యేసు బాప్తిస్మము పొందుట
అధ్యాయము 12
యేసు బాప్తిస్మము పొందుట
యోహాను ప్రకటించుట కారంభించిన దాదాపు ఆరు నెలలకు, 30 సంవత్సరముల వయస్సున్న, యేసు యొర్దాను దగ్గరనున్న యోహానునొద్దకు వచ్చును. ఎందుకొరకు? ఊరకనే చూసివెళ్దామనా? యోహాను పని ఎలా జరుగుచున్నదో చూద్దామను శ్రద్ధను మాత్రమే యేసు కలిగియున్నాడా? లేదు, యేసు తనకు బాప్తిస్మమివ్వవలెనని యోహానును అడుగును.
అందుకు యోహాను వెంటనే అభ్యంతరము తెల్పుచు ఇట్లనును: “నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?” తన తోబుట్టువైన యేసు దేవుని ప్రత్యేక కుమారుడని యోహానుకు తెలుసు. అంతెందుకు, యేసు తన గర్భమందున్న కాలములో మరియ వారిని పరామర్శించ వచ్చినప్పుడు యోహాను సంతోషముతో తన తల్లి గర్భమందు గంతులు వేసెను! ఆ తర్వాత యోహాను తల్లియగు, ఎలీసబెతు నిస్సందేహముగా దీనినిగూర్చి ఆయనకు చెప్పియుండెను. అంతేకాకుండ, యేసు జన్మమునుగూర్చి దూతచేసిన ప్రకటననుగూర్చియు, ఆలాగే యేసు జన్మించిన రాత్రి గొర్రెల కాపరులకు దూతలు ప్రత్యక్షమగుటనుగూర్చి కూడ ఆమె ఆయనకు చెప్పియుండవచ్చును.
కాబట్టి యోహానుకు యేసు క్రొత్తవాడేమి కాదు. తానిచ్చు బాప్తిస్మము యేసుకొరకు కాదనియు యోహానుకు తెలుసు. అది తమ పాపముల విషయమై పశ్చాత్తాపము పొందినవారి కొరకే, అయితే యేసు పాపము లేనివాడు. అయినను, యోహాను నివారించుచున్నను, యేసు ఆయననిట్లు బలవంతపెట్టును: “ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.”
యేసు బాప్తిస్మము తీసికొనుట ఎందుకు సరియైయున్నది? ఎందుకనగా యేసు తీసికొనే బాప్తిస్మము పాపముల విషయమై పశ్చాత్తాపము నొందుటకు కాదుగాని, తన తండ్రి చిత్తము నెరవేర్చుటకు తననుతాను సమర్పించుకొనుటకు అది చిహ్నమైయున్నది. యేసు వడ్రంగిగా పనిచేస్తూనే వుండును, అయితే ఇప్పుడు యెహోవా దేవుడు తనను భూమికి దేనిని చేయుటకు పంపెనో ఆ పరిచర్యను ప్రారంభించుటకు సమయము వచ్చింది. యేసుకు బాప్తిస్మమిచ్చునప్పుడు అసాధారణమైనదేదైనా జరుగునని యోహాను ఎదురుచూచునని మీరనుకొనుచున్నారా?
యోహాను ఆ తర్వాత ఇట్లనుచున్నాడు: “నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు, ‘నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని’ నాతో చెప్పెను.” కాబట్టి తాను బాప్తిస్మమిచ్చు వారిలో ఒకరిమీదకు దేవుని ఆత్మ వచ్చునని ఎదురుచూచుచుండెను. అందుకే బహుశ, యేసు నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చినప్పుడు, “దేవుని ఆత్మ పావురమువలె దిగి ఆయన మీదికి వచ్చుటను” యోహాను చూచినప్పుడు తాను నిజముగా ఆశ్చర్యపడలేదు.
అయితే యేసు బాప్తిస్మము తీసికొనుచుండగా దానికంటే ఎక్కువ సంభవించెను. ‘ఆయనకు పైగా ఆకాశము తెరవబడెను.’ దీని భావమేమి? స్పష్టముగా దీని భావమేమనగా ఆయన బాప్తిస్మము పొందుచుండగా, పరలోకమందలి తన మానవపూర్వ జీవితము ఆయనకు జ్ఞాపకము వచ్చెను. ఆ విధముగా యేసు తన మానవపూర్వ ఉనికినందు పరలోకములో దేవుడు తనతో మాట్లాడిన సంగతులన్నిటితోసహా, యెహోవా దేవుని ఆత్మీయకుమారునిగా తన జీవితమునుగూర్చి ఇప్పుడు పూర్తిగా జ్ఞాపకము చేసికొనుచున్నాడు.
దానికితోడు, ఆయన బాప్తిస్మమప్పుడు, పరలోకమునుండి ఒక స్వరము ఇట్లు చెప్పును: “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” అది ఎవరి స్వరము? యేసు స్వంత స్వరమా? కానేకాదు! అది దేవుని స్వరము. నిజముగా, యేసు దేవుని కుమారుడే, గానీ కొంతమంది చెప్పునట్లుగా ఆయన దేవుడు కాదు.
అయితే, మొదటి మనుష్యుడగు ఆదాము వలెనే, యేసు దేవుని మానవ కుమారుడై యున్నాడు. యేసు బాప్తిస్మమునుగూర్చి వివరించుచు, తర్వాత శిష్యుడగు లూకా ఇట్లు వ్రాయుచున్నాడు: “యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు, ఆయన ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి, హేలీ . . . దావీదుకు, దావీదు . . . అబ్రాహాముకు, అబ్రాహాము . . . నోవహుకు, నోవహు . . . ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.”
ఆదాము దేవునికి మానవ “కుమారునిగా” యున్నట్లుగానే, యేసుకూడ దేవుని కుమారుడే. యేసు జీవించిన వారిలోకెల్లా మహాగొప్పవాడై యున్నాడు, యేసు జీవితమును మనము పరిశీలించినప్పుడు ఇది స్పష్టమగును. అయితే యేసు, బాప్తిస్మముద్వారా దేవునితో ఒక క్రొత్త సంబంధంలోనికి ప్రవేశించి, దేవుని ఆత్మీయ కుమారుడుకూడ అగును. మృతతుల్యమైన మానవజాతి కొరకు తన మానవ జీవితమును శాశ్వతముగా బలి ఇచ్చుటకు నడిపించు జీవన విధానమును ఆయన ఆరంభించునట్లు చేయుటద్వారా, దేవుడు ఇప్పుడు ఆయనను మరలా పరలోకమునకు పిలుచుచున్నాడన్నట్లున్నది. మత్తయి 3:13-17; లూకా 3:21-38; 1:34-36, 44; 2:10-14; యోహాను 1:32-34; హెబ్రీయులు 10:5-9.
▪ యోహానుకు యేసు ఎందుకు అపరిచయస్థుడు కాడు?
▪ ఆయన ఏ పాపము చేయలేదు గనుక, యేసు ఎందుకు బాప్తిస్మము తీసికొనెను?
▪ యేసునుగూర్చి యోహాను ఎరిగియున్నదాని దృష్ట్యా, యేసుపైకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఆశ్చర్యపడక పోవచ్చును?