యేసు మరియు ధనవంతుడైన ఒక యువ అధికారి
అధ్యాయము 96
యేసు మరియు ధనవంతుడైన ఒక యువ అధికారి
యేసు పెరీయ జిల్లాగుండా యెరూషలేమువైపు ప్రయాణించుచుండగా, ఒక యౌవనుడు పరుగెత్తుకొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూనును. ఆ మనుష్యుడు అధికారియని పిలువబడుచున్నాడు, బహుశ అతడు స్థానిక సమాజమందిరములో ప్రముఖ స్థానమును కలిగివున్నాడు, లేక యూదుల మహాసభ సభ్యుడై యున్నాడు. అంతేకాకుండ అతడు చాలా ధనవంతుడు. అతడు, “సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును?” అని అడుగును.
అందుకు యేసు, “నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడేగాని మరి ఎవడును సత్పురుషుడు కాడు” అని జవాబిచ్చును. ఆ యువకుడు బహుశ “సత్పురుషుడు” అనుమాటను బిరుదుగా ఉపయోగించియుండవచ్చును, కావున అటువంటి బిరుదు కేవలము దేవునికి మాత్రమే చెందునని యేసు అతనికి తెల్పును.
యేసు ఇంకను కొనసాగించుచు, “నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞను గైకొనుమని” చెప్పును.
అతడు, “ఏ ఆజ్ఞలు?” అని అడుగును.
పది ఆజ్ఞలలో ఐదింటిని ఎత్తిచూపుచు, యేసు ఇట్లు సమాధానమిచ్చును: “నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము.” యేసు మరొక ప్రాముఖ్యమైన ఆజ్ఞనుకూడ చేర్చుచు, “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అని చెప్పును.
అందుకు ఆ యువకుడు పూర్ణయథార్థతతో ‘నా చిన్నతనమునుండియే ఇవన్నియు అనుసరించుచున్నాను; ఇకను నాకు కొదువ ఏమి’ అని ప్రత్యుత్తరమిచ్చును.
ఆ మనుష్యుని ప్రగాఢ విన్నపమును వినిన యేసుకు అతనిపై ప్రేమ కలుగును. అయితే యేసు వస్తుసంపత్తియెడల అతనికున్న మక్కువను గ్రహించి, అతనికి అవసరమైన దానిని ఇట్లు సూచించును: “నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవువచ్చి నన్ను వెంబడించుము.”
ఆ మనుష్యుడు లేచి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్లుచుండగా, యేసు గమనించి నిస్సందేహముగా అతనిని జాలితో చూచును. అతని సంపద, నిజమైన ధనముయొక్క విలువ విషయములో అతని గ్రుడ్డివాని చేసినది: “ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభము!” అని యేసు విచారముతో చెప్పును.
యేసు మాటలు శిష్యులను ఆశ్చర్యపరచును. అయితే యేసు ఈ సాధారణ నియమమును చెప్పినప్పుడు వారు మరియెక్కువ ఆశ్చర్యపడుదురు: “ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.”
“అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని” శిష్యులు తెలుసుకొనగోరుదురు.
యేసు వారివైపు సూటిగాచూచి, “ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే” అనును.
ధనవంతుడైన ఆ యువ అధికారికి భిన్నముగా తాము ఎన్నిక చేసికొనియున్నామని తెల్పుచు, పేతురు ఇట్లనును: “మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి.” అని అనుచు ఆయన ఇట్లడగును: “మాకేమి దొరుకును?”
“పునఃస్థితిస్థాపనమందు, మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు” అని యేసు వాగ్దానము చేయును. అవును, ఏదెను వనములో మొదట ఎటువంటి పరిస్థితులుండెనో ఆలాగే భూమిపై పరిస్థితులు పునఃస్థాపింపబడునని యేసు చూపుచున్నాడు. పేతురు మరియు ఇతర శిష్యులు ఈ భూవ్యాప్త పరదైసును క్రీస్తుతోపాటు పరిపాలించు ఫ్రతిఫలమును పొందుదురు. నిశ్చయముగా, అటువంటి దివ్య ప్రతిఫలము ఎటువంటి త్యాగము పొందుటకైనను అర్హమైనది!
అయితే, “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రనైనను, తలిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందును” అని యేసు స్థిరముగా చెప్పుచున్నట్లు, ఇప్పుడును ప్రతిఫలములు కలవు.
యేసు వాగ్దానము చేయుచున్నట్లు, తన శిష్యుడు లోకములో ఎక్కడికి పోయినను, తమ స్వంత కుటుంబసభ్యులకంటె, తోటి క్రైస్తవులతో వారు ఎంతో అమూల్యమైన సన్నిహిత సంబంధమును అనుభవించుదురు. ధనవంతుడైన ఆ యువ అధికారి స్పష్టముగా ఈ ప్రతిఫలమును, దేవుని పరలోక రాజ్యమందు నిత్యజీవమును పోగొట్టుకొనుచున్నాడు.
ఆ తర్వాత యేసు ఇంకను ఇట్లనును: “మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.” ఆయన భావమేమి?
ధనవంతుడైన ఆ యువ అధికారి అనుభవించినటువంటి మత ఆధిక్యతలను, “మొదటివారిగా” అనుభవించు అనేకమంది ప్రజలు, రాజ్యములో ప్రవేశింపరని ఆయన భావమైయున్నది. వారు “కడపటివారగుదురు.” అయితే యేసుయొక్క దీనులైన శిష్యులతోపాటు, స్వనీతిపరులైన పరిసయ్యులచే “కడపటివారిగా” నీచముగా చూడబడిన—మట్టి మనుష్యులు, లేక ‘ఆమ్‌హారెట్స్—అనేకులు “మొదటి” వారగుదురు. వారు “మొదటి” వారగుదురనుట అనగా రాజ్యమందు క్రీస్తు తోటిపరిపాలకులుగా తయారగు ఆధిక్యతను వారు పొందుదురని దాని భావము. మార్కు 10:17-31; మత్తయి 19:16-30; లూకా 18:18-30.
▪ స్పష్టముగా, ధనికుడైన ఆ యువకుడు ఎటువంటి అధికారియై యున్నాడు?
▪ సద్బోధకుడని పిలువబడుటకు యేసు ఎందుకు అభ్యంతరము చెప్పును?
▪ ధనవంతులుగా ఉండుటలోని ప్రమాదమును ఆ యువ అధికారి అనుభవము ఎట్లు దృష్టాంతపరచుచున్నది?
▪ తన అనుచరులకు యేసు ఎటువంటి ప్రతిఫలములను వాగ్దానము చేయుచున్నాడు?
▪ మొదటివారు కడపటివారిగా, మరియు కడపటివారు మొదటివారిగా ఎట్లు అగుదురు?