యేసు మరియు జ్యోతిష్కులు
అధ్యాయము 7
యేసు మరియు జ్యోతిష్కులు
తూర్పునుండి కొంతమంది మనుష్యులు వత్తురు. వారు జ్యోతిష్కులు—నక్షత్రముల స్థానములనుగూర్చి భావము చెప్పెదమని చెప్పుకొనెడి మనుష్యులు. వారు తూర్పుదేశములో వున్నప్పుడు, వారొక క్రొత్త నక్షత్రమును చూసి, దానిని అనుసరించి వందల కిలోమీటర్ల దూరములోనున్న యెరూషలేమునకు వత్తురు.
ఈ జ్యోతిష్కులు యెరూషలేముకు వచ్చినవెంటనే, ఇట్లడుగుదురు: “యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఆయనకు పూజింప (వందనముచేయ NW) వచ్చితిమి.”
యెరూషలేమునందలి హేరోదు రాజు దీనినిగూర్చి వినినప్పుడు, అతడెంతో కలవరపడును. అందువలన అతడు యాజకులలో ముఖ్యులను పిలిచి క్రీస్తు ఎక్కడ జన్మించునని వారినడుగును. “బేత్లెహేములో” అని వారు లేఖనములను ఆధారము చేసికొని జవాబిచ్చుదురు. దానితో, హేరోదు జ్యోతిష్కులను పిలిపించి, వారితో ఇట్లనును: “మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి.” అయితే, నిజానికి, హేరోదు శిశువును కనుగొని చంప నుద్దేశించును!
వారు వెళ్లిన తర్వాత, ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరుగును. వారు తూర్పున ఉండగా చూచిన నక్షత్రము వారికి ముందుగా నడచును. స్పష్టముగా, ఇది సామాన్యమైన నక్షత్రము కాదు, అది వారిని నడిపించుటకు ప్రత్యేకముగా ఏర్పాటుచేయబడినది. జ్యోతిష్కులు అది సరిగ్గా యోసేపు మరియలు ఉన్న ఇంటి మీదికివచ్చి ఆగునంత వరకు దానిని అనుసరించి వెళ్లుదురు.
జ్యోతిష్కులు ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు, వారు చిన్నిబాలుడైన యేసుతోపాటున్న మరియను కనుగొని, సాగిలపడి ఆయనకు నమస్కరింతురు. మరియు వారు తమ సంచులు విప్పి, బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పింతురు. ఆ తర్వాత, వారు వెనుదిరిగి పిల్లవాడు ఎక్కడవున్నదీ హేరోదుకు చెప్పవలెనని వెళ్లబోవుచుండగా, అలాచేయవద్దని వారు స్వప్నమందు దేవునిచే హెచ్చరింపబడిరి. కాబట్టి వారు మరియొక మార్గమున తమ స్వదేశమునకు వెళ్లుదురు.
ఆకాశములో కదులుచు జ్యోతిష్కులను నడిపించిన నక్షత్రమును ఎవరు ఏర్పాటుచేసిరని మీరనుకొనుచున్నారు? ఆ నక్షత్రము వారిని సూటిగా బేత్లెహేములోనున్న యేసునొద్దకు నడిపించలేదని గుర్తుతెచ్చుకొనుము. బదులుగా, వారు యెరూషలేమునకు నడిపించబడి, అక్కడ వారు యేసును చంప నుద్దేశించిన హేరోదును కలిసికొనిరి. దేవుడు ఒకవేళ కలుగజేసుకొని, యేసు ఎక్కడ ఉన్నదీ హేరోదుకు చెప్పవద్దని జ్యోతిష్కులను హెచ్చరించక పోయినట్లయిన, అతడు బాలుని చంపియుండేవాడే. యేసును చంపించవలెనని కోరిన దేవుని శత్రువగు అపవాదియగు సాతాను, తన సంకల్పమును నెరవేర్చు ప్రయత్నములో ఆ నక్షత్రమును ఉపయోగించెను. మత్తయి 2:1-12; మీకా 5:2.
▪ జ్యోతిష్కులు చూసిన నక్షత్రము సామాన్యమైన నక్షత్రము కాదని ఏది చూపించుచున్నది?
▪ జ్యోతిష్కులు యేసును కనుగొనినప్పుడు ఆయన ఎక్కడ ఉండెను?
▪ జ్యోతిష్కులను నడుపుటకు సాతాను ఆ నక్షత్రమును ఏర్పాటుచేసెనని మనకెందుకు తెలియును?