కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు సజీవుడాయెను!

యేసు సజీవుడాయెను!

అధ్యాయము 128

యేసు సజీవుడాయెను!

యేసు ఉంచబడిన సమాధి ఖాళీగా ఉండుట ఆ స్త్రీలు చూచినప్పుడు, మగ్దలేనే మరియ పేతురు, యోహానులతో చెప్పుటకై పరుగెత్తును. అయితే, ఇతర స్త్రీలు సమాధినొద్దనే వుందురు. ఆ వెంటనే, దేవదూత ప్రత్యక్షమై వారిని లోనికి ఆహ్వానించును.

ఇక్కడ స్త్రీలు మరొక దేవదూతను చూతురు, ఈ దేవదూతలలో ఒకరు వారితో ఇట్లనును: “మీరు భయపడకుడి, వ్రేలాడదీయబడిన (NW) యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలముచూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి.” కావున భయముతోను మహా ఆనందముతోను, ఈ స్త్రీలుకూడా పరుగెత్తుదురు.

ఇంతలో, మరియ పేతురు, యోహానులను కనుగొని వారికిట్లు తెలియజేయును: “ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగము.” వెంటనే ఆ ఇద్దరు అపొస్తలులును పరుగెత్తుదురు. యోహాను—చిన్నవాడైనందున—త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు చేరును. అప్పటికి స్త్రీలు అక్కడనుండి వెళ్లిపోయారు, కాబట్టి ఆ చుట్టుప్రక్కల ఎవరు లేరు. యోహాను సమాధిలోకి తొంగిచూడగా, అతనికి నారబట్టలు పడియుండుట మాత్రము కనబడును, అయితే అతడు బయటనే ఉండును.

పేతురు వచ్చినప్పుడు, అతడు తడవుచేయక లోనికివెళ్లును. అక్కడ అతడు చుట్టిన నారబట్టలు పడియుండుట, ఆలాగే యేసు తలచుట్టూ కట్టుటకు ఉపయోగించిన వస్త్రమును చూచును. అది వేరుగా ఒకచోట చుట్టబడియున్నది. ఇప్పుడు యోహానుకూడ సమాధిలోనికి ప్రవేశించి మరియ చెప్పినదానిని నమ్మును. అయితే యేసు తాను లేచెదనని తరుచు వారితో చెప్పినను, పేతురుగాని యోహానుగాని ఆయన లేచెనను విషయమును గ్రహింపరు. విభ్రాంతితో ఆ ఇద్దరు ఇంటికి వెళ్లుదురు, అయితే మరలా సమాధియొద్దకు వచ్చిన మరియ అక్కడనే ఉండిపోవును.

అదే సమయములో, ఇతర స్త్రీలు యేసు పునరుత్థానుడయ్యెనను విషయమును, దేవదూతలు తమకు ఆజ్ఞాపించినట్లు శిష్యులకు చెప్పవలెనను తొందరలో ఉన్నారు. వారు అలా సాధ్యమైనంత వేగముగా పరుగెత్తుచుండగా, యేసు వారిని ఎదుర్కొని, “మీకు శుభము” అని చెప్పును. వారాయన పాదములపైబడి నమస్కారము చేయుదురు. ఆ పిమ్మట యేసు వారితో, “భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి” అని చెప్పును.

అంతకుముందు, భూకంపము కలిగి దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు, కావలిగాయున్న సైనికులు భీతిల్లి చచ్చినవారివలె ఉండిరి. ఆ తర్వాత వారు తేరుకొనినప్పుడు, వెంటనే పట్టణములోనికి పరుగెత్తివెళ్లి జరిగినదానిని ప్రధానయాజకులతో చెప్పుదురు. యూదులలోని “పెద్దలతో” సంప్రదించిన పిదప వారు సైనికులకు లంచమిచ్చి విషయమును రహస్యముగా ఉంచుటకు ప్రయత్నించవలెనని తీర్మానించి, “మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తుకొనిపోయిరని” చెప్పవలెనని వారికాజ్ఞాపించుదురు.

