కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమరయ స్త్రీకి బోధించుట

సమరయ స్త్రీకి బోధించుట

అధ్యాయము 19

సమరయ స్త్రీకి బోధించుట

యూదయనుండి గలిలయకు వెళ్లుచు యేసు, ఆయన శిష్యులు సమరయ జిల్లా మార్గమున ప్రయాణించుదురు. ప్రయాణంలో అలసిపోయి మధ్యాహ్నసమయమున విశ్రాంతికొరకు వారు సుఖారను పట్టణమునకు సమీపమునగల ఒక బావినొద్ద ఆగుదురు. అనేక శతాబ్దముల పూర్వము ఈ బావిని యాకోబు త్రవ్వించెను, అది నేటికిని ఆధునిక పట్టణమగు నాబ్లుస్‌ సమీపమున ఉన్నది.

యేసు ఇచ్చట విశ్రాంతి తీసికొనుచుండగా, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు పట్టణములోనికి వెళ్లుదురు. అక్కడకు నీళ్లు చేదుకొనుటకు ఒక సమరయ స్త్రీ రాగా, ఆయన “దాహమునకిమ్ము” అని ఆమెను అడుగును.

వారిలో పాతుకుపోయిన దురభిమానము కారణముగా యూదులు, సమరయులు ఒకరితోనొకరు సాధారణముగా ఏలాంటి సంబంధం కలిగియుండరు. కాబట్టి, ఆ స్త్రీ ఆశ్చర్యముతో ఇట్లడుగును: “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు?”

అందుకు యేసు, “‘నాకు దాహమునకిమ్మని’ నిన్ను అడుగుచున్నవాడెవడో నీవు ఎరిగియుంటే, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని” ఆమెకు జవాబిచ్చును.

అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును, తానును తన కుమాళ్లును, పశువులును, ఈ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా?” అని ఆయనను అడుగును.

అందుకు యేసు, “ఈ నీళ్లుత్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని” ఆమెతో చెప్పును.

ఆ స్త్రీ ఆయనను చూచి, “అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుము” అని అడుగును.

యేసు, “నీవువెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము” అని ఆమెతో చెప్పును.

దానికి జవాబుగా ఆమె, “నాకు పెనిమిటి లేడని” చెప్పును.

ఆమెచెప్పిన మాటకు అవును అనుచు యేసు, “‘నాకు పెనిమిటి లేడని’ నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.”

అప్పుడా స్త్రీ ఆశ్చర్యముతో, “అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను” అని చెప్పి, తన ఆత్మీయ ఆసక్తిని వెల్లడిచేయుచు, సమరయులు “ఈ పర్వతమందు [దగ్గరలోనేయున్న గెరిజీము] ఆరాధించిరి, గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు [యూదులు] చెప్పుదురని” ఆయనతో అనును.

అయినను, ఆరాధనాస్థలము అంత ప్రాముఖ్యము కాదని యేసు సూచించును. “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; . . . తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను” అని ఆయన చెప్పును.

దానికి ఆ స్త్రీ ఎంతో ముగ్ధురాలయి, ఆయనతో ఇట్లనును: “క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును.”

అందుకు యేసు “ఆ మాటలాడుచున్న నేనే ఆయనని” చెప్పును. దానిని ఆలోచించుము! తన జీవన విధానమునుబట్టి ఆమెను ఆ పట్టణ స్త్రీలు తనను దుయ్యబట్టకుండ తప్పించుకొనుటకు బహుశ ఆ స్త్రీ మధ్యాహ్న సమయమున నీళ్లు చేదుకొనుటకు వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన విధంగా ఆమె యేసువలన అనుగ్రహమును పొందును. మరి ఎవరికిని బాహాటముగా బయలుపర్చుకొనని ఆయన ఆమెకు స్పష్టంగా తానెవ్వరో తెలియపర్చెను. కలిగిన ఫలితములేమి?

సమరయులనేకులు విశ్వసించిరి

ఆహారము తీసికొని సుఖారునుండి తిరిగివచ్చినప్పుడు శిష్యులు యేసును తాము విడిచి వెళ్లిన ఆ యాకోబు బావివద్దనే ఆయన ఒక సమరయ స్త్రీతో మాట్లాడుటను చూసారు. శిష్యులు వచ్చినప్పుడు ఆమె తన నీటికుండను అక్కడే విడిచి పట్టణములోనికి వెళ్లును.

