కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్రాంతిదినమున ఏదిచేయుట ధర్మము?

విశ్రాంతిదినమున ఏదిచేయుట ధర్మము?

అధ్యాయము 32

విశ్రాంతిదినమున ఏదిచేయుట ధర్మము?

మరొక విశ్రాంతిదినమున యేసు గలిలయ సముద్రమునకు సమీపమునగల సమాజమందిరమును సందర్శించును. అక్కడ ఊచ కుడిచెయ్యిగల మనుష్యుడొకడు ఉండెను. యేసు అతని బాగుచేయునా లేదాయని శాస్త్రులు పరిసయ్యులు జాగ్రత్తగా చూచుదురు. చివరకు, “విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా?” అని ఆయనను అడుగుదురు.

ప్రాణము అపాయమందున్నప్పుడు మాత్రమే స్వస్థపరచుట ధర్మశాస్త్రానుసారమైనదని యూదా మత నాయకులు నమ్ముదురు. ఉదాహరణకు, వారు విశ్రాంతిదినమున విరిగిన ఎముకను సరిచేయుట, బెణికిన చోట కట్టుకట్టుట ధర్మశాస్త్ర విరుద్ధమని బోధింతురు. కాబట్టి యేసుపై నింద మోపవలెనను ప్రయత్నములో శాస్త్రులు పరిసయ్యులు ఆయనను ప్రశ్నించుచున్నారు.

అయితే యేసు వారి ఆలోచనలను ఎరిగియుండెను. అదేసమయములో, విశ్రాంతిదినము నిషేధించిన ఏ పనినిచేయుట దానిని ఉల్లంఘించినట్లగునను విషయమై వారు తీవ్రమైన, లేఖనరహితమైన దృష్టిని కలిగియున్నారని ఆయన గ్రహించును. ఆ విధముగా, ఊచచెయ్యిగలవానితో “నీవు లేచి మధ్యను నిలువుమని” చెప్పుటద్వారా నాటకీయముగా వారిని ఎదుర్కొనుటకు ఆయన రంగము సిద్ధముచేయును.

ఇప్పుడు, శాస్త్రులు, పరిసయ్యులవైపు తిరిగి యేసు, “మీలో ఏ మనుష్యునికైనను నొక గొర్రెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దానిపట్టుకొని పైకితీయడా?” గొర్రె తమ పెట్టుబడికి ప్రాతినిధ్యమైయున్నందున, బహుశ రోగగ్రస్తమై తమకు నష్టము తెచ్చునట్లు, మరుసటి దినమువరకు వారు దానిని ఆ గుంటలో విడిచిపెట్టరు. అంతేకాకుండ, “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును” అని లేఖనములు చెప్పుచున్నవి.

దానికి సమాంతరమును వివరించుచు, యేసు ఇంకను ఇట్లనును: “గొర్రెకంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే.” ఆ న్యాయసమ్మతమైన, దయగల తర్కమును నిరాకరించలేక మతనాయకులు మౌనముగా ఊరకుండిరి.

కోపముతోను, వారి పెడసరపు బుద్ధిహీనతకు విచారముతో, చుట్టు కలయజూచి, ఆ పిమ్మట మనుష్యునితో “నీ చెయ్యి చాపుమని” చెప్పును. అతడట్లు చాపినంతనే అతని చెయ్యి బాగుపడును.

ఆ మనుష్యుని చెయ్యి బాగుపడినందుకు సంతోషించుటకు బదులు, పరిసయ్యులు వెంటనే వెలుపలికి పోయి, హేరోదు వర్గీయులను కలిసికొని, వారితో యేసును చంపుటకు రహస్యాలోచన చేయుదురు. సాక్ష్యాధారముగా, ఈ రాజకీయ సభ్యవర్గమందు మతపరమైన సద్దూకయ్యులును చేరియున్నారు. సాధారణముగా, ఈ రాజకీయ వర్గమువారు, మరియు పరిసయ్యులు బాహాటముగా ఒకరినొకరు వ్యతిరేకించుకొందురు, అయితే యేసును వ్యతిరేకించుటలో వారు బలముగా ఒకటగుదురు. మత్తయి 12:9-14; మార్కు 3:1-6; లూకా 6:6-11; సామెతలు 12:10; నిర్గమకాండము 20:8-10.

యేసుకు యూదా మతనాయకులకు మధ్య ఏ నాటకీయ పరిస్థితి ఏర్పడెను?

విశ్రాంతిదినమున స్వస్థపరచుటనుగూర్చి యూదా మతనాయకులు ఏమని నమ్మిరి?

వారి తప్పుడు అభిప్రాయములను త్రిప్పికొట్టుటకు యేసు ఏ దృష్టాంతములను ఉపయోగించెను?