యేసు జన్మము—ఎక్కడ మరియు ఎప్పుడు?
అధ్యాయము 5
యేసు జన్మము—ఎక్కడ మరియు ఎప్పుడు?
రోమా సామ్రాజ్య చక్రవర్తియైన కైసరు ఔగుస్తు, ప్రతివారు తమ స్వంత పట్టణమునకు తిరిగివెళ్లి తమ పుట్టుకను నమోదు చేయించుకొనవలెనని శాసించెను. కాబట్టి యోసేపు తను పుట్టిన పట్టణమగు బేత్లెహేమునకు ప్రయాణమై వెళ్లును.
నమోదు చేయించుకొనుటకు బేత్లెహేమునకు ప్రజలు అధికసంఖ్యలో వచ్చారు, కాగా యోసేపు మరియలకు విడిది చేయుటకు ఒక కొట్టము తప్ప వేరొక స్థలమేదియు లభించలేదు. గాడిదలు ఇతర పశువులు కట్టివేయబడు ఈ స్థలమందు యేసు జన్మించును. మరియ అతనిని పొత్తిగుడ్డలతో చుట్టి, పశువులకు మేతవేయు తొట్టిలో పరుండబెట్టును.
నిశ్చయముగా దేవుని నడిపింపు క్రిందనే కైసరు ఔగుస్తు, నమోదు చేయుటను గూర్చి శాసించును. వాగ్దానము చేయబడిన పరిపాలకుడు జన్మించు స్థలమని లేఖనములు ఎంతోకాలము ముందుగనే ప్రవచింపబడిన, ఈ బేత్లెహేము పట్టణములోనే యేసు జన్మించుటకు ఇది వీలుకల్పించినది.
ఇది ఎంత ప్రాముఖ్యమైన రాత్రి! బయట పొలములలోవున్న కొంతమంది గొర్రెల కాపరుల చుట్టూ తెల్లని వెలుగు ప్రకాశించెను. అది యెహోవా మహిమయైయున్నది! అప్పుడు యెహోవా దూత వారితో ఇట్లనును: “భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు.” వెంటనే అనేకమంది దూతలు ప్రత్యక్షమై ఇలా పాడిరి: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక.”
దూతలు వెళ్లిపోయినప్పుడు, గొర్రెల కాపరులు ఒకరితోనొకరు ఇట్లు చెప్పుకొందురు: “జరిగిన ఈ కార్యమును యెహోవా మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేము వరకు వెళ్లి చూతము రండి.” అంతట వారు త్వరగావెళ్లి దూత తమకు చెప్పినచోటుననే యేసును కనుగొందురు. దూత తమకు చెప్పిన విషయమును ఆ గొర్రెల కాపరులు వివరించినప్పుడు, వినిన వారందరు విస్మయమొందుదురు. మరియ ఆ మాటలన్నియు తన హృదయములో భద్రము చేసికొని, ఆనందించును.
ఈనాడు అనేకమంది ప్రజలు యేసు డిశంబరు 25న జన్మించెనని నమ్ముదురు. అయితే బేత్లెహేములో డిశంబరు వర్షించు కాలమును, శీతాకాలమునైయున్నది. సంవత్సరములోని ఆ కాలములో గొర్రెల కాపరులు తమ మందలను కాయుచు రాత్రిసమయములందు పొలములయందుండరు. అంతేకాకుండ, తనపై అప్పటికే తిరుగుబాటు చేయుటకు మొగ్గుచూపుచున్న ప్రజలను ఎముకలు కొరికే ఆ చలికాలములో నమోదు చేయించుకొనుటకు ప్రయాణము కావలెనని రోమా కైసరు బహుశ కోరడు. నిజానికి యేసు ఆ సంవత్సరపు శరత్కాల తొలిభాగములో జన్మించెను. లూకా 2:1-20; మీకా 5:2.
▪ యోసేపు మరియలు బేత్లెహేముకు ఎందుకు ప్రయాణమయ్యారు?
▪ యేసు జన్మించిన రాత్రి ఎటువంటి ఆశ్చర్యకరమైన సంగతి జరుగును?
▪ యేసు డిశంబరు 25న జన్మించలేదని మనకెట్లు తెలియును?