కావలి స్థానములలో నిద్రపోతే రోమా సైనికులకు మరణదండన విధించబడును గనుక, యాజకులు వారికిట్లు వాగ్దానము చేయుదురు: “ఇది [మీరు నిద్రపోయిన సంగతి] అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుము.” చాల ద్రవ్యము లంచమివ్వబడెను గనుక, సైనికులు వారు చెప్పినట్లే చేయుదురు. తత్ఫలితముగా, యేసు దేహము దొంగిలించబడెనను తప్పుడు వార్త యూదులలో బహుగా వ్యాప్తిచెందును.

సమాధి దగ్గరనే ఉండిపోయిన మగ్దలేనే మరియ, బహు దుఃఖపడుచున్నది. యేసు ఎక్కడ ఉన్నాడో? అలా ఆమె సమాధిలోనికి వంగి చూడగా, మరలా ప్రత్యక్షమైన ఇద్దరు దేవదూతలను ఆమెచూచును! యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చొనియున్నారు. “అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావు?” అని వారడుగుదురు.

అందుకు మరియ, “నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని” ప్రత్యుత్తరమిచ్చును. “అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావు” అని అదే ప్రశ్నను ఎవరో అడుగుట విని ఆమె వెనుకతట్టు తిరిగి చూడగా, ఆ వ్యక్తి ఇంకను ఇట్లు ప్రశ్నించును: “ఎవరిని వెదకుచున్నావు?”

సమాధివున్న తోటకు అతను తోటమాలి అనుకొని, ఆమె ఆయనతో ఇట్లనును: “అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదును.”

ఆ వ్యక్తి, “మరియా” అని పిలుచును. ఆమె వెంటనే పరిచయముగల ఆ పిలుపునుబట్టి, ఆయన యేసని గుర్తుపట్టును. ఆమె ఆయనను “రబ్బూనీ” (“బోధకుడని” అర్థము) అని ఆశ్చర్యముతో పిలిచి, పట్టలేని ఆనందముతో ఆయనను పట్టుకొనును. అయితే యేసు ఆమెతో, “నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి—నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో” చెప్పుమనును.

మరియ ఇప్పుడు అపొస్తలులు ఇతర శిష్యులు సమకూడిన ప్రదేశమునకు పరుగెత్తును. యేసు పునరుత్థానుడగుటను గూర్చి ఇతర స్త్రీలు చెప్పినదానికి ఆమె తన వృత్తాంతమునుకూడ చేర్చును. అయినను, మొదటి స్త్రీలు చెప్పినదానిని నమ్మని ఈ మనుష్యులు మరియ చెప్పినదానినికూడ నమ్మరు. మత్తయి 28:3-15; మార్కు 16:5-8; లూకా 24:4-12; యోహాను 20:2-18.

సమాధి ఖాళీగా ఉండుటను చూచినప్పుడు, మగ్దలేనే మరియ ఏమిచేయును, ఇతర స్త్రీలకు ఏ అనుభవమును కలుగును?

సమాధి ఖాళీగా ఉండుట చూచినప్పుడు పేతురు, యోహానులు ఎట్లు ప్రతిస్పందింతురు?

శిష్యులకు యేసు పునరుత్థానమును గూర్చి వెళ్లుచున్న ఇతర స్త్రీలు దేనిని ఎదుర్కొందురు?

కావలి సైనికులకు ఏమి సంభవించెను, ప్రధానయాజకులకు ఈ విషయమును వారు చెప్పినప్పుడు వారి ప్రత్యుత్తమేమై యుండెను?

మగ్దలేనే మరియ ఒంటిరిగా సమాధియొద్ద ఉన్నప్పుడు ఏమి జరుగును, స్త్రీలు ఈ విషయము చెప్పినప్పుడు శిష్యుల ప్రతిస్పందన ఏమి?