కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విడాకులు మరియు పిల్లలను ప్రేమించుటను గూర్చిన పాఠములు

విడాకులు మరియు పిల్లలను ప్రేమించుటను గూర్చిన పాఠములు

అధ్యాయము 95

విడాకులు మరియు పిల్లలను ప్రేమించుటను గూర్చిన పాఠములు

యేసు ఆయన శిష్యులు సా.శ. 33 యొక్క పస్కాకు హాజరగునిమిత్తము యెరూషలేముకు వెళ్లుతూవున్నారు. వారు యొర్దానుదాటి పెరీయ జిల్లాగుండా ప్రయాణం సాగింతురు. కొన్నివారముల క్రిందట యేసు పెరీయలో ఉండెను, అయితే ఆయన స్నేహితుడైన లాజరు రోగియైయున్నాడని యేసు యూదయకు పిలువబడెను. పెరీయలో ఉన్నప్పుడు, యేసు విడాకులనుగూర్చి పరిసయ్యులతో మాట్లాడెను, వారిప్పుడు ఆ విషయమును మరలా ప్రస్తావించుదురు.

పరిసయ్యులలో విడాకులనుగూర్చి విభిన్న అభిప్రాయములు గలవారున్నారు. “ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి . . . కన్పించినయెడల” ఆ స్త్రీకి విడాకులు ఇవ్వవచ్చునని మోషే చెప్పెను. ఇది వ్యభిచారమును మాత్రమే సూచించుచున్నదని కొందరు నమ్ముదురు. అయితే ఇతరులు “మానభంగసూచన” అనేమాటలో అతిచిన్న తప్పిదముకూడ చేరియున్నదని పరిగణింతురు. కావున, యేసును పరీక్షించుటకు పరిసయ్యులు ఇట్లడుగుదురు: “ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?” యేసు ఏమిచెప్పినను అది, భిన్న దృష్టిని కలిగియున్న పరిసయ్యులతో ఆయనకు చిక్కుతెచ్చిపెట్టునని వారి దృఢనమ్మకము.

యేసు బహునైపుణ్యముగా ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, మానవ అభిప్రాయమును వ్యక్తపరచకుండ, వెనుకటికి వెళ్లి తొలివివాహ ఏర్పాట్లను గూర్చి తెల్పును. “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?” అని ఆయన అడిగి, “కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని” చెప్పును.

వివాహ దంపతులు కలిసియుండవలెనని, వారు విడిపోకూడదనియే దేవుని తొలిసంకల్పమని యేసు చూపించును. ఆలాగైతే, “పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెను?” అని పరిసయ్యులు ఆయనను అడుగుదురు.

దానికి యేసు, “మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు” అని జవాబిచ్చును. అవును, ఏదెను వనములో దేవుడు వివాహము కొరకు స్థిరపరచిన నిజమైన కట్టడలో, విడాకులకు ఎటువంటి అవకాశమునివ్వలేదు.

యేసు పరిసయ్యులకు ఇంకను ఇట్లు చెప్పును: “వ్యభిచారము [గ్రీకు, పోర్నియా] నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.” ఆ విధముగా పోర్నియా, అనగా లైంగికదుర్నీతియను ఘోరపాపము, మాత్రమే విడాకులకు ఆధారముగా దేవుడు అంగీకరించునని ఆయన చూపించును.

విడాకులకు కేవలము ఈ ఆధారము తప్పితే, వివాహము శాశ్వతకాల బంధమని గ్రహించినవారై శిష్యులు ఈ విధముగా చెప్పుటకు మనస్కరింతురు: “భార్యభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లిచేసికొనుట యుక్తము కాదు.” వివాహమాడ తలంచువారు వివాహబంధము శాశ్వతమని గంభీరముగా పరిగణించవలెననుటలో సంశయమే లేదు!

ఒంటరిగా ఉండుటనుగూర్చి యేసు మాట్లాడుచున్నాడు. లైంగికసామర్థ్యమునకు ఎదుగనందువలన వివాహము చేసికొనలేనివారిగా కొందరు, నపుంసకులుగా పుట్టిన బాలురున్నారని ఆయన వివరించును. మరికొందరు, మనుష్యులద్వారా కౄరముగా లైంగికసామర్థ్యము లేకుండ చేయబడిన నపుంసకులున్నారు. చివరగా, పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయములలో తమనుతాము ఎక్కువగా వినియోగించుకొనులాగున, వివాహము చేసికొని లైంగిక ఆనందమును అనుభవించు కోరికను అణచివేసికొనిన వారును కలరు. ఆ పిమ్మట యేసు, “[ఒంటరిగా ఉండుటకు] అంగీకరింపగలవాడు అంగీకరించును గాక” అని ముగించును.—NW.

ప్రజలిప్పుడు తమ చిన్నపిల్లలను యేసునొద్దకు తీసికొనిరాసాగిరి. అయితే యేసుకు అనవసరమైన వత్తిడిరాకుండ నిస్సందేహముగా ఆయనను కాపాడవలెనను కోరికతో, శిష్యులు పిల్లలను గద్దించి వారిని తోలివేయుటకు ప్రయత్నింతురు. కాని యేసు వారితో ఇట్లనును: “చిన్నబిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది. చిన్నబిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడు.”

యేసు ఇక్కడ ఎంతచక్కని పాఠములను దయచేయుచున్నాడు! దేవుని రాజ్యమును పొందుటకు, మనము చిన్నపిల్లలవలె వినయమును, ఉపదేశముపొందే స్వభావమును అనుకరించవలెను. అయితే యేసు చూపిన మాదిరి, ప్రత్యేకముగా తలిదండ్రులు తమపిల్లలతో సమయము గడుపు ప్రాముఖ్యతను దృష్టాంతపరచుచున్నది. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని, వారిమీద చేతులుంచి ఆశీర్వదించుటద్వారా యేసు ఇప్పుడు వారియెడల తనకున్న ప్రేమను చూపించును. మత్తయి 19:1-15; ద్వితీయోపదేశకాండము 24:1; లూకా 16:18; మార్కు 10:1-16; లూకా 18:15-17.

విడాకుల విషయములో పరిసయ్యులు ఎటువంటి భిన్న అభిప్రాయములను కలిగియుందురు, కావున వారెట్లు యేసును పరీక్షించుదురు?

ఆయనను పరీక్షించవలెనను పరిసయ్యుల ప్రయత్నముతో యేసు ఎట్లు వ్యవహరించును, మరియు ఆయన విడాకులకు కేవలము ఏదిమాత్రమే ఆధారమని తెలియజేయును?

వివాహము చేసికొనుట యుక్తము కాదని యేసు శిష్యులు ఎందుకు చెప్పుదురు, యేసు ఏమి సిఫారసు చేయును?

చిన్నపిల్లలను చేర్చుకొనుటద్వారా యేసు మనకు ఏమి బోధించుచున్నాడు?