యేసు తనతో చెప్పిన విషయములపై మిక్కిలి ఆసక్తిగలదై, ఆమె పట్టణస్థులతో, “మీరువచ్చి, నేను చేసినవన్నియు నాతోచెప్పిన మనుష్యుని చూడుడి” అని అంటూ, ఆ పిమ్మట వారిలో ఆసక్తి పెంపొందించుటకు వారినిట్లడుగును: “బహుశ, ఈయన క్రీస్తుకాడా?” ఆ ప్రశ్న దాని సంకల్పమును నెరవేర్చినది—తాముగా ఆయనను చూచుటకు మనుష్యులు బయలుదేరారు.

ఈలోగా శిష్యులు తాము పట్టణమునుండి తెచ్చిన ఆహారమును భుజించుమని యేసును వేడుకొనిరి. అయితే ఆయన “భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని” ప్రత్యుత్తరమిచ్చెను.

శిష్యులు, “ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో” అని యొకనితో ఒకడు చెప్పుకొనసాగిరి. అయితే యేసు వారికీలాగు వివరించెను: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది. ఇక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా?” అయితే, ఆత్మీయ కోతపనిని సూచించుచు, యేసు ఇంకను ఇట్లనును: “ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.”

సమరయ స్త్రీకి తానిచ్చిన సాక్ష్యముయొక్క ప్రభావాన్ని,—ఆమె సాక్ష్యం మూలముగా అనేకులు ఆయనయందు నమ్మికయుంచునన్న సంగతిని యేసు బహుశ అప్పటికే గ్రహించియుండవచ్చును. ఆమె పట్టణస్థులకు చెప్పుచు ఇలా సాక్ష్యమిచ్చుచున్నది: “నేను చేసినవన్నియు ఆయన నాతో చెప్పెను.” కాబట్టి, సుఖారు పట్టణస్థులు బావిదగ్గర ఆయనయొద్దకు వచ్చినప్పుడు, వారు తమయొద్ద ఉండి, తమతో మరి ఎక్కువ మాట్లాడుమని ఆయనను వేడుకొనిరి. వారి ఆహ్వానమును యేసు అంగీకరించి, అక్కడ రెండు దినములుండెను.

యేసు చెప్పుచున్న సంగతులను సమరయులు వినుచుండగా, ఇతరులనేకులు విశ్వసించిరి. ఆ పిమ్మట వారు ఆ స్త్రీతో ఇట్లనిరి: “ఇక మీదట నీవుచెప్పిన మాటనుబట్టికాక, మా మట్టుకు మేమువిని, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాము.” వినువారు మున్ముందు పరిశీలించుటకు ఆసక్తిని రేకెత్తించుటద్వారా క్రీస్తునుగూర్చి మనమెట్లు సాక్ష్యమివ్వగలమో పరిశీలించుకొనుటకు నిశ్చయముగా సమరయ స్త్రీ శ్రేష్ఠమైన మాదిరిని కనపర్చుచున్నది.

కోతకాలమునకు ఇంకా నాలుగునెలలున్నదని గుర్తుతెచ్చుకొనుము—స్పష్టముగా అది బార్లీ పంటయే. పాలస్తీనాలో వసంత కాలమునందు కోతకువచ్చే పంట అదే గనుక, అది నవంబరు లేక డిశంబరు నెలయైయున్నది. అంటే సా.శ. 30 పస్కాపండుగ అనంతరం, యేసు ఆయన శిష్యులు బోధించుటలోను, బాప్తిస్మమిచ్చుటలోను యూదయలో ఎనిమిది నెలలు గడిపియున్నారని దీని భావము. ఇప్పుడు వారు తమ స్వంత పట్టణమైన గలిలయకు బయలుదేరుదురు. అక్కడ వారికొరకు ఏమి వేచియున్నది? యోహాను 4:3-43.

యేసు తనతో మాట్లాడినందుకు సమరయ స్త్రీ ఎందుకు ఆశ్చర్యపడును?

జీవజలమును గూర్చియు, ఆరాధనాస్థలమును గూర్చియు యేసు ఆమెకు ఏమి బోధించును?

తానెవరో యేసు ఆమెకు ఎలా బయలుపరచెను, అది ఎందుచేత ఆశ్చర్యకరమైయున్నది?

సమరయ స్త్రీ ఏమని సాక్ష్యమిచ్చును, కలిగిన ఫలితములేమి?

యేసు ఆహారము ఎట్లు కోతకాలమునకు సంబంధించినదై యున్నది?

సా.శ. 30 తర్వాత యూదయలో యేసు జరిగించిన పరిచర్య కాలనిడివిని మనమెట్లు నిర్ణయించగలము?