కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు యెరికోలో ప్రకటించుట

యేసు యెరికోలో ప్రకటించుట

అధ్యాయము 99

యేసు యెరికోలో ప్రకటించుట

త్వరలోనే యేసు మరియు ఆయనతో ప్రయాణించుచున్న జనసమూహములు యెరికోకు చేరుకొందురు. ఈ పట్టణము యెరూషలేముకు ఒకరోజు ప్రయాణమంత దూరములో ఉన్నది. యెరికో నిజంగా జంటనగరమైయున్నది, రోమీయుల క్రొత్త నగరమునకు యూదుల పాత నగరము, దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరములో ఉన్నది. జనసమూహములు పాతనగరమును విడిచి క్రొత్త నగరమును సమీపించుచుండగా, గ్రుడ్డివారైన ఇద్దరు భిక్షగాండ్రు ఈ సందడి వినిరి. అందులో ఒకనిపేరు బర్తిమయి.

అటుగా వెళ్లునది యేసు అని తెలుసుకొనిన వారై, బర్తిమయి మరియు అతనితో ఉన్నవాడు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుము!” అని బిగ్గరగా కేకలు వేయనారంభింతురు. జనసమూహములు ఊరకుండుడని గట్టిగా గద్దించినప్పుడు వారు మరింత బిగ్గరగా, “ప్రభువా, దావీదు కుమారుడా మమ్ము కరుణింపుము!” అని కేకలు వేయుదురు.

దూరమునుండి ఆగోల విని, యేసు ఆగును. అలా కేకలు వేయుచున్న వారిని పిలువుమని తనతోయున్నవారికి ఆయన చెప్పును. వారు ఈ గ్రుడ్డివారైన భిక్షకుల యొద్దకువచ్చి వారిలో ఒకనితో, “ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని” చెప్పుదురు. ఆ గ్రుడ్డివాడు అమితానందముతో తన బట్టనుపారవేసి దిగ్గునలేచి, యేసునొద్దకు వచ్చును.

“నేను మీకేమి చేయగోరుచున్నారని” యేసు వారినడుగును.

ఆ ఇద్దరు గ్రుడ్డివారు, “ప్రభువా, మా కన్నులు తెరవవలెనని” వేడుకొందురు.

యేసు కనికరముతో కదిలింపబడినవాడై, వారి కన్నులు ముట్టును. మార్కు వృత్తాంతము ప్రకారము, యేసు వారిలో ఒకనితో ఇట్లు చెప్పును: “నీవు వెళ్లము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను.” ఆ వెంటనే గ్రుడ్డిభిక్షకులు చూపుపొందురు, మరియు నిస్సందేహముగా వారిద్దరు దేవుని మహిమపరచ నారంభింతురు. జరిగినదానిని ప్రజలందరు చూసినప్పుడు, వారుకూడ దేవుని స్తుతించిరి. వెంటనే బర్తిమయి అతని సహవాసి, ఆయనను వెంబడింప నారంభించుదురు.

యేసు యెరికోగుండా వెళ్లుచుండగా, ఆయనవెంట బహుజన సమూహములు ఉందురు. ప్రతివారు గ్రుడ్డివారిని బాగుచేసిన ఆయనను చూడవలెనని కోరుచున్నారు. ప్రజలు అన్నివైపులనుండి యేసువైపు రాసాగుదురు, తత్ఫలితముగా, కొందరికి ఆయనను చూసే అవకాశమే చిక్కదు. వీరిలో యెరికో, ఆ చుట్టుప్రక్క ప్రాంతములందున్న సుంకరులపై ముఖ్యునిగాయున్న జక్కయ్య ఒకడు. అతడు జరుగుచున్న దానిని చూచుటకు వీలుకానంత పొట్టివాడు.

కావున జక్కయ్య ముందుగా పరుగెత్తుకొని వెళ్లి యేసు వచ్చు దారిలోవున్న మేడిచెట్టు ఎక్కును. పైనుండి ఇప్పుడు అతడు జరుగు ప్రతిదానిని స్పష్టముగా చూడగలడు. జనసమూహములు ఆ చోటికి వచ్చినప్పుడు, యేసు పైకిచూచి, “జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని” అతనితో చెప్పును. జక్కయ్య సంతోషముతో చెట్టుదిగి తన గృహమును సందర్శించనైయున్న విశిష్ఠమైన వ్యక్తి కొరకు అన్నియు సిద్ధము చేయుటకు వేగముగా యింటికి వెళ్లును.

