వినయమును గూర్చి ఒక పాఠము
అధ్యాయము 62
వినయమును గూర్చి ఒక పాఠము
ఫిలిప్పుదైన కైసరయ ప్రాంత సమీపములో దయ్యము పట్టిన బాలుని స్వస్థపరచిన తర్వాత, యేసు తిరిగి కపెర్నహూములోని గృహమునకు వెళ్లుటకు ఇష్టపడును. అయితే ఆ ప్రయాణములో ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉండగోరును. ఎందుకనగా ఆయన తన మరణము, మరియు ఆ తర్వాత వారి బాధ్యతల విషయములో వారిని ఇంకను సిద్ధపరచనుద్దేశించును. “మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని” ఆయన వారికి వివరించును.
యేసు దీనినిగూర్చి అంతకుముందు మాట్లాడినను, మరియు ముగ్గురు అపొస్తలులు ఆయన రూపాంతరము పొందిన సమయములో ఆయన “నిర్గమమును” గూర్చి చర్చించబడుటను కళ్లారా చూచినను, ఆయన అనుచరులు ఈ విషయమును ఇంకను గ్రహించలేకపోయిరి. ఆయన చంపబడునను సంగతిని ఒప్పుకొనకుండుటకు అంతకుముందు పేతురువలె, వారిలో ఎవరును ప్రయత్నించక పోయినను, వారు దానినిగూర్చి ఆయనను ఎక్కువగా ప్రశ్నించుటకు భయపడుదురు.
చివరకు వారు కపెర్నహూముకు చేరుకొనిరి, ఇది యేసు పరిచర్య కాలములో ఆయన స్థావరమువలె నుండెను. అంతేకాకుండ అది పేతురు మరియు అనేకమంది ఇతర అపొస్తలుల స్వంత పట్టణము కూడా. అక్కడ, దేవాలయపు పన్ను వసూలుచేయు వ్యక్తులు పేతురునొద్దకు వత్తురు. బహుశ అందరు అంగీకరించిన ఈ వాడుక విషయములో యేసును తప్పుబట్టుటకుగాను, వారిట్లడుగుదురు: “మీ బోధకుడు ఈ అరషెకెలు [దేవాలయపుపన్ను] చెల్లింపడా?”
“చెల్లించునని” పేతురు సమాధానమిచ్చును.
బహుశ ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంటికివచ్చిన యేసు, ఏమి జరిగెనో గ్రహించును. కావున పేతురు ఆ మాటను ఎత్తకముందే, యేసు ఇట్లడుగును: “సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా?”
“అన్యులయొద్దనే” అని పేతురు జవాబిచ్చును.
“ఆలాగైతే కుమారులు స్వతంత్రులే” అని యేసు అభిప్రాయపడును. దేవాలయమందు ఆరాధింపబడుచున్న వాడు, యేసుయొక్క తండ్రి మరియు విశ్వమునకే రాజైయున్నందున, దేవుని కుమారుడు నిజానికి చట్టబద్ధముగా దేవాలయపుపన్ను చెల్లించవలసిన అవసరము లేదు. “అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలమువేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దానినోరు తెరచినయెడల ఒక షెకెలు దొరుకును; దానిని తీసికొని నాకొరకును నీకొరకును వారికిమ్మని” యేసు అతనితో చెప్పును.
కపెర్నహూముకు తిరిగివచ్చిన తర్వాత శిష్యులు, బహుశ పేతురు ఇంటిలో కలిసికొనినప్పుడు, వారిట్లడుగుదురు: “పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు?” ఫిలిప్పుదైన కైసరయనుండి తిరిగివచ్చునప్పుడు తన వెనుకవచ్చుచు వారిలోవారు చర్చించుకొనుచుండిన విషయము ఎరిగియున్నవాడై, ఆ ప్రశ్న అడుగుటకు వారిని ప్రేరేపించిన దానిని గ్రహించిన యేసు, “మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని” వారిని అడుగును. కలవరపడిన శిష్యులు మౌనముగా ఉందురు, ఏలయనగా దారిలో వారు తమలోతాము ఎవరు గొప్పయని వాదించుచుండిరి.
యేసు బోధించి దాదాపు మూడు సంవత్సరములైన తర్వాతకూడ, శిష్యులు అటువంటి వాదమును కలిగియుండుట వింతగా కన్పించుట లేదా? అది మానవ అసంపూర్ణత, మరియు పూర్వంవారున్న మత ప్రభావమును బయల్పరచుచున్నది. శిష్యులు పెరిగిన యూదామతము ప్రతివ్యవహరములోను స్థానమును లేక హోదాను నొక్కితెల్పెడిది. అంతేకాకుండ, రాజ్యముయొక్క “తాళపుచెవులను” గూర్చి యేసు తనకు వాగ్దానము చేసినందున, బహుశ పేతురు, తాను ఉన్నతుడనని భావించియుండవచ్చును. యేసు రూపాంతరమును కన్నులారా చూసినందున యాకోబు, యోహానులు కూడ అటువంటి భావమునే కలిగియుండి వుండవచ్చును.
విషయమేదైనను, వారి దృక్పధములను సరిదిద్దు ప్రయత్నములో యేసు వారికి ఈ విషయాన్ని ఒక ప్రదర్శనా పూర్వకముగా చూపించును. ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి, అతనిచుట్టు తనచేతులువేసి, ఇట్లనెను: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనేగాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటియొక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును.”
తన శిష్యులను సరిదిద్దుటకు ఎంత అద్భుతమైన విధానము! యేసు వారి విషయమై కోపగించి, వారిని గర్విష్ఠులని, ఆశబోతులని లేక అత్యాశగలవారని వారిని పిలువలేదు. అయితే సాధారణముగా తమగుణములో నమ్రత కలిగియుండి, అత్యాశలేని మరియు తమలోతాము హోదాను ఆలోచించని చిన్నపిల్లల ఉదాహరణను దృష్టాంతపరచుటద్వారా ఆయన వారిని సరిదిద్దుచూ బోధించును. ఆ విధముగా యేసు, తన శిష్యులు చిన్నపిల్లలలోవుండు లక్షణములను వృద్ధిచేసికొనవలెనని చూపించును. యేసు ఇలా ముగించును: “మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు.” మత్తయి 17:22-27; 18:1-5; మార్కు 9:30-37; లూకా 9:43-48.
▪ కపెర్నహూమునుండి తిరిగివచ్చిన తర్వాత, యేసు ఏ బోధను పునరుద్ఘాటించును, మరియు అది ఎట్లు స్వీకరించబడెను?
▪ దేవాలయపుపన్ను కట్టు బాధ్యత యేసుకు ఎందుకు లేదు, అయితే ఆయన దానిని ఎందుకు చెల్లించును?
▪ శిష్యులు వాదించుకొనుటకు బహుశ ఏది కారణమగును, మరియు యేసు వారినెట్లు సరిదిద్దును?