కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శుక్రవారము సమాధిచేయబడెను–ఆదివారము సమాధి ఖాళీగాయుండెను

శుక్రవారము సమాధిచేయబడెను–ఆదివారము సమాధి ఖాళీగాయుండెను

అధ్యాయము 127

శుక్రవారము సమాధిచేయబడెను–ఆదివారము సమాధి ఖాళీగాయుండెను

ఇప్పుడు శుక్రవారము సాయంకాలమైనది, నీసాను 15, విశ్రాంతి దినము సూర్యాస్తమయముతో ఆరంభమగును. యేసు శరీరము నిర్జీవముగా మ్రానున వ్రేలాడుచున్నది, అయితే ఆయనకు ఇరువైపుల వ్రేలాడదీయబడిన బందిపోటు దొంగలు ఇంకను బ్రతికేయున్నారు. శుక్రవారము మధ్యాహ్నము సిద్ధపరచు దినమని పిలువబడును ఎందుకంటే ఆ సమయమున ప్రజలు భోజనము తయారుచేసికొందురు మరియు విశ్రాంతిదినము వరకు వేచివుంచలేని అన్ని పనులను వారు ఆరోజే ముగింతురు.

త్వరలోనే ఆరంభముకానున్న విశ్రాంతి దినము ఎప్పుడు వచ్చు విశ్రాంతి దినము మాత్రమే (వారములోని ఏడవదినము) కాదు, అది రెండింతల లేక “మహాదినము” అనబడిన విశ్రాంతిదినము. ఇది ఎందుకనగా నీసాను 15, ఏడు రోజుల పులియని రొట్టెల పండుగయొక్క మొదటి దినము (అది వారమందు ఏ దినము వచ్చినను అన్నిసమయములలో విశ్రాంతిదినమై ఉండును), క్రమముగావచ్చు విశ్రాంతి దినముననే వచ్చును.

దేవుని ధర్మశాస్త్రము ప్రకారము, దేహములు ఆ రాత్రియు అట్లే మ్రానుపై వ్రేలాడకూడదు. కావున వ్రేలాడదీయబడిన వారి కాళ్లు విరుగగొట్టుటద్వారా వారి మరణమును వేగిరము చేయవలెనని యూదులు పిలాతును అడుగుదురు. కాబట్టి సైనికులు ఆ ఇద్దరు బందిపోటు దొంగల కాళ్లు విరుగగొట్టుదురు. అయితే యేసు అప్పటికే మరణించినట్లు కన్పించుటతో, వారాయన కాళ్లు విరుగగొట్టరు. ఇది “అతని యెముకలలో ఒకటైనను విరువబడదు” అను లేఖనము నెరవేర్చును.

కానీ, యేసు నిజముగా చనిపోయాడనుటకు సందేహము లేకుండా, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడుచును. గుండె ఉండు ప్రాంతములో ఈటె దిగగా, వెంటనే రక్తమును నీళ్లును బయటకు కారును. ప్రత్యక్షసాక్షియగు అపొస్తలుడైన యోహాను, ఇది మరొక లేఖనమును నెరవేర్చెనని వ్రాయుచున్నాడు: “తాము పొడిచినవానితట్టు చూతురు.”

శిక్ష అమలుచేసిన సమయములో అరిమతయియ పట్టణపు వాడును, మహాసభలో పేరుగల సభ్యుడును అయిన యోసేపు కూడ అక్కడేవున్నాడు. యేసు వ్యతిరేకముగా ప్రధాన న్యాయస్థానముయొక్క అన్యాయపు తీర్పుకు అనుకూలముగా ఓటువేయుటకు అతడు తిరస్కరించాడు. బయటకు చెప్పుకోవడానికి భయపడినను, యోసేపు నిజానికి యేసు శిష్యుడైయున్నాడు. ఏమైనను, ఇప్పుడు అతడు ధైర్యము ప్రదర్శించి పిలాతు దగ్గరకువెళ్లి యేసు దేహము కొరకు అడుగును. పిలాతు సంబంధిత శతాధిపతిని పిలిపించి, యేసు మరణించెనను విషయమును ఆ అధికారిద్వారా రూఢిపరచుకొని, పిలాతు దేహమును అప్పగించును.

