యేసు మరణము సమీపించుచుండగా శిష్యులు వాదించుకొనుట
అధ్యాయము 98
యేసు మరణము సమీపించుచుండగా శిష్యులు వాదించుకొనుట
యేసు ఆయన శిష్యులు యొర్దాను నదిని సమీపించి, వారు అక్కడ పెరీయ జిల్లానుండి యూదయలోనికి దాటుదురు. సా.శ. 33లో ఇంకా కొద్దిరోజులే లేక ఒక వారము మాత్రమేవున్న, పస్కాను ఆచరించుటకు వారితోపాటు అనేకులు బయలుదేరి వచ్చుదురు.
యేసు శిష్యులకు ముందుగా నడచుచుండగా, శిష్యులు ఆయన దృఢ సంకల్పమునకు ఆశ్చర్యపడుదురు. కొన్ని వారముల క్రితము లాజరు చనిపోయినప్పుడు, యేసు పెరీయనుండి యూదయకు పోనైయుండగా, తోమా ఇతరులతో, “ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదము” రండని ప్రోత్సహించుటను గుర్తుతెచ్చుకొనండి. లాజరును పునరుత్థానము చేసిన పిదప, యూదుల మహాసభ యేసును చంపుటకు పథకములు వేసెనను విషయమునుకూడ గుర్తుతెచ్చుకొనండి. కావున వారిప్పుడు యూదయను సమీపించుచుండగా శిష్యులను భయము ఆవరించెననుటలో ఆశ్చర్యమేమియు లేదు.
ముందున్న దానికొరకు వారిని సిద్ధపరచుటకై, యేసు ఆ 12 మందిని ఏకాంతముగా ప్రక్కకు తీసికొనిపోయి వారికిట్లు చెప్పును: “ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి, ఆయనమీద ఉమ్మివేసి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును, చంపుటకును (NW), అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.”
తన మరణ పునరుత్థానములనుగూర్చి ఇటీవల నెలలలో యేసు తన శిష్యులతో చెప్పుట ఇది మూడవసారి. ఆయన చెప్పునది వినుచున్నను, వారు విషయమును గ్రహింపరు. ఎందుకంటే బహుశ, వారు ఇశ్రాయేలు రాజ్యము భూమిపైనే పునరుద్ధరింపబడునని నమ్మి, క్రీస్తుతో ఆ భూరాజ్యమందు మహిమాఘనతలను అనుభవించవలెనని ఎదురుచూచు చుండవచ్చును.
పస్కాను ఆచరించుటకు వెళ్లుచున్న వారిలో అపొస్తలులగు యోహాను యాకోబుల తల్లియైన సలోమే ఉన్నది. నిస్సందేహముగా వారు కలిగియున్న ఉగ్రస్వభావమునుబట్టి యేసు వీరిని, “ఉరిమెడి వారని” పిలిచెను. వీరిద్దరు కొంతకాలముగా క్రీస్తు రాజ్యమందు ప్రముఖస్థానమును కలిగియుండవలెనను ఆశను పెంచుకొని, తమకోరికను వారు తమ తల్లికి తెలియజేసిరి. కాగా ఆమె ఇప్పుడు వారి తరపున యేసును సమీపించి, ఆయనకు నమస్కారముచేసి అనుగ్రహము చూపుమని వేడుకొనును.
“నీవేమి కోరుచున్నావని” యేసు ఆమెను అడుగును.
అందుకామె, “నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని” ప్రత్యుత్తరమిచ్చును.
ఆ విన్నపము వెనుకవున్నదెవరో గ్రహించినవాడై యేసు యోహాను, యాకోబులతో ఇట్లనును: “మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా?”
“త్రాగగలమని” వారు జవాబిత్తురు. తాను భయంకరమైన హింసను ఆ తర్వాత మరణమును ఎదుర్కొనబోవుచున్నానని యేసు ఇంతకుముందే చెప్పినను, ఆయన త్రాగబోవు “గిన్నె” అనగా ఇదేనని వారు నిజంగా అర్థం చేసికోలేరు.
అయినప్పటికిని, యేసు వారితో ఇట్లనును: “మీరు నా గిన్నెలోనిది త్రాగుదురుగాని నా కుడివైపునను, నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నాతండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకును.”
అంతలో యోహాను యాకోబులు అడిగిన విషయము మిగతా పదిమంది అపొస్తలులకు తెలిసి, వారు కోపగించుకుంటారు. అపొస్తలులలో ఎవరు గొప్ప అని అంతకుముందు జరిగిన వాదములో బహుశ యోహాను యాకోబులు ప్రముఖముగా మాట్లాడియుందురు. అయితే వారి ప్రస్తుత విన్నపము వారికి యేసు ఈ విషయమై ఇచ్చిన సలహాను వారు అన్వయించలేదని బయల్పరచుచున్నది. ప్రముఖులుగా యుండవలెనను వారి కోరిక ఇంకను బలముగా ఉండుట విచారకరమే.
ఈ తాజా వివాదమును, అందువల్ల వారిలో కలిగిన అపార్థమును తొలగించుటకు, యేసు ఆ 12 మందిని పిలిచి, “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యడైయుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను” అని ప్రేమతో వారిని ఉపదేశించును.
వారు అనుకరించులాగున యేసు వారికొరకు మాదిరినిచ్చెను. ఆయన వారికిట్లు వివరించును: “ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును వచ్చెను.” యేసు ఇతరుల పక్షముగా పరిచారము చేయుటకు మాత్రమేకాక మానవజాతికొరకు చనిపోవునంతగా అలాచేయును! శిష్యులుకూడా క్రీస్తు కలిగియున్న మనస్సును కలిగియుండి సేవచేయించుకొనుటకు బదులుగా సేవచేయవలెనని, ప్రముఖ స్థానమునకు బదులు తక్కువవారిగా యుండవలెనను కోరికను కలిగియుండవలెను. మత్తయి 20:17-28; మార్కు 3:17; 9:3-37; 10:32-45; లూకా 18:31-34; యోహాను 11:16.
▪ శిష్యులనిప్పుడు భయమెందుకు ఆవరించును?
▪ ముందున్న దానికొరకు యేసు ఎట్లు తన శిష్యులను సిద్ధము చేయును?
▪ యేసుకు ఏ విన్నపము చేయుదురు, మరియు ఇతర అపొస్తలులపై అది ఎట్టి ప్రభావము చూపును?
▪ తన అపొస్తలుల మధ్యగల సమస్యను యేసు ఎట్లు పరిష్కరిస్తాడు?