోరును?
▪ యేసు, ఆయన తండ్రి ఎట్లు ఏకమైయున్నారు?
▪ యేసు తననుతాను దేవునిగా చేసికొనుచున్నాడని స్పష్టముగా, యూదులు ఎందుకు చెప్పుదురు?
▪ యేసు కీర్తననుండి ఎత్తిచూపిన వాక్యము తాను దేవునితో సమానునిగా చేసికొనుటలేదని ఎట్లు చూపుచున్నది?