సబ్బాతుదినమున సత్క్రియలు చేయుట
అధ్యాయము 29
సబ్బాతుదినమున సత్క్రియలు చేయుట
అది సా.శ. 31వ సంవత్సర వసంతకాలము. యూదయనుండి గలిలయకు వెళ్లుచు యేసు బావినొద్ద సమరయ స్త్రీతో మాటలాడి అప్పటికి కొన్ని నెలలు గడిచిపోయినవి.
ఇప్పుడు గలిలయ ప్రాంతమంతా విస్తృతముగా బోధించిన తర్వాత, యేసు మరలా ప్రయాణమై, అక్కడ సమాజమందిరములలో ప్రకటించును. ఆయన గలిలయలో చేసిన పరిచర్యకు బైబిలిచ్చు శ్రద్ధతో పోల్చినప్పుడు, పోయిన పస్కాపండుగ తర్వాత యేసు ఇక్కడ గడిపిన నెలలలోను ఈసారి సందర్శించినప్పుడు ఆయన యూదయలో చేసిన సేవనుగూర్చి అది చాలా తక్కువగా చెప్పుచున్నది. నిదర్శనాధారముగా, గలిలయలో యేసు పరిచర్యకు లభించినంత ప్రతిస్పందన యూదయలో లభించలేదు.
సా.శ. 31లో జరుగు పస్కాపండుగకు అక్కడ వుండవలెనని యేసు, కొద్ది సమయము తరువాతనే యూదయ ముఖ్యపట్టణమగు యెరూషలేముకు బయలుదేరును. ఇక్కడ, పట్టణపు గొర్రెల ద్వారమునొద్ద, బేతెస్ద అని పిలువబడు ఒక కోనేరు కలదు, అక్కడికి రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు వచ్చెదరు. ఈ కోనేరులోని నీరు కదలింపబడినప్పుడు, నీటిలోనికి దిగినవారికి స్వస్థత చేకూరునని ప్రజలు నమ్ముచుండిరి.
అది విశ్రాంతిదినము, గత 38 సంవత్సరములుగా రోగగ్రస్తుడైయున్న ఒక మనుష్యుని యేసు ఆ కోనేటివద్ద చూచును. దీర్ఘకాలముగా అతడు రోగిగాయున్న విషయము ఎరిగినవాడై యేసు, “స్వస్థ పడగోరుచున్నావా?” అని అడుగును.
అందుకు అతడు, “అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక, నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని” యేసుకు ఉత్తరమిచ్చును.
యేసు, “నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పెను.” వెంటనే ఆ మనుష్యుడు శరీరమందు స్వస్థతకలిగినవాడై, తన పరుపెత్తికొని, నడవనారంభించును!
అయితే యూదులు వానిని చూచినప్పుడు, “ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తుకొన తగదే” అని అతనితో అందురు.
అందుకు ఆ మనుష్యుడు వారికిట్లు జవాబిచ్చును: “నన్ను స్వస్థపరచినవాడు, ‘నీ పరుపెత్తికొని నడువుమని’ నాతో చెప్పెననెను.”
వారు “‘నీ పరుపెత్తికొని నడువుమని’ నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.” అక్కడ జనులు కూడియున్నందున, యేసు అటుతిరిగి వెళ్లిపోయెను, స్వస్థతపొందినవానికి యేసు పేరు తెలియదు. అయితే అటుపిమ్మట, స్వస్థత పొందినవాడును, యేసు దేవాలయములో కలిసికొనిరి, అప్పుడు అతడు తనను స్వస్థపరచినది ఎవరో తెలిసికొనును.
కావున, స్వస్థతనొందినవాడు యూదులను చూచినప్పుడు తనను స్వస్థపరచినది యేసేనని వారికి తెలియజేయును. ఇది తెలిసికొనిన యూదులు యేసునొద్దకు వెళ్లుదురు. దేనికొరకు? దేని సహాయముతో ఆయన ఈ అద్భుతములు చేయుచున్నాడో తెలిసికొనుటకా? కాదు. ఆయన విశ్రాంతిదినమున ఈ మంచిపనులు చేయుచున్నందున, ఆయనయందు తప్పుపట్టుటకు వారాయనయొద్దకు వెళ్లుదురు. మరియు వారు ఆయనను హింసింపను ఆరంభించిరి. లూకా 4:44; యోహాను 5:1-16.
▪ అంతకుముందు దాదాపు ఎంతకాలము కిందట యేసు యూదయను సందర్శించెను?
▪ బేతెస్ద అని పిలువబడిన కోనేరు ఎందుకంత పేరుగాంచెను?
▪ కోనేటియొద్ద యేసు ఏ అద్భుతము జరిగించును, దానికి యూదులు ప్రతిస్పందన ఏమైయున్నది?