కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోహాను తగ్గింపబడును, యేసు హెచ్చింపబడును

యోహాను తగ్గింపబడును, యేసు హెచ్చింపబడును

అధ్యాయము 18

యోహాను తగ్గింపబడును, యేసు హెచ్చింపబడును

సా.శ. 30 వసంతకాలములోని పస్కాపండుగ అనంతరం యేసు ఆయన శిష్యులు యెరూషలేమును విడిచివెళ్లుదురు. అయితే వారు గలిలయలోని తమ గృహములకు తిరిగి వెళ్లలేదు, గానీ వారు యూదయ దేశమునకు వెళ్లి అచ్చట బాప్తిస్మమిచ్చుచుండిరి. స్నానికుడైన యోహానుకూడ అప్పటికే ఒక సంవత్సరమునుండి అదే పనిచేయుచున్నాడు, ఆయనతో ఇంకను సహవాసము చేయుచున్న శిష్యులు ఉన్నారు.

నిజానికి, యేసు స్వయంగా తానే ఎవరికి బాప్తిస్మమియ్యలేదు, అయితే ఆయన నడిపింపు క్రింద శిష్యులు ఆ పనిని చేయుచున్నారు. వారిచ్చుచున్న బాప్తిస్మము యోహాను బాప్తిస్మము వంటిదే, అది దేవుని ధర్మశాస్త్ర నిబంధనకు వ్యతిరేకముగా చేసిన పాపములకు ఒక యూదుడు చూపు పశ్చాత్తాపమునకు సూచనయై యున్నది. అయితే తన పునరుత్థానము తర్వాత, యేసు వేరొక భావమును కలిగియుండు బాప్తిస్మమును ఇవ్వవలెనని తన శిష్యులకు ఉపదేశించును. ఈనాటి క్రైస్తవ బాప్తిస్మము యెహోవా దేవుని సేవించుటకు ఒకవ్యక్తి సమర్పించుకొనుటను సూచిస్తున్నది.

యేసు పరిచర్యయొక్క ఈ తొలిదశలో, తాను మరియు యోహాను వేరువేరుగా పనిచేయుచున్నను, వారిరువురు పశ్చాత్తాపము చూపినవారికి బోధించుచు బాప్తిస్మమిచ్చుచుండిరి. అయితే యోహాను శిష్యులు అసూయతో నిండినవారై యేసునుగూర్చి ఆయనకు ఫిర్యాదుచేయుచు ఇట్లందురు: “బోధకుడా, . . . ఇదిగో, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారు.”

తనుకూడ అసూయచెందుటకు బదులు, యోహాను యేసు సాధించుచున్న విజయము చూసి సంతోషించుచు, తన శిష్యులునుకూడ సంతోషించుడని కోరును. ఆయన వారికిట్లు జ్ఞాపకము చేయును: “నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.” ఆ పిమ్మట ఆయన ఒక చక్కని దృష్టాంతమును ఉపయోగించును: “పెండ్లికుమార్తె గలవాడు పెండ్లికుమారుడు; అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది.

ఆరునెలల క్రితం తన శిష్యులను యేసుకు పరిచయం చేసినప్పుడు పెండ్లికుమారుని స్నేహితునిగా యోహాను సంతోషించెను. వారిలో కొందరు ఆత్మతో అభిషేకింపబడిన క్రైస్తవులతో కూడిన క్రీస్తుయొక్క పరలోక పెండ్లికుమార్తె తరగతిగా తయారగు ఉత్తరాపేక్షగల సభ్యులైరి. క్రీస్తు విజయవంతమగు పరిచర్యకొరకు మార్గము సిద్ధపరచుట తన సంకల్పము గనుక, తన ప్రస్తుత శిష్యులుకూడ యేసును వెంబడించవలెనని యోహాను కోరుచున్నాడు. స్నానికుడైన యోహాను వివరించునట్లుగా: “ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.”

అంతకుముందు స్నానికుడైన యోహాను శిష్యునిగాయుండి ప్రస్తుతము యేసు క్రొత్త శిష్యునిగా తయారయిన యోహాను, యేసు ఆరంభ ఉనికినిగూర్చి, మానవ రక్షణలో ఆయన ప్రముఖమైన పాత్రనుగూర్చి వ్రాయుచు ఇట్లనుచున్నాడు: “పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; . . . తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించియున్నాడు. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును.”

తన స్వంతకార్యము తగ్గవలసియున్నదను విషయమును చర్చించిన కొద్దికాలమునకే రాజైన హేరోదు స్నానికుడైన యోహానును బంధించెను. హేరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను తనదానిగా చేసికొనెను, అందువలన అతని ఈ చర్యలను యోహాను బహిర్గతము చేయగా, దానికి హేరోదు ఆయనను చెరసాలలో వేయించెను. యోహాను బంధింపబడెనను వార్త యేసు వినినప్పుడు, ఆయన తన శిష్యులతో యూదయను విడిచి గలిలయకు వెళ్లెను. యోహాను 3:22–4:3; అపొ.కార్యములు 19:4; మత్తయి 28:19; 2 కొరింథీయులు 11:2; మార్కు 1:14; 6:17-20.

యేసు పునరుత్థానమునకు ముందు ఆయన నడిపింపుక్రింద జరిగిన బాప్తిస్మముల భావమేమైయున్నది? పునరుత్థానము తర్వాత వాటి ప్రాముఖ్యత భావమేమైయున్నది?

తన శిష్యులు చేసిన ఫిర్యాదు సరియైనదికాదని యోహాను ఎట్లు చూపును?

యోహాను ఎందుకు చెరసాలలో వేయబడును?