కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు యేసును చిక్కులో పడవేయలేక పోయిరి

వారు యేసును చిక్కులో పడవేయలేక పోయిరి

అధ్యాయము 108

వారు యేసును చిక్కులో పడవేయలేక పోయిరి

యేసు ఆలయములో బోధించుచు, మతనాయకుల దుష్టత్వమును బహిర్గతముచేసిన మూడు ఉపమానములను తన మత విరోధులకు చెప్పినందున, పరిసయ్యులు కోపోద్రేకులై ఆయనను బంధించుటకు వీలుకల్గించునట్లు ఆయన మాట్లాడునట్లుచేసి ఆయనను చిక్కులో పడవేయవలెనని సలహాతీసికొందురు. వారు ఒక పన్నాగము పన్ని, ఆయన పొరపాటు చేయునట్లు ప్రయత్నించుటకు హేరోదువర్గమునకు చెందిన కొందరిని వెంటబెట్టి వారు తమ శిష్యులను ఆయనయొద్దకు పంపుదురు.

“బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని” ఈ మనుష్యులు అడుగుదురు.

ఆ విధముగా పొగడుటద్వారా యేసు మోసపోలేదు. ‘కాదు, ఈ పన్ను చెల్లించుట న్యాయమైనది కాదు’ అని చెప్పినట్లయిన తాను రోమాకు వ్యతిరేకముగా రాజద్రోహము చేసినవాడగును. అలాకాకుండ, ‘అవును మీరు ఈ పన్ను చెల్లించవలెనంటే’ రోమా అధికారమునకు లోబడుటను నిరాకరించు యూదులు తనను ద్వేషింతురని ఆయన గ్రహించి, వారికిట్లు జవాబిచ్చును: “వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక యొకటి నాకు చూపుడి.”

వారు ఆయనయొద్దకు ఒక నాణెమును తీసికొనిరాగా, ఆయన వారినిట్లడుగును: “ఈ రూపమును పైవ్రాతయు ఎవరివి?”

“కైసరువి” అని వారందురు.

“ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” ఇలా యేసు యుక్తిగా సమాధానమిచ్చుటను విని ఈ మనుష్యులు, ఆశ్చర్యపోవుదురు. మరియు వారు ఆయనను విడిచి వెళ్లిపోవుదురు.

పరిసయ్యులు యేసుకు వ్యతిరేకముగా ఏమియు చేయలేకపోవుటను చూచి, పునరుత్థానము లేదనిచెప్పు సద్దూకయ్యులు ఆయనయొద్దకు వచ్చి ఇట్లడుగుదురు: “బోధకుడా, ‘ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరునికి సంతానము కలుగజేయవలెనని’ మోషే చెప్పెను; మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా.”

దానికి జవాబుగా యేసు ఇట్లనును: “లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకముమందున్న దూతలవలె ఉందురు. మృతుల పునరుత్థానమునుగూర్చి ‘నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని’ దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా ఆయన సజీవులకే దేవుడుగాని మృతులకు దేవుడు కాడు.”

మరలా జనసమూహములు యేసు జవాబునకు ఆశ్చర్యపడుదురు. శాస్త్రులలో సహితము కొందరు ఇట్లు అంగీకరింతురు: “బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివి.”

యేసు సద్దూకయ్యుల నోరుమూయించెనని పరిసయ్యులు చూచినప్పుడు, వారందరు ఏకముగా కూడివచ్చి, ఆయనను మరలా పరీక్షించుటకు, వారిలోని శాస్త్రులలో ఒకడు ఇట్లడుగును: “బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?”

యేసు ఇట్లు జవాబిచ్చును: “ప్రధానమైనది ఏదనగా, ‘ఓ ఇశ్రాయేలు, వినుము; మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననునది.’ . . . రెండవది, ‘నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను,’ . . . వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు.” వాస్తవానికి, యేసు ఇంకను ఇట్లనును: “ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.”—NW.

“బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటెను బలులకంటెను అధికమని” ఆ శాస్త్రి అంగీకరించును.

ఆ శాస్త్రి వివేకముగా జవాబిచ్చెనని గ్రహించి యేసు ఆయనతో, “నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు” అనును.

ఇప్పటికి మూడు రోజులనుండి—ఆదివారం, సోమవారం, మంగళవారం—యేసు దేవాలయములో బోధించుచున్నాడు. ప్రజలు ఆసక్తితో ఆయన చెప్పు మాటలను వినుచుండగా, మతనాయకులు ఆయనను చంపగోరుచున్నారు, అయితే ఇప్పటి వరకు వారుచేసిన ప్రయత్నములు ఫలించలేదు. మత్తయి 22:15-40; మార్కు 12:13-34; లూకా 20:20-40.

యేసును చిక్కులబెట్టవలెనని పరిసయ్యులు ఎటువంటి పన్నాగము పన్నుదురు, ఆయన అవును లేక కాదు అని సమాధానము చెప్పినట్లయిన దాని ఫలితమేమై యుండును?

తనను చిక్కులో పడవేయుటకు సద్దూకయ్యులు చేసిన ప్రయత్నములను యేసు ఎట్లు భగ్నపరచును?

యేసును పరీక్షించుటకు పరిసయ్యులు మరలా ఎట్లు ప్రయత్నింతురు, దాని ఫలితమేమై యున్నది?

యెరూషలేములో తన చివరి పరిచర్యయందు, యేసు ఎన్ని రోజులు దేవాలయములో బోధించును, దాని ప్రభావమేమి?