కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యత్వముయొక్క బాధ్యత

శిష్యత్వముయొక్క బాధ్యత

అధ్యాయము 84

శిష్యత్వముయొక్క బాధ్యత

నిజానికి, యూదుల న్యాయసభలో సభ్యునిగాయున్న ఆ ప్రముఖుడైన పరిసయ్యుని ఇల్లు విడిచిన తర్వాత, యేసు యెరూషలేమువైపు తన ప్రయాణము సాగించును. గొప్ప జనసమూహములు ఆయనను అనుసరించుదురు. అయితే వారి ఉద్దేశ్యములు ఏమైయున్నవి? ఆయన నిజమైన అనుచరునిగా ఉండుటలో నిజానికి ఏమి ఇమిడియున్నది?

వారు ప్రయాణమై వెళ్లుచుండగా, యేసు జనసమూహములవైపు తిరిగి, “ఎవడైనను నాయొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు” అని వారికి చెప్పినప్పుడు, బహుశ అది వారికి గగుర్పాటును కలిగించియుండవచ్చును.

యేసు భావమేమి? తన అనుచరులు అక్షరార్థముగా తమ బంధువులను ద్వేషించవలెనని యేసు ఇక్కడ చెప్పుటలేదు. బదులుగా, ఆయనను ప్రేమించుటకంటే తమ బంధువులను తక్కువగా ప్రేమించవలెనను భావముతో వారు వారిని ద్వేషించవలెను. యేసు పితరుడైన యాకోబు రాహేలును ప్రేమించి లేయాను “ద్వేషించెనని” చెప్పబడెను, అంటే లేయా తన సహోదరియైన రాహేలుకంటె తక్కువగా ప్రేమింపబడెనని దాని భావము.

యేసు శిష్యుడగువాడు “తన ప్రాణమును,” లేక జీవమును సహితము ద్వేషించవలెనని చెప్పుటను పరిశీలించుము. ఇక్కడకూడ శిష్యుడు తన స్వంత ప్రాణముకంటే ఆయనను ఎక్కువగా ప్రేమించవలెనని యేసు భావమైయున్నది. ఆ విధముగా యేసు తన శిష్యునిగా తయారగుట గంభీరమైన బాధ్యతయని నొక్కితెల్పుచున్నాడు. అది జాగ్రత్తగా ఆలోచించకుండా చేపట్టునటువంటిది కాదు.

ఆయన ఇంకను సూచించురీతిగా, యేసు శిష్యునిగా యుండుటలో కష్టము హింస చేరియున్నవి: “ఎవడైనను తన హింసాకొయ్యను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.” (NW) ఆ విధముగా, ఒక నిజమైన శిష్యుడు యేసు భరించిన నిందనే భరించుటకును, యేసు త్వరలోనే అనుభవింపనైయున్నట్లే, అవసరమైతే దేవుని శత్రువుల చేతులలో చనిపోవుటకును ఇష్టపడవలెను.

అందువలన, యేసు శిష్యునిగా ఉండుటను గూర్చి, ఆయనను వెంబడించుచున్న జనసమూహములు బహు జాగ్రత్తగా పరీక్షించుకొనవలసిన విషయమే. ఈ వాస్తవమును యేసు ఒక ఉపమానముద్వారా నొక్కితెల్పుచు ఇట్లనును: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున చూచువారందరు, ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెనుగాని కొనసాగింప లేకపోయెనని అతని చూచి యెగతాళి చేయసాగుదురు.”

కావున, గోపురము కట్టవలెనని కోరుకొనిన మనుష్యుడు దానిని పూర్తిచేయుటకు కావలిసినంత మూల్యము తనయొద్ద ఉన్నదని నిశ్చయపరచుకొనునట్లు, తన శిష్యులుగా తయారుకాకముందు వారు దానియందు ఇమిడియున్న దానిని నెరవేర్చగలమని స్థిరముగా తీర్మానించుకొనవలెనని, తనను వెంబడించు జనసమూహములకు యేసు ఉపమాన రీతిగా చెప్పుచున్నాడు. మరొక ఉపమానము చెప్పుచు, యేసు ఇంకను ఇట్లనును:

“మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తిలేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొనచూచును గదా.”

తన ఉపమానమందలి ముఖ్యాంశమును నొక్కితెల్పుచు, యేసు ఇట్లనును: “ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.” ఆయనను అనుసరించు జనసమూహము, అవును క్రీస్తునుగూర్చి నేర్చుకొను ప్రతివారును, అట్లు చేయుటకు ఇష్టపడవలెను. ఆయన శిష్యులుగా ఉండుటకు, వారు తమకు కలిగిన యావత్తును—ప్రాణముతోసహా తమ వస్తువులన్నింటిని—త్యాగము చేయుటకును సిద్ధముగా ఉండవలెను. దీనిని చేయుటకు నీవు ఇష్టపడుదువా?

యేసు ఇంకను ఇట్లనును: “ఉప్పు మంచిదే.” అక్షరార్థమైన ఉప్పు నిలువజేయు శక్తిని కలిగియున్నట్లే, తన శిష్యులును ప్రజలపై నిలిచియుండు ప్రభావమును కలిగియుందురను భావముతో యేసు, వారు “లోకమునకు ఉప్పయి యున్నారు” అని తన కొండమీది ప్రసంగములో చెప్పెను. “గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక” అని యేసు ముగించును.

కావున కొంతకాలంగా తన శిష్యులుగా వున్నవారు సహితము ఆలాగే కొనసాగుటకు వారి దృఢసంకల్పమందు వారు బలహీనులు కాకూడదని యేసు చూపించుచున్నాడు. ఒకవేళ వారట్లయిన, వారు పనికిరానివారై ఈ లోకములో యెగతాళికి గురియగుదురు మరియు దేవునియెదుట తమ అర్హతను కోల్పోవుదురు, వాస్తవానికి అది దేవునిపై నిందను తీసికొనివచ్చును గనుక, వారు సారములేని, కలుషితమైన ఉప్పువలె, బయటకు నెట్టివేయబడుదురు, అవును నాశనము చేయబడుదురు. లూకా 14:25-35; ఆదికాండము 29:30-33; మత్తయి 5:13.

తనను తన బంధువులను “ద్వేషించుట” అనగా అర్థమేమి?

యేసు ఏ రెండు ఉపమానములను చెప్పును, వాటి భావమేమి?

ఉప్పునుగూర్చి యేసు చేసిన ముగింపు వ్యాఖ్యానముల సారాంశము ఏమైయున్నది?