కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాగ్దాన శిశువు

వాగ్దాన శిశువు

అధ్యాయము 6

వాగ్దాన శిశువు

యోసేపు మరియలు నజరేతుకు మరిలి వెళ్లుటకు బదులు, బేత్లెహేములోనే ఉండిపోవుదురు. యేసుకు ఎనిమిది దినముల వయస్సురాగానే; మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లు, వారు ఆయనకు సున్నతి చేయించుదురు. అంతేకాకుండ, ఎనిమిదవ దినమున మగపిల్లవానికి పేరు పెట్టుటకూడ స్పష్టమైన ఆచారమై యున్నది. కాబట్టి వారు అంతకుముందు గబ్రియేలు దూత వారికిచ్చిన నడిపింపు ప్రకారము పిల్లవానికి యేసు అని పేరు పెట్టుదురు.

ఒక నెలకంటే ఎక్కువ దినములు గడిచిపోయినవి, యేసు 40 దినముల వయస్సుగల వాడాయెను. ఇప్పుడు అతని తలిదండ్రులు అతనిని ఎక్కడకు తీసికొనిపోవుదురు? వారున్న ప్రాంతమునకు కేవలము కొద్ది కిలో మీటర్ల దూరమందున్న యెరూషలేములోని ఆలయమునకే. మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ప్రకారము, కుమారుని కనిన 40 దినముల తర్వాత, ఆ పిల్లవాని తల్లి ఆలయములో శుద్ధతకొరకైన అర్పణను అర్పించవలెను.

అదే మరియ చేయును. ఆమె తన అర్పణగా రెండు చిన్న పక్షులను తీసుకువెళ్లును. ఇది యోసేపు మరియల ఆర్థిక స్థితిని బయల్పరచుచున్నది. మోషే ధర్మశాస్త్రము సూచించునదేమనగా, ఆ సమయమందు పక్షులకంటే ఎంతో ఎక్కువ విలువైన చిన్నపొట్టేలును అర్పించవలెను. అయితే ఆ తల్లి దీనిని అర్పించలేనియెడల, రెండు గువ్వలు, లేక రెండు పావురములు సరిపోవును.

ఆలయములో వృద్ధ మనుష్యుడొకరు యేసును తనచేతులలోకి తీసికొనును. అతని పేరు సుమెయోను. యెహోవా వాగ్దానము చేసిన క్రీస్తును, లేక మెస్సీయాను చూచు పర్యంతము అతను చనిపోడని దేవుడు ఆయనకు బయలుపరచెను. ఈ దినమున సుమెయోను ఆలయమునకు వచ్చినప్పుడు, యోసేపు మరియలు తీసుకొని వచ్చిన పిల్లవానియొద్దకు పరిశుద్ధాత్మ ఆయనను నడిపించును.

సుమెయోను యేసును తనచేతులతో ఎత్తిపట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు ఇట్లనును: “నాథా, ఇప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని.”

ఈ మాటలు వినిన యోసేపు మరియలు ఎంతో ఆశ్చర్యపడుదురు. ఆ పిమ్మట సుమెయోను వారిని ఆశీర్వదించి మరియతో, ఆమె కుమారుడు “ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును . . . గురుతుగా యుండునని” ఆ దుఃఖము, పదునైన ఖడ్గమువలె, ఆమె హృదయములోనికి దూసుకొనిపోవునని చెప్పును.

ఈ సమయమున అన్న అను పేరుగల 84 సంవత్సరముల వయస్సుగల ప్రవక్త్రినికూడ అక్కడ ఉండెను. నిజానికి, ఆమె ఎన్నడును ఆలయమును విడిచిపోలేదు. ఆ గడియలోనే ఆమె వీరి దగ్గరకువచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచు, వినువారందరికి యేసునుగూర్చి తెలియజేయును.

ఆలయమందు జరిగిన ఈ సంఘటనల విషయమై యోసేపు మరియలు ఎంతగా ఆనందింతురు! దేవుడు వాగ్దానంచేసిన పిల్లవాడితడేనని ఇదంతయు వారికి నిశ్చయంగా రూఢీచేస్తున్నది. లూకా 2:21-38; లేవీయకాండము 12:1-8.

ఇశ్రాయేలీయుల మగశిశువుకు నిజంగా ఎప్పుడు పేరుపెట్టుట ఆచారమైయున్నది?

తన కుమారుడు 40 దినముల వయస్సు గలవాడు కాగానే ఇశ్రాయేలీయులలోని తల్లి ఏమి చేయవలెను, మరియు దీనిని నెరవేర్చుట మరియ ఆర్థిక పరిస్థితిని ఎట్లు బయలుపరచుచున్నది?

ఈ సందర్భములో యేసును ఎవరెవరు గుర్తింతురు, మరియు వారు దీనిని ఎట్లు చూపించుదురు?