యోసేపు దేహమును తీసికొనిపోయి సమాధిచేయుటకు సిద్ధముచేయుచు ఒక శుభ్రమైన, సన్నపు నారబట్టతో దానిని చుట్టును. మహాసభ మరొక సభ్యుడైన నీకొదేము అతనికి సహాయము చేయును. తన స్థానము పోవునేమో అను భయముతో నీకొదేముకూడ బహిరంగముగా యేసునందు తనకున్న విశ్వాసమును వెల్లడిచేయలేదు. కానీ ఇప్పుడు అతడు నూరు రోమను పౌండ్ల (33 కిలోల) బోళమును ఖరీదైన సుగంధ ద్రవ్యములను తెచ్చును. సమాధిచేయుటకు మృతదేహములను యూదులు సిద్ధముచేయు పద్ధతిలోనే, యేసు దేహమును ఈ సుగంధ ద్రవ్యములన్నియుచేర్చి చుట్టెదరు.

ఆ పిమ్మట అక్కడకు దగ్గరలోనేయున్న ఒక తోటలో రాతియందు యోసేపు తొలిపించిన క్రొత్త సమాధిలో ఆ దేహమును ఉంచుదురు. చివరగా, ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా ఒక పెద్దరాయిని పొర్లింతురు. విశ్రాంతికి ముందే సమాధిచేయుట పూర్తిచేయవలెనని, దేహమును వారు త్వరత్వరగా సిద్ధము చేశారు. కాబట్టి, బహుశ సిద్ధపరచుటలో సహాయము చేయుచున్న, మగ్దలేనే మరియ, చిన్నయాకోబు తల్లియైన మరియ మరిన్ని సుగంధ ద్రవ్యములను, సుగంధ తైలములను ఇంటియొద్ద తయారుచేయుటకు వడిగా ఇళ్లకు వెళ్లుదురు. ఎక్కువ కాలము కాపాడుటకు యేసు దేహమునకు విశ్రాంతి దినము తర్వాత, మరియెక్కువ సుగంధ ద్రవ్యములు పూయవలెనని వారు ఆలోచించుచున్నారు.

ఆ మరుసటి దినము, అనగా శనివారము (విశ్రాంతిదినము), ప్రధానయాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరకువెళ్లి ఇట్లందురు: “అయ్యా, ఈ వంచకుడు సజీవుడై యుండినప్పుడు—మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి—ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటే కడపటి వంచన మరి చెడ్డదై యుండును.”

అందుకు పిలాతు, “కావలివారున్నారు గదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రముచేయుడని” వారితో చెప్పును. కావున వారు వెళ్లి రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసి అక్కడ రోమా సైనికులను కావలియుంచుదురు.

ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ, యాకోబు తల్లియైన మరియ, సలోమే, యోహన్న, ఇంకా ఇతర స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసికొని యేసు దేహమునకు పూయవలెనని సమాధి దగ్గరకు వచ్చెదరు. దారిలో వారు, “సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించును?” అని ఒకరితో ఒకరు చెప్పుకొందురు. అయితే వారక్కడకు వచ్చినప్పుడు అక్కడ భూకంపము కలుగుటయు, యెహోవా దూత రాయి పొర్లించుటయు చూతురు. అక్కడ కావలివారు లేరు, సమాధి ఖాళీగా ఉన్నది! మత్తయి 27:57–28:2; మార్కు 15:42–16:4; లూకా 23:50–24:3, 10; యోహాను 19:14, 31–యోహాను 19:31 నుండి 20:1; 12:42; లేవీయకాండము 23:5-7; ద్వితీయోపదేశకాండము 21:22, 23; కీర్తన 34:20 జెకర్యా 12:10.

శుక్రవారము సిద్ధపరచు దినమని ఎందుకు పిలువబడును, “మహా” విశ్రాంతి దినమనగా నేమి?

యేసు దేహము విషయంగా ఏ లేఖనములు నెరవేరును?

యేసును సమాధిచేయు విషయములో యోసేపు, నీకొదేములు ఏమిచేయుదురు, యేసుకు వారికిగల సంబంధమేమి?

యాజకులు పిలాతుకు ఏ విన్నపము చేయుదురు, అతడెట్లు ప్రతిస్పందించును?

ఆదివారం ఉదయం తెల్లవారుచుండగా ఏమి జరుగును?