కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాదమేర్పడిన కేంద్రము

వివాదమేర్పడిన కేంద్రము

అధ్యాయము 41

వివాదమేర్పడిన కేంద్రము

సీమోను ఇంట భోజనమైన తర్వాత కొద్ది కాలమునకే, యేసు రెండవసారి గలిలయలో ప్రకటించుటకు ప్రయాణమగును. ఆయన అంతకుముందు ఆ ప్రాంతమునకు వెళ్లినప్పుడు, ఆయనతోకూడా ఆయన మొదటి శిష్యులగు పేతురు, అంద్రెయ, యాకోబు యోహానులు ఉండిరి. అయితే ఇప్పుడు ఆయనతో 12 మంది అపొస్తలులు, ఆలాగే కొంతమంది స్త్రీలుకూడ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియ, సూసన్న, యోహన్నయు ఉన్నారు, యోహన్న భర్త రాజైన హేరోదునొద్ద ఒక అధికారిగా ఉన్నాడు.

యేసు పరిచర్య పురోగతి తీవ్రమగుచుండగా, ఆయన కార్యమునుగూర్చిన వివాదముకూడ అట్లే తయారయినది. దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు యేసునొద్దకు తేబడును. యేసు అతని బాగుచేసినప్పుడు, అతడు దయ్యమునుండి విడిపింపబడి, మాటలాడు శక్తిని చూపును పొందును. అయితే జనసమూహములు అత్యాసక్తులై, “ఈయన దావీదు కుమారుడు కాడా,” అని చెప్పుకొందురు.

యేసు ఉన్న ఇంటిదగ్గరకు జనులు ఎంత విస్తారముగా కూడివచ్చిరంటే, ఆయన, ఆయన అపొస్తలులు భోజనము చేయుటకైనను వీలులేకపోవును. ఈయన వాగ్దానము చేయబడిన “దావీదు కుమారుడై” యుండవచ్చునని తలంచిన వారితోసహా, ఈయనను అప్రతిష్ఠపాలుజేయుటకు యెరూషలేమంత దూరమునుండి వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులును వీరిలో ఉన్నారు. యేసు చుట్టూవున్న గందరగోళమును వినినప్పుడు, యేసు బంధువులు ఆయనను పట్టుకొనవలెనని వచ్చిరి. కారణమేమి?

సరే, యేసు స్వంత సహోదరులే ఆయన దేవుని కుమారుడని ఇంకా నమ్మలేదు. అంతేకాకుండ, నజరేతులో పెరుగుచుండగా తామెరిగియున్న యేసుకు, ఆయననుగూర్చి ప్రజలలో చెలరేగిన అలజడి మరియు తగవులాట బొత్తిగా పొంతనలేకుండా పోయినది. కాబట్టి, యేసుకు మానసికముగా ఏదో గంభీరమైన లోపము జరిగినదని వారు నమ్ముదురు. “ఆయనకు మతి చలించియున్నదని” చెప్పి ఆయనను పట్టుకొని తీసుకువెళ్లవలెనని వారనుకొందురు.

అయితే యేసు దయ్యము పట్టినవానిని బాగుచేసెననుటకు రుజువు స్పష్టముగా ఉన్నది. దీనినిగూర్చిన వాస్తవమును తాము నిరాకరించలేమని శాస్త్రులకు, పరిసయ్యులకు తెలుసు. అయితే యేసును అప్రతిష్ఠపాలుజేయుటకు వారు ప్రజలతో, “వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.”

వారి ఆలోచన ఎరిగినవాడై, యేసు శాస్త్రులను పరిసయ్యులను తనయొద్దకు పిలిచి, “తనకుతానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తానకుతానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తానకుతానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?”

వారినెంతగా కలవరపరచు న్యాయసమ్మతమైన తర్కము! పరిసయ్యులు తమలోని వ్యక్తులు దయ్యములను వెళ్లగొట్టిరని చెప్పికొనినందున, యేసు వారినిట్లు ప్రశ్నించెను: “నేను బయెల్జబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టుచున్నారు?” ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసుమీద వారుచేసిన ఆరోపణ అదేరీతిలో వారికిని అన్వయించును. ఆ పిమ్మట యేసు వారినిట్లు హెచ్చరించెను: “దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.”

తాను దయ్యములను వెళ్లగొట్టుట సాతానుపై తనకున్న శక్తిని రుజువుపరచుచున్నదని ఉదహరించుటకు, యేసు ఇట్లనెను: “ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.” తాము సాతాను ప్రతినిధులమని తమనుతాము ప్రదర్శించుకొనుచు, పరిసయ్యులు స్పష్టముగా యేసుకు విరోధముగావున్నారు. వారు ఇశ్రాయేలీయులను ఆయననుండి చెదరగొట్టుచున్నారు.

తత్ఫలితముగా, “ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదని” సాతాను సంబంధులైన ఈ వ్యతిరేకులను యేసు హెచ్చరించుచున్నాడు. ఆయన ఇలా వివరించెను: “మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.” స్పష్టముగా అద్భుతరీతిలో జరిగింపబడిన దేవుని పరిశుద్ధాత్మ కార్యమును దురుద్దేశముతో సాతాను కార్యమని చెప్పుటద్వారా శాస్త్రులు పరిసయ్యులు క్షమించరాని ఆ పాపమును చేసిరి. మత్తయి 12:22-32; మార్కు 3:19-30; యోహాను 7:5.

యేసు గలిలయకు రెండవసారి వెళ్లుట మొదటిదానికంటె ఎట్లు వేరైయున్నది?

యేసు బంధువులు ఆయనను ఎందుకు పట్టుకొనవలెనని చూసిరి?

యేసుచేసిన అద్భుతములను పరిసయ్యులు ఎట్లు అప్రతిష్ఠపాలుజేయవలెనని ప్రయత్నించిరి, కాగా యేసు వారిని ఎట్లు త్రిప్పికొట్టెను?

దేనివిషయములో ఆ పరిసయ్యులు దోషులైయున్నారు, మరియు ఎందుకు?