కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిద్ధముగా ఉండుడి!

సిద్ధముగా ఉండుడి!

అధ్యాయము 78

సిద్ధముగా ఉండుడి!

లోభత్వమును గూర్చి జనసమూహములను, వస్తుసంపదకు అసాధారణమైన శ్రద్ధనిచ్చుటనుగూర్చి జాగ్రత్తపడుడని తన శిష్యులను హెచ్చరించిన తర్వాత, యేసు ఇట్లు ప్రోత్సహించును: “చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” ఆ విధముగా కేవలము కొద్దిమంది మాత్రమే పరిమిత సంఖ్యలో (1,44,000 మందియని ఆ తర్వాత గుర్తింపబడినది) పరలోక రాజ్యములో ఉందురని బయల్పరచును. నిత్యజీవమును పొందు అధికశాతము ప్రజలు ఆ రాజ్యముయొక్క భూనివాసులైయుందురు.

ఆ “రాజ్యము” ఎంత అద్భుతమైన బహుమతి! దానిని పొందుటకు శిష్యులు కలిగియుండవలసిన సరియైన స్పందనను వర్ణించుచు, యేసు వారికిట్లు ఉద్బోధించును: “మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి.” అవును, ఇతరులకు ఆత్మీయముగా సహాయపడుటకు వారికున్న వాటిని వారు ఉపయోగించవలెను మరియు ఆ విధముగా వారు “పరలోకమందు అక్షయమైన ధనమును” సంపాదించుకొనవలెను.

ఆ పిమ్మట యేసు, తాను తిరిగివచ్చునప్పటికి సిద్ధముగా ఉండవలెనని శిష్యులకు ఉపదేశించుచున్నాడు. ఆయన ఇట్లనును: “మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువువచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

ఈ ఉపమానములో, సేవకులు తమ యజమాని రాకకొరకు సిద్ధముగాయుండుట, అనగా వారు తమ అంగవస్త్రములను బాగుగా నడుములకు బిగించి కట్టుకొని, దీపములలో నిండుగా తైలము పోసివుంచుకొని రాత్రివరకు తమ పనులను కొనసాగించుటద్వారా చూపించబడినది. యేసు ఇలా వివరించును: “యజమాని రెండవ జామున [రాత్రి దాదాపు తొమ్మిదినుండి అర్థరాత్రి వరకు] వచ్చినను, మూడవ జామున [అర్ధ రాత్రినుండి తెల్లవారుజాము మూడుగంటల వరకు] వచ్చినను వారు సిద్ధముగా ఉన్నట్లు ఆయన కనుగొనినట్లయిన, వారు ధన్యులు!”—NW.

యజమాని తనసేవకులకు అసాధారణమైన రీతిలో ప్రతిఫలమిచ్చును. ఆయన వారిని బల్లయొద్ద కూర్చుండజేసి తానే వారికి వడ్డించ నారంభించును. ఆయన వారిని దాసులుగా కాక, యథార్థమైన స్నేహితులుగా పరామర్శించును. ఆయన రాకకై ఎదురుచూచుచు తమ యజమాని కొరకు రాత్రంతయు ఎడతెగక పనిచేసినందుకు ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలము! యేసు ఇలా ముగించును: “మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక, మీరును సిద్ధముగా ఉండుడి.”

ఇప్పుడు పేతురు, “ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా?” అని అడుగును.

సూటిగా జవాబుచెప్పుటకు బదులు, యేసు మరియొక ఉపమానము చెప్పును. ఆయనిట్లడుగును: “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తనయింటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.”

ఆ “యజమానుడు” నిజంగా యేసుక్రీస్తే. ఆ “గృహనిర్వాహకుడు” ఒక సమూహముగా “చిన్నమందకు” చెందిన శిష్యులకు సూచన, కాగా “ఇంటివారు” అనగా పరలోక రాజ్యమును పొందు అదే గుంపునకు చెందిన 1,44,000 మందిని సూచించుచున్నారు, అయితే ఆ మాట వారు వ్యక్తిగతముగా చేయుపనిని నొక్కితెలియజేయుచున్నది. నమ్మకమైన గృహనిర్వాహకునికి అప్పగించబడిన యజమానియొక్క “కలిగిన యావత్తు” అనగా ఆయన భూసంబంధమైన రాజరికపు పనులే, అందులో ఆ రాజ్యముక్రింద భూమిపై ఉండబోవు ప్రజలును చేరియున్నారు.

యేసు ఉపమానమును ఇంకను కొనసాగించుచు, గృహనిర్వాహకుడు, లేక దాసుని తరగతిలోని సభ్యులందరు యథార్థముగా ఉండరని సూచించుచు, ఆయన ఇట్లు వివరించును: “ఆ దాసుడు ‘నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని’ తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములో . . . ఆ దాసుని యజమానుడు వచ్చి . . . వానిని తీవ్రముగా శిక్షించును.”—NW.

తన బోధలను కొందరు అంగీకరించి మరికొందరు తిరస్కరించినందున, తన రాకడ యూదులకు అగ్నిపరీక్ష వంటిదని యేసు చెప్పును. తను నీటిలో బాప్తిస్మము తీసుకొని మూడు సంవత్సరములు దాటింది, ఆయనిప్పుడు మరణమందు బాప్తిస్మము పొందుట మరింత సమీపమైనది, మరియు ఆయన ఇట్లనును: “అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను.”

ఈ విషయములను తనశిష్యులతో చెప్పిన తర్వాత, యేసు మరలా జనసమూహముతో మాట్లాడును. తన గుర్తింపుకు మరియు దాని ప్రాముఖ్యతకు స్పష్టముగాయున్న రుజువును అంగీకరించుటకు నిరాకరించిన వారి మూర్ఖత్వమునకు ఆయన విచారించును. “మీరు పడమటనుండి మబ్బు పైకివచ్చుట చూచునప్పుడు ‘వాన వచ్చుచున్నదని’ వెంటనే చెప్పుదురు; అలాగే జరుగును. దక్షిణపు గాలివిసరుట చూచునప్పుడు ‘వడగాలి కొట్టునని’ చెప్పుదురు; ఆలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశము వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల?” అని ఆయన అనును. లూకా 12:32-59.

“చిన్నమందలో” ఎంతమంది ఉందురు, వారు ఏమి పొందుదురు?

తన సేవకులు సిద్ధముగా ఉండు అవసరతను గూర్చి యేసు ఎట్లు నొక్కిచెప్పును?

యేసు ఉపమానములో, “యజమానుడు,” “గృహనిర్వాహకుడు,” “ఇంటివారు,” మరియు “కలిగినయావత్తు” ఎవరైయున్నారు?