అయితే, జరుగుచున్న దానిని ప్రజలు గమనించినప్పుడు వారు సణుగుకొన నారంభింతురు. అటువంటి మనుష్యుని ఇంటికి యేసు అతిథిగా వెళ్లుట అనుచితమని వారు ఆలోచించుదురు. జక్కయ్య పన్ను వసూలుచేయు తన వ్యాపారమందు మోసముతో డబ్బులాగి ధనవంతుడయ్యాడని మీరు గమనింతురు.

యేసు జక్కయ్య ఇంటిలో ప్రవేశించినప్పుడు, అనేకమంది ప్రజలు అనుసరించి వచ్చి ఇట్లు ఫిర్యాదు చేయుదురు: “ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెను.” అయినను యేసు జక్కయ్యలో మారుమనస్సుకు తగిన అవకాశముండుటను గమనించును. అనుకున్నట్లే యేసుకు నిరాశ కలుగదు, ఏలయనగా జక్కయ్య లేచి నిలువబడి ఇట్లు ప్రకటించును: “ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగింతలు మరల చెల్లింతును.”

ఆస్తిలో సగభాగమును బీదలకిచ్చుటద్వారా మిగతా సగము తాను మోసముచేసిన వారికి తిరిగి చెల్లించుటకు ఉపయోగించుటద్వారా జక్కయ్య తన మారుమనస్సు నిజమైనదని నిరూపించును. తన దగ్గరున్న సుంకపు వివరములు వ్రాసియున్న పుస్తకములద్వారా స్పష్టముగా లెక్కలుచూచి ఈ వ్యక్తులకు తానెంత అచ్చియున్నాడో అతడు తెలుసుకొనవచ్చును. కావున, “ఒకడు . . . గొర్రెను దొంగిలించినయెడల . . . ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలెను” అని చెప్పిన ధర్మశాస్త్రము ప్రకారము, అతడు నాలిగింతలు చెల్లింతునని ప్రమాణము చేయును.

జక్కయ్య తన ఆస్తిని ఈ విధముగా పంచిపెట్టుదునని వాగ్దానము చేసినవిధము యేసును ప్రీతిపరచును, ఎందుకనగా ఆయనిట్లనును: “ఇతడు అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను.”

ఇటీవలెనే, యేసు తప్పిపోయిన కుమారుని కథచెప్పి ‘పొగొట్టుకొనిన’ పరిస్థితిని ఉదహరించి చెప్పెను. ఇప్పుడు పొగొట్టుకొనబడిన వ్యక్తి తిరిగి కనుగొనబడుటను గూర్చిన నిజ-జీవిత ఉదాహరణను మనము కలిగియున్నాము. జక్కయ్యలాంటి వ్యక్తులయెడల యేసు శ్రద్ధవహించుట విషయములో మతనాయకులు మరియు వారిని వెంబడించు ఇతరులు సణుగుచు ఫిర్యాదులు చేసినను, యేసు అబ్రాహాముయొక్క పొగొట్టుకొనబడిన ఈ కుమారులను వెదకి వారిని పునరుద్ధరించు పనిని కొనసాగించును. మత్తయి 20:29-34; మార్కు 10:46-52; లూకా 18:35–19:10; నిర్గమకాండము 22:1.

స్పష్టముగా యేసు ఎక్కడ, గ్రుడ్డివారైన భిక్షగాండ్రను కలియును, మరియు ఆయన వారికొరకు ఏమిచేయును?

జక్కయ్య ఎవరు, మరియు ఆయనెందుకు చెట్టు ఎక్కును?

జక్కయ్య తన మారుమనస్సును ఎట్లు రుజువు పరచును?

యేసు జక్కయ్యను చూచిన విధానమునుండి మనమే పాఠము నేర్చుకొనగలము?