కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రొట్టెలు మరియు పులిసిన పిండి

రొట్టెలు మరియు పులిసిన పిండి

అధ్యాయము 58

రొట్టెలు మరియు పులిసిన పిండి

దెకపొలినందు గొప్ప జనసమూహములు యేసు నొద్దకు గుంపులుగా వచ్చారు. అన్యజనులతో నిండిన ఈ ప్రాంతమునకు అనేకులు చాల దూరమునుండి వచ్చారు. ఆయన బోధవిని వారి అంగవిహీనతలనుండి స్వస్థతనొందుటకై వచ్చారు. వీరు తమతోకూడ పెద్ద బుట్టలను లేక గంపలను తెచ్చుకొందురు, సాధారణముగా అన్య ప్రాంతములద్వారా ప్రయాణముచేయునప్పుడు వారు సరకులు మోసికొనుటకు వాడుకచొప్పున అటువంటి వాటిని వాడుతారు.

అయితే, చివరికి యేసు శిష్యులను పిలిచి, “జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు, వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరమునుండి వచ్చియున్నారని” చెప్పును.

అందుకాయన శిష్యులు, “ఈ అరణ్యప్రదేశములో ఒకడెక్కడనుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని” ఆయనను అడుగుదురు.

“మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి”? అని యేసు వారినడుగగా వారు,

“ఏడురొట్టెలు, కొన్ని చిన్నచేపలని” జవాబిచ్చుదురు.

జనులను నేలమీద కూర్చుండుడని ఆజ్ఞాపించి, యేసు ఆ రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి తన శిష్యులకిచ్చుటకు ప్రారంభించును. శిష్యులు ప్రజలకు వడ్డించగా వారందరు తృప్తిగా తిందురు. స్త్రీలు, పిల్లలుగాక 4,000 మంది పురుషులు తినిన తరువాతకూడా మిగిలిన ముక్కలను ఎత్తగా అవి ఏడు గంపలు నిండును.

యేసు జనసమూహములను పంపివేసి, శిష్యులతో దోనెయెక్కి గలిలయ సముద్రపు పశ్చిమ తీరమునకు వెళ్లును. ఇక్కడ పరిసయ్యులు, ఈసారి సద్దూకయ్యుల మతమునకు చెందిన సభ్యులతో కలిసి, ఆకాశమునుండి ఒక సూచక క్రియను చూపుమని అడుగుటద్వారా, యేసును శోధించుటకు ప్రయత్నింతురు.

తనను శోధించుటకు వారుచేయు ప్రయత్నములను ఎరిగినవాడై యేసు, వారితో “సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురుగదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురుగాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరని” చెప్పును.

దానితో యేసు వారిని చెడ్డతరమువారని వ్యభిచారులని పిలిచి, అంతకుముందు పరిసయ్యులతో చెప్పినట్లే, యోనాను గూర్చిన సూచన తప్ప మరి ఏ సూచకక్రియ వారికి ఇవ్వబడదని హెచ్చరించును. వారిని విడిచి యేసు, ఆయన శిష్యులు దోనెయెక్కి గలిలయ సముద్రమునకు ఈశాన్య తీరముననున్న బేత్సయిదా వైపు వెళ్లుదురు. వారు రొట్టెలు తెచ్చుకొనుట మరిచినట్లు మార్గములో గ్రహించుదురు. అయితే వారివెంట ఒక్క రొట్టె మాత్రమే ఉండును.

ఇటీవలనే తనకు ఎదురుపడిన పరిసయ్యులను, హేరోదును బలపరచిన సద్దూకయ్యులను మనస్సునందుంచుకొని యేసు, “చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్తపడుడని” హెచ్చరించును. యేసు పులిసిన పిండిని ప్రస్తావించుటనుబట్టి, వారు రొట్టెలు తెచ్చుటకు మర్చిపోవుటను గూర్చి ఆయన సూచించుచున్నాడని శిష్యులు తలంచి, వారా విషయమై నిజంగా వాదులాడుకొనుటకు ఆరంభింతురు. వారు తప్పుగా అర్థము చేసికొనిన సంగతిని గ్రహించిన యేసు, “రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుచున్నారు?” అని వారిని అడుగును.

ఈ మధ్యనే, బహుశ ఒకటి, రెండు రోజుల క్రితమే యేసు అద్భుతరీతిగా వేలాది జనులకు రొట్టెలను పంచిపెట్టి ఈ ఆఖరి అద్భుతమును జరిగించెను. ఆయన అక్షరార్థమైన రొట్టెలు లేవను విషయమై చింతించుట లేదని వారు తెలిసికొనవలెను. “మీరు జ్ఞాపకము చేసికొనరా? నేను అయిదు వేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండ ఎత్తిరి?” అని వారికాయన జ్ఞాపకము చేయును.

“పండ్రెండు” అని వారు జవాబు చెప్పుదురు.

“నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్నిగంపల నిండ ఎత్తిరని” అడిగినప్పుడు,

వారు “ఏడు” అని జవాబిచ్చుదురు.

“మీరింకను గ్రహింపకున్నారా? రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్తపడుడని” యేసు వారితో చెప్పును.

శిష్యులు చివరకు అసలు విషయమును గ్రహింతురు. పులుపు అనే పదార్థము పిండిని పులియజేసి రొట్టె పొంగి ఉబ్బునట్లుచేయును. గనుక ఈ పదము తరచు అవినీతిని సూచించుటకు వాడబడును. కాబట్టి అవినీతి ప్రభావముగల బోధయగు, “పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధను గూర్చి” జాగ్రత్త పడవలెనని హెచ్చరించుచు యేసు ఒక సూచనగా దానిని ఉపయోగించుచున్నాడని, శిష్యులు ఇప్పుడు గ్రహింతురు. మార్కు 8:1-21; మత్తయి 15:32–16:12.

పెద్దపెద్ద సరకుల గంపలను ప్రజలెందుకు వెంట తెచ్చుకొందురు?

దెకపొలి విడిచిపెట్టిన తర్వాత, యేసు దోనెపై ఏయే ప్రాంతములకు వెళ్లును?

పులిసిన పిండినిగూర్చి యేసు పలికిన మాటలను శిష్యులెట్లు తప్పుగా అర్థము చేసికొందురు?

“పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండి” అని చెప్పినప్పుడు యేసు భావమేమై యుండెను?