యేసు మరలా యెరూషలేముకు వెళ్లుట
అధ్యాయము 82
యేసు మరలా యెరూషలేముకు వెళ్లుట
యేసు త్వరలోనే మరలా ప్రయాణమై పట్టణములలోను గ్రామములలోను బోధించుచు వెళ్లుట కారంభించును. స్పష్టముగా ఆయన యూదయలోని యొర్దాను అద్దరినున్న పెరీయ జిల్లాలో ఉన్నాడు. అయితే ఆయన గమ్యము యెరూషలేము.
కేవలము పరిమిత సంఖ్యలో మాత్రమే రక్షణకు అర్హులగుదురను యూదామత తత్వమును బట్టియే బహుశ ఒక మనుష్యుడు ఇట్లడుగుటకు అతని పురికొల్పియుండవచ్చును: “ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందియేనా?” తన జవాబుతో, యేసు రక్షణకొరకు ఏమి కావలసియున్నదో ప్రజలు తలంచునట్లు పురికొల్పును: “ఇరుకు ద్వారమున ప్రవేశింప తీవ్రముగా [అనగా, సంఘర్షణపూర్వకముగా, లేక విపరీతముగా ప్రయాసపడి] పోరాడుడి.”—NW.
అటువంటి తీవ్రపోరాటము అవసరము ఎందుకనగా యేసు ఇంకను ఇట్లనును: “అనేకులు ప్రవేశింప జూతురుగాని వారివలన కాదు.” వారికెందుకు సాధ్యము కాదు? ‘ఇంటి యజమానుడు లేచి తలుపుకు తాళమువేసిన తరువాత ప్రజలు బయట నిలువబడి తలుపుతట్టుచు, “అయ్యా, తలుపు తీయుమని” అని అందురు, అప్పుడాయన వారితో ఇట్లనును: “మీ రెక్కడివారో మిమ్మును ఎరుగను, . . . అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును” అని ఆయన వివరించును.
ద్వారము వెలుపటనున్నవారు స్పష్టముగా తమకు అనుకూలమైన సమయములో వచ్చిరి. అయితే అప్పటికే అవకాశమను ద్వారము వేయబడి గడియపెట్టబడును. దానిలో ప్రవేశించుటకు, వారికి కొంత అసౌకర్యము కలిగించినను, వారు ముందుగనే రావలసియుండిరి. యెహోవా ఆరాధనను జీవితములో ముఖ్యసంకల్పముగా చేయని వారికొరకు నిజముగా దుఃఖకర ఫలితము వేచియున్నది!
పరిచర్య నిమిత్తం యేసు ఎవరియొద్దకు వెళ్లెనో ఆ యూదులు, అధికభాగము రక్షణకొరకు దేవుడుచేసిన ఏర్పాటును అంగీకరించు అద్భుతమైన అవకాశమును జారవిడుచుకొనిరి. కాబట్టి బయటకు నెట్టివేయబడినప్పుడు వారు విలపించి పండ్లుకొరుకుదురని యేసు చెప్పును. మరొకవైపున, ప్రజలు “తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియు,” అవును, అన్ని జనాంగములలోనుండి “వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు.”
యేసు ఇంకను ఇట్లనును: “ఇదిగో కడపటి వారిలో కొందరు [నీచముగా చూడబడిన యూదులు కానివారు, ఆలాగే పీడిత యూదులు] మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు [వస్తుదాయకముగా మతసంబంధముగా అనుగ్రహముగల యూదులు] కడపటి వారగుదురు.” వారు కడపటివారనుటలో భావమేమనగా అటువంటి సోమరులు, కృతఘ్నలు దేవుని రాజ్యములో అసలు ఉండనేవుండరు.
ఇప్పుడు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి: “నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు [అంతిప] నిన్ను చంపగోరుచున్నాడని” చెప్పుదురు. యేసు ఆ ప్రాంతమునుండి పారిపోవలెనని హేరోదు స్వయంగా ఈ వదంతిని పుట్టించియుండ వచ్చును. స్నానికుడైన యోహానును హత్యచేయుటలో చిక్కుకున్నట్లు, దేవుని మరొక ప్రవక్త హత్యయందు చిక్కుకొనుటకు హేరోదు భయపడి యుండవచ్చును. అయితే యేసు పరిసయ్యులతో ఇట్లనును: “మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, ‘ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణసిద్ధిపొందెదను.’”
అక్కడ తన పని ముగించిన తర్వాత, యేసు యెరూషలేమువైపు తన ప్రయాణము సాగించును, ఎందుకనగా ఆయన వివరించునట్లు, “ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు.” యేసు యెరూషలేమునందు చంపబడునని ఎందుకు అనుకొనవలెను? ఎందుకనగా యెరూషలేము ముఖ్యపట్టణము, అక్కడనే 71 మంది సభ్యులుగల యూదుల ప్రధాన న్యాయసభ కలదు మరియు అక్కడనే జంతుబలులు అర్పించబడును. అందువలన, “దేవుని గొర్రెపిల్ల” యెరూషలేములో తప్ప మరెక్కడను చంపబడుట స్వీకరింపరానిదై యుండును.
“యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలక్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నోమారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది” అని యేసు ప్రలాపించును. దేవుని కుమారుని తృణీకరించినందుకు, ఆ జనాంగము నాశనమునకు సిద్ధముచేయబడియున్నది!
యేసు యెరూషలేమువైపు సాగిపోవుచుండగా, పరిసయ్యుల అధికారి ఒకరు ఆయనను తన ఇంటికి ఆహ్వానించును. అది విశ్రాంతిదినము, మరియు అక్కడ జలోదర వ్యాధితో, బహుశ కాళ్లుచేతులలో నీరుచేరి బాధపడుచున్న మనుష్యుడు ఒకడు ఉన్నందున, ప్రజలు ఆయన ఏమి చేయునోయని జాగ్రత్తగా కనిపెట్టుకొనియుందురు. అక్కడవున్న పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను ఉద్దేశించి యేసు, “విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?” అని ప్రశ్నించును.
ఎవరును ఒక్కమాటకూడ మాట్లాడరు. కావున యేసు అతని స్వస్థపరచి పంపివేయును. ఆ పిమ్మట ఆయనిట్లడుగును: “మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా?” మరలా, ఎవరును ఏ ప్రత్యుత్తరమియ్యరు. లూకా 13:22–14:6; యోహాను 1:29.
▪ రక్షణకు ఏది అవసరమని యేసు చూపించుచున్నాడు, మరియు అనేకులు ఎందుకు ద్వారము బయటనే ఉంచబడుదురు?
▪ మొదటి వారైన “కడపటి” వారెవరు, మరియు కడపడి వారైన “మొదటి” వారెవరు?
▪ బహుశ హేరోదు యేసును చంపగోరుచున్నాడని ఎందుకు అనుకొనబడినది?
▪ ప్రవక్త యెరూషలేము వెలుపట నశించుట ఎందుకు స్వీకరించదగినది కాదు?