కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లాజరు పునరుత్థానము చేయబడినప్పుడు

లాజరు పునరుత్థానము చేయబడినప్పుడు

అధ్యాయము 91

లాజరు పునరుత్థానము చేయబడినప్పుడు

యేసు, తనతో వచ్చినవారితో కలిసి ఇప్పుడు లాజరు సమాధినొద్దకు వచ్చును. వాస్తవానికి, అది ద్వారమునొద్ద రాయి అడ్డుపెట్టబడిన ఒక గుహ. “రాయి తీసివేయుడని” యేసు చెప్పును.

యేసు ఏమిచేయ తలంచెనో ఇంకను అర్థము చేసికొనలేక, మార్త దానికి అభ్యంతరము చెప్పుచు, “ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని” ఆయనతో అనును.

అయితే యేసు ఇట్లడుగును: “నీవు నమ్మినయెడల దేవుని మహిమచూతువని నేను నీతో చెప్పలేదా?”

కావున వారు రాయిని తీసివేయుదురు. అప్పుడు యేసు కన్నులు పైకెత్తి ఇట్లు ప్రార్థించును: “తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటచెప్పితిని.” ఆయన చేయనైయున్న దానిని దేవునినుండి తాను పొందిన శక్తిద్వారా చేయుచున్నాడని అక్కడ గుమికూడిన ప్రజలు తెలిసికొనుటకు యేసు బహిరంగముగా ప్రార్థించును. ఆ పిమ్మట యేసు బిగ్గరగా, “లాజరూ, బయటకు రమ్మని” చెప్పును.

దానితో, లాజరు బయటకు వచ్చును. అతని కాళ్లుచేతులు ఇంకను సమాధి వస్త్రములతోనే చుట్టబడి, ముఖమునకు రుమాలు కట్టబడి ఉండును. “మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని” యేసు వారితో చెప్పును.

ఈ అద్భుతము చూసిన మీదట, మరియ మార్తలను ఓదార్చవచ్చిన అనేకమంది యూదులు యేసునందు విశ్వాసముంచుదురు. అయితే ఇతరులు జరిగినదానిని పరిసయ్యులతో చెప్పుటకు వెళ్లుదురు. వారు మరియు ప్రధానయాజకులు వెంటనే యూదుల న్యాయసభ అనబడు, మహాసభను ఏర్పాటుచేయుదురు.

ఆ మహాసభలో ప్రస్తుత ప్రధానయాజకుడైన కయప, పరిసయ్యులు, సద్దూకయ్యులును, ముఖ్యయాజకులు, మరియు అంతకుముందున్న ప్రధానయాజకులును వుందురు. వీరిట్లు విలపించుదురు: “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు.”

మతనాయకులు యేసు “సూచక క్రియలు” చేయుచున్నాడని అంగీకరించినను, వారు కేవలము తమస్వంత స్థానము, అధికారముయెడల మక్కువ కలిగియుందురు. సద్దూకయ్యులు పునరుత్థానమును నమ్మరు గనుక, లాజరును లేపుట ప్రత్యేకముగా వారికొక పెద్దదెబ్బ తగిలినట్లున్నది.

బహుశ సద్దూకయ్యుడైన కయప, ఇప్పుడు మాట్లాడుచు ఇట్లనును: “మీకేమియు తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు.”

ఇట్లు చెప్పుటకు దేవుడు కయపను ప్రభావితుని చేసెను, ఏలయనగా అపొస్తలుడైన యోహాను ఆ తర్వాత ఇట్లు వ్రాసెను: “[కయప] తనంతటతానే యీలాగు చెప్పలేదు.” నిజానికి, వారి అధికార స్థానములను, ప్రాబల్యమును మరింత బలహీనపరచకుండ ఆయనను అడ్డుకొనుటకు యేసును చంపవలెనని కయప భావించాడు. అయినను, యోహాను ప్రకారము, ‘కయప ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, యేసు చావనైయున్నాడని ప్రవచించెను.’ అవును, తన కుమారుడు అందరికొరకు విమోచన క్రయధనముగా చనిపోవలెననుట దేవుని సంకల్పమైయున్నది.

యేసును చంపుటకు పథకము వేయునట్లు మహాసభను ఒప్పించుటలో కయప ఇప్పుడు విజయము సాధించును. మహాసభ సభ్యుడును, తనయెడల స్నేహముగాయున్న నీకొదేముద్వారా బహుశ ఈ పన్నాగములనుగూర్చి యేసు తెలిసికొని, అక్కడనుండి వెళ్లిపోవును. యోహాను 11:38-54.

లాజరును పునరుత్థానము చేయకముందు యేసు ఎందుకు బహిరంగముగా ప్రార్థించును?

ఈ పునరుత్థానమును చూసినవారు దానివిషయమై ఎట్లు ప్రతిస్పందించుదురు?

మహాసభ సభ్యుల దుష్టత్వమును ఏది బయల్పరచుచున్నది?

కయప ఉద్దేశ్యమేమై యుండెను, అయితే ఏమి ప్రవచించుటకు దేవుడు అతనిని ఉపయోగించుకొనును?