కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహపు విందును గూర్చిన ఉపమానము

వివాహపు విందును గూర్చిన ఉపమానము

అధ్యాయము 107

వివాహపు విందును గూర్చిన ఉపమానము

రెండు ఉపమానములద్వారా, యేసు శాస్త్రుల మరియు ప్రధాన యాజకులను బహిర్గతము చేయగా, వారు ఆయనను చంపగోరుదురు. అయితే యేసు వారికింకా చిక్కలేదు. ఆయన వారికి మరొక ఉపమానమును చెప్పుచు ఇట్లనును:

“పరలోక రాజ్యము, తన కుమారునికి పెండ్లివిందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.”

తన కుమారుడైన యేసుక్రీస్తు వివాహ విందును సిద్ధముచేసిన రాజు యెహోవా దేవుడై యున్నాడు. 144,000 అభిషక్త అనుచరులైన పెండ్లికుమార్తె చివరకు పరలోకములో యేసుతో ఐక్యపరచబడును. సా.శ.పూ. 1513లో ధర్మశాస్త్ర నిబంధనలోనికి తీసుకొనిరాబడిన ఇశ్రాయేలు జనాంగము ఆ రాజుయొక్క ప్రజగాయున్నారు, వీరు “రాజులుగా యాజకులుగా” తయారగు అవకాశమును కలిగియుండిరి. ఆ విధముగా ఆ సమయమున మొదట వారికి వివాహ విందుకు ఆహ్వానమివ్వబడెను.

ఏమైనను, యేసు ఆయన శిష్యులు (రాజుయొక్క దాసులు) తమ రాజ్య ప్రచారపు పని ప్రారంభించిన సా.శ. 29 ఆకురాలు కాలము వరకు, ఆహ్వానింపబడిన వారికి తొలి పిలుపు ఇవ్వబడలేదు. అయితే సా.శ. 29 నుండి సా.శ. 33 వరకు దాసులచే ఇవ్వబడిన పిలుపుకు సహజ ఇశ్రాయేలీయులు స్పందించి వచ్చుటకు ఇష్టపడలేదు. కావున యేసు వివరించినట్లుగా దేవుడు ఆ జనాంగమునకు మరొక అవకాశమును ఇచ్చెను.

“‘ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లివిందుకు రండని’ పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను.” రెండవది మరియు చివరిదియునైన ఈ పిలుపు సా.శ. 33 పెంతెకొస్తునాడు ప్రారంభమాయెను, ఆ సమయమున యేసు అనుచరులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. ఈ పిలుపు సా.శ 36 వరకు కొనసాగెను.

అయితే ఇశ్రాయేలీయులలో అనేకులు, ఈ పిలుపునుకూడా తిరస్కరించిరి. యేసు ఇట్లనును: “వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకు వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.” “కాబట్టి” యేసు ఇంకను ఇట్లనును, “రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.” రోమా సైన్యములచే యెరూషలేము చీల్చివేయబడినప్పుడు సా.శ. 70లో ఇది సంభవించెను, మరియు ఆ నరహంతకులు సంహరింపబడిరి.

అదే సమయములో ఏమి జరిగెనో యేసు ఆ పిమ్మట ఇట్లు వివరించును: “అప్పుడతడు [రాజు], ‘పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులుకారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందిరిని పెండ్లి విందుకు పిలువుడని’ తన దాసులతో చెప్పెను.” ఆ దాసులు అట్లే చేసిరి కాగా, “విందుకు వచ్చినవారితో ఆ పెండ్లిశాల నిండెను.”

పట్టణము వెలుపల రాజమార్గములనుండి అతిథులను పిలిచి ఆహ్వానించు ఈ పని, సా.శ. 36లో ఆరంభమాయెను. రోమా సైన్యాధికారియైన కొర్నేలి ఆయన కుటుంబ సభ్యులు మొదట చేర్చబడిన సున్నతిపొందని యూదులు కాని వారిలో ఉండిరి. పిలుపునకు మొదట తిరస్కరించినవారి స్థానములను ఆక్రమించుటకు, యూదులు కానివారిని సమకూర్చుట ఈ 20వ శతాబ్దము వరకు కొనసాగినది.

ఈ 20వ శతాబ్దములో ఆ పెండ్లిశాల నింపబడుట జరిగినది. ఆ పిమ్మట ఏమి జరిగెనో వివరించుచు యేసు ఇట్లనును: “రాజు కూర్చున్నవారిని చూడ లోపలికివచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి, ‘స్నేహితుడా, పెండ్లివస్త్రములేక ఇక్కడ కేలాగు వచ్చితివని’ అడుగగా వాడు మౌనియై యుండెను. అంతట రాజు, ‘వీని కాళ్లు చేతులుకట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని’ పరిచారకులతో చెప్పెను.”

పెండ్లివస్త్రములు ధరించుకొనని వ్యక్తి క్రీస్తు సామ్రాజ్యమందలి అనుకరణ క్రైస్తవులను సూచించుచున్నది. ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా వీరు సరియైన గుర్తింపును కలిగియున్నట్లు దేవుడు వీరిని ఎన్నడు గుర్తించలేదు. రాజ్య వారసులుగా దేవుడు వారినెన్నడు పరిశుద్ధాత్మతో అభిషేకించలేదు. కావున వారు నాశనముననుభవించు వెలుపటికి చీకటిలోనికి త్రోసివేయబడుదురు.

యేసు ఇట్లు చెప్పుచు తన ఉపమానమును ముగించును: “కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే.” అవును, క్రీస్తు పెండ్లికుమార్తెలో భాగము వహించుటకు ఇశ్రాయేలు జనాంగమునుండి అనేకమంది ఆహ్వానింపబడిరి, అయితే సహజ ఇశ్రాయేలీయులు కొందరు మాత్రమే ఎంపిక చేయబడిరి. పరలోక బహుమతిని పొందు 1,44,000 మంది అతిథులలో అధికులు యూదులుకాని వారు ఉందురు. మత్తయి 22:1-14; నిర్గమకాండము 19:1-6; ప్రకటన 14:1-3.

పెండ్లివిందుకు మొదట పిలువబడిన వారెవరు, మరియు వారికి ఆహ్వానము ఎప్పుడు ఇవ్వబడెను?

ఆహ్వానింపబడిన వారికి పిలుపు మొదట ఎప్పుడు ఇవ్వబడెను, మరియు పిలుపు ఇచ్చుటకు ఉపయోగింపబడిన దాసులు ఎవరు?

ఎప్పుడు రెండవ పిలుపు ఇవ్వబడెను, మరియు ఎవరు ఆ తర్వాత ఆహ్వానింపబడిరి?

పెండ్లి వస్త్రము ధరించుకొనని వ్యక్తి ఎవరికి చిత్రీకరణగా యున్నాడు?

పిలువబడిన అనేకులు, మరియు ఎంపిక చేయబడిన కొద్దిమంది ఎవరు?