కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు తన వ్యతిరేకులను నిందించుట

యేసు తన వ్యతిరేకులను నిందించుట

అధ్యాయము 109

యేసు తన వ్యతిరేకులను నిందించుట

యేసు తన మత వ్యతిరేకులను ఎంత తీవ్రముగా కలవరపరచెనంటే, వారు ఆయనను ఇకపై ఏమైనను అడుగుటకు భయపడుదురు. కావున ఆయన చొరవ తీసికొని వారి అజ్ఞానమును బహిర్గతము చేయును. “క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు?” ఆయన వారినడుగును.

“దావీదు కుమారుడు” అని పరిసయ్యులు జవాబిత్తురు.

దావీదు క్రీస్తు లేక మెస్సీయయొక్క శరీర సంబంధమైన పితరుడను విషయమును నిరాకరించకపోయినను, యేసు ఇట్లడుగును: “ఆలాగైతే ‘నేను నీ శత్రువులను నీ పాదములక్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని’ యెహోవా నా ప్రభువుతో చెప్పెను” అని దావీదు ఆయనను ‘ప్రభువని’ ప్రేరేపింపబడి ఏల చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ‘ప్రభువని’ చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగును?”—NW.

పరిసయ్యులు మౌనముగా ఉందురు, ఏలయనగా క్రీస్తు, లేక అభిషక్తుని నిజమైన గుర్తింపు వారికి తెలియదు. నిజముగా పరిసయ్యులు నమ్మునట్లు మెస్సీయ దావీదుయొక్క మానవసంబంధమైన వారసుడు మాత్రమే కాదు, అయితే ఆయన పరలోకమందు ఉనికిలో ఉండెను, కావున ఆయన దావీదుకంటె ఉన్నతుడు, లేక ప్రభువై యున్నాడు.

ఇప్పుడు జనసమూహములు మరియు తన శిష్యులవైపు తిరిగి, యేసు శాస్త్రులనుగూర్చి, పరిసయ్యులనుగూర్చి హెచ్చరించును. వీరు “మోషే పీఠమందు కూర్చున్నవారై,” దేవుని ధర్మశాస్త్రము బోధింతురు, కావున యేసు ఇట్లు ఉద్బోధించును: “వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగైకొనుడి.” అయితే ఆయనింకను ఇట్లనును: “అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.”

వారు వేషధారులై యున్నారు, కొన్ని నెలల క్రితము ఒక పరిసయ్యుని ఇంట భోజనము చేయునప్పుడు ఆయన ఎట్లు మాట్లాడెనో అదే ధోరణిలో యేసు వారిని నిందించును. వారు “మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు” అని ఆయన అనును. మరియు ఆయన సంబంధిత ఉదాహరణలను ఈలాగు చెప్పును:

వారు “తమ రక్షరేకులు [లేఖనములు వ్రాసియుంచిన చిన్న పెట్టెలు] వెడల్పు చేయుదురు.” ఇవి చాలా చిన్నిపెట్టెలు, నిర్గమకాండము 13:1-10, 11-16; ద్వితీయోపదేశకాండము 6:4-9; 11:13-21 నందలి ధర్మశాస్త్రముయొక్క నాలుగుభాగములు ఉంచబడిన వీటిని వారు నుదుటిమీద లేక చేతులకు కట్టుకొనెడివారు. అయితే పరిసయ్యులు తాము ధర్మశాస్త్రము యెడల ఆసక్తిని కలిగియున్నామను భావమును కల్గించుటకు ఆ పెట్టెల పరిమాణమును పెద్దగా చేయుదురు.

యేసు ఇంకను ఇట్లనును: వారు “తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు.” సంఖ్యాకాండము 15:38-40 లో ఇశ్రాయేలీయులు తమ వస్త్రముల అంచులకు కుచ్చులుండవలెనని ఆజ్ఞాపింపబడిరి, అయితే పరిసయ్యులు తమ చెంగులను అందరికంటె పెద్దవిగా చేయుదురు. ప్రతిదీ డంబముగా ప్రదర్శించుటకు చేయబడెడిది! “వారు . . . అగ్రపీఠములను . . . కోరుదురని” యేసు వెల్లడించును.

విచారకరముగా, తన స్వంత శిష్యులుకూడ ప్రధానత్వము కొరకైన ఈ కోరికచే ప్రభావితులైరి. కావున యేసు వారినిట్లు హెచ్చరించును: “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు.” నేను మొదటివాడనై యుండవలెనను కోరికను శిష్యులు తమలోనుండి తీసివేయవలెను. “మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను” అని యేసు మందలించును.

ఆయన ఆ పిమ్మట శాస్త్రులు పరిసయ్యులను వేషధారులని పదేపదే పిలుచుచు, అనేక శ్రమలను వారిపై ప్రకటించును. వారు “మనుష్యులయెదుట పరలోక రాజ్యమును మూసివేయుదురని,” “విధవరాండ్ర యిండ్లు దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురని” ఆయన చెప్పును.

“అయ్యో, అంధులైన మార్గదర్శకులని” అని యేసు అనును. తోచినరీతిలో తమను ప్రత్యేకించుకొనుటద్వారా నిరూపించబడిన వారి ఆత్మీయ విలువల కొరతను యేసు ఖండించును. ఉదాహరణకు వారు, ‘ఒకడు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొంటే ఏమియు కాదుగాని, అతడు దేవాలయముయొక్క బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే అతడు బాధ్యతగలవాడగునని’ చెప్పుదురు. ఆరాధన స్థలముకంటే దేవాలయపు బంగారము మీద ఎక్కువ ప్రాముఖ్యతను నిలుపుటద్వారా వారు తమ నైతిక అంధత్వమును బహిర్గతము చేయుచున్నారు.

ఆ పిమ్మట యేసు అంతకుముందు చేసినట్లే, పదియవ వంతు, లేక లెక్కలోలేని కూరమొక్కలలో పదియవ భాగమునకు అధిక ప్రాధాన్యతనిచ్చుచు, “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా కనికరమును విశ్వాసమును” నిర్లక్ష్యము చేయుచున్న పరిసయ్యులను ఖండించును.

యేసు పరిసయ్యులను “అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు” అని పిలుచును. వారు తమ ద్రాక్షరసమందలి దోమను, ఒక కీటకముగా కాదుగాని ఆచారబద్ధముగా అది అపవిత్రమని దానిని వడగట్టి తొలగించెడివారు. అయితే, ఆచారబద్ధముగా అపవిత్రమైన ఒంటెను సహితము మ్రింగుటకు పోల్చదగిన ధర్మశాస్త్రమందలి బరువైన విషయములను వారు లక్ష్యపెట్టలేదు. మత్తయి 22:41–23:24; మార్కు 12:35-40; లూకా 20:41-47; లేవీయకాండము 11:4, 21-24.

కీర్తన 110 లో దావీదు చెప్పిన దానినిగూర్చి యేసు ప్రశ్నించినప్పుడు పరిసయ్యులు ఎందుకు మౌనముగా ఉన్నారు?

పరిసయ్యులు లేఖనముగల పెట్టెలను, తమ వస్త్రపు చెంగులను ఎందుకు పెద్దవిగా చేయుదురు?

యేసు తన శిష్యులకు ఏ సలహానిచ్చును?

తమకు తోచినరీతిలో పరిసయ్యులు ఎట్లు తమను ప్రత్యేకించుకొందురు, బరువైన విషయములను నిర్లక్ష్యముచేసినందుకు యేసు వారినెట్లు ఖండించును?