యోహాను మార్గమును సరాళము చేయును
అధ్యాయము 11
యోహాను మార్గమును సరాళము చేయును
యేసు పండ్రెండేడ్లవానిగా దేవాలయములో బోధకులను ప్రశ్నలడిగిన దగ్గరనుండి 17 సంవత్సరములు గడిచిపోయినవి. అది సా.శ. 29 వ సంవత్సరము వసంతకాలం, ప్రతివారు యొర్దానునదీ ప్రదేశమందంతట ప్రకటించుచున్న, యేసు తోబుట్టువైన యోహానునుగూర్చియే మాట్లాడుకొనుచున్నట్లు కనిపిస్తోంది.
యోహాను నిజముగా తన రూపమందును, మాటయందును ప్రతిభావంతుడు. ఆయన ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించును. మిడతలును అడవి తేనెయు అతని ఆహారము. మరి ఆయన వర్తమానమేమి? “పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి.”
ఈ వర్తమానము వినువారిని ఇదెంతో ఉత్తేజపరచును. అనేకులు తాము మారుమనస్సు పొందు అవసరతను, అనగా తమ దృక్పధమును మార్చుకొని, తమ పాత జీవన విధానమును తుచ్ఛమైనదని ఎంచి దానిని త్యజించవలెనని గ్రహిస్తారు. కాబట్టి యెరూషలేముతోసహా యొర్దాను చుట్టూవున్న ప్రాంతములన్నింటినుండి, ప్రజలు అసంఖ్యాకులుగా యోహానునొద్దకు రాగా, ఆయన వారిని యొర్దాను నీటిలో పూర్తిగాముంచి బాప్తిస్మమిచ్చును. ఎందుకు?
దేవుని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చేసిన పాపముల విషయమై హృదయపూర్వక పశ్చాత్తాపము పొందితిమనుటకు సూచనగా, లేక గుర్తింపుగా యోహాను ప్రజలకు బాప్తిస్మమిచ్చుచున్నాడు. ఆ విధముగా, కొందరు పరిసయ్యులు, సద్దూకయ్యులు యొర్దానునొద్దకు వచ్చినప్పుడు, యోహాను వారిని ఈ విధముగా ఖండించును: “సర్పసంతానమా, . . . మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ‘అబ్రాహాము మాకు తండ్రి’ అని మీలో మీరుచెప్పుకొన తలంచవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతిచెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.”
అనేకులు యోహానువైపు శ్రద్ధ మళ్లించుచున్నందువలన, యూదులు ఆయనయొద్దకు యాజకులను, లేవీయులను పంపుదురు. వారువచ్చి ఆయనను: “నీవెవరవు?” అని అడుగుదురు.
అందుకు యోహాను, “నేను క్రీస్తును కానని,” ఒప్పుకొనును.
అయితే వారు, “మరి నీవెవరవు, నీవు ఏలీయావా?” అని వాకబు చేయుదురు.
ఆయన “నేను కాను” అని జవాబిచ్చును.
“నీవు ఆ ప్రవక్తవా?”
“కాదు!”
కాబట్టి వారు, “నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక, నిన్నుగూర్చి నీవేమి చెప్పుదువు?” అని పట్టుబట్టుదురు.
దానికి యోహాను, “ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను, ‘యెహోవా (NW) త్రోవ సరాళముచేయుడి’ అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము” అని వివరించును.
వారు తెలిసికొనగోరి, “నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని,” అడుగుదురు.
అందుకాయన, “నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయన నెరుగరు” అని జవాబిచ్చును.
రాజుగా తయారు కావలసియున్న, మెస్సీయను అంగీకరించుటకు సరియైన హృదయము కలిగియుండునట్లు ప్రజలను సిద్ధపరచుటద్వారా యోహాను మార్గమును సరాళము చేయుచున్నాడు. ఈయననుగూర్చి యెహాను ఇట్లు చెప్పును: “ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను.” నిజానికి, యోహాను ఇంకను చెప్పినదేమనగా, “నా వెనుక వచ్చువాడు నాకు పూర్వమే జీవించియున్నందున నాకంటే ముందటివాడాయెను.”—NW
ఆ విధముగా, “పరలోక రాజ్యము సమీపించియున్నది” అను యోహాను వర్తమానము, యెహోవా నియమిత రాజగు, యేసుక్రీస్తు పరిచర్య ఇక ప్రారంభము కాబోవుచున్నదని ఒక బహిరంగ ప్రకటనగా పనిచేయుచున్నది. యోహాను 1:6-8, 15-28; మత్తయి 3:1-12; లూకా 3:1-18; అపొ.కార్యములు 19:4.
▪ యోహాను ఎటువంటి మనుష్యుడై యున్నాడు?
▪ యెహాను ప్రజలకు ఎందుకు బాప్తిస్మమిచ్చును?
▪ రాజ్యము సమీపించియున్నదని యోహాను ఎందుకు చెప్పగల్గెను?