హింసనెదుర్కొనుటకు సిద్ధంచేయుట
అధ్యాయము 50
హింసనెదుర్కొనుటకు సిద్ధంచేయుట
ప్రచారపనిని కొనసాగించు పద్ధతులను గూర్చి యేసు తనశిష్యులకు ఉపదేశించిన పిదప, వ్యతిరేకులనుగూర్చి వారిని హెచ్చరించుచు, ఆయనిట్లు చెప్పును: “ఇదిగో! తోడేళ్లమధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను . . . మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. . . . నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.”
తనశిష్యులు తీవ్రమైన హింసను ఎదుర్కొనవలసియున్నను, యేసు అభయమిచ్చుచు వారికిట్లు వాగ్దానముచేయును: “వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటలాడుదుము? ఏమిచెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీ కనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడునేగాని మాటలాడువారు మీరుకారు.”
యేసు కొనసాగించుచు, “సహోదరుడు సహోదరుని, తండ్రికుమారుని మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరని” చెప్పును ఆయన ఇంకను ఇట్లనును: “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు, అంతమువరకును సహించినవాడు రక్షింపబడును.”
ప్రచారపుపని అన్నింటికంటే ప్రాముఖ్యమైయున్నది. ఈ కారణముచేతనే ఈ పనిని నెరవేర్చుట స్వతంత్ర్యముగా యుండుటకుగాను వివేచన అవసరమని యేసు నొక్కిచెప్పును. “వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని” ఆయన వారికి చెప్పెను.
ఈ ఉపదేశము, హెచ్చరిక మరియు ప్రోత్సాహమును యేసు తన 12 మంది శిష్యులకు యిచ్చెననునది వాస్తవమే అయితే ఆయన మరణపునరుత్థానముల తర్వాత ప్రపంచవ్యాప్త ప్రచారపనిలో భాగమువహించు వారికిని అవి వర్తించును. ప్రకటించుటకు అపొస్తలులు పంపబడిన ఇశ్రాయేలీయులచేత మాత్రమేకాక, తన శిష్యులు ‘మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు,’ అని ఆయన చెప్పిన వాస్తవమును బట్టి అది చూపబడెను. అంతేకాకుండ, యేసు వారిని ఆ కొద్దిపాటి ప్రచారపనికి పంపినప్పుడు నిశ్చయంగా అపొస్తలులు అధిపతులు మరియు రాజుల యెదుటకు తేబడలేదు. అంతేగాక, విశ్వాసులు తమ కుటుంబసభ్యులచేత మరణమునకు అప్పగింపబడలేదు.
“మనుష్యకుమారుడు వచ్చువరకు” తన శిష్యులు ఆ ప్రాంతమందు వారు ప్రకటించే పనిని పూర్తిచేయరని చెప్పినప్పుడు, హార్‌మెగెద్దోనునందు యెహోవా ప్రతిదండనాధికారిగా మహిమాయుతుడైన యేసుక్రీస్తు రాకముందు స్థాపించబడిన దేవుని రాజ్యమును గూర్చి భూమియంతట ప్రకటించు పనిని తన శిష్యులు పూర్తిచేయరని యేసు ప్రవచనాత్మకముగా మనకు చెప్పుచుండెను.
ప్రకటించుపనికి సంబంధించిన ఉపదేశములను కొనసాగించుచు యేసు యిట్లనును: “శిష్యుడు బోధకునికంటె అధికుడుకాడు; దాసుడు యజమానుని కంటె అధికుడుకాడు.” కనుక దేవునిరాజ్యమును ప్రకటించుటకు తాను పొందిన అవమానము, హింసలను యేసు అనుచరులు కూడా పొందుతారని ఎదురుచూడాలి. అయినను ఆయనిట్లు ఉపదేశించును: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడిగాని ఆత్మను దేహమును కూడా గెహెన్నాలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.”
ఈ విషయములో యేసు మాదిరి చూపనైయుండెను. సర్వశక్తిగల యెహోవా దేవునియెడల తనకుగల యథార్థత విషయములో రాజీపడుటకు బదులుగా ఆయన నిర్భయముగా మరణమును సహించును. అవును, యెహోవాయే ఒకని ఆత్మను (ఈ సందర్భములో జీవించు ఆత్మగా ఒకని భవిష్యత్ ఉత్తరాపేక్షలని భావము.) నాశనము చేయగలవాడు లేక నిత్యజీవమును అనుభవించుటకు ఒక వ్యక్తిని పునరుత్థానము చేయగలవాడు. యెహోవా ఎంతటి ప్రేమగల, దయాళుడైన పరలోకపు తండ్రి!
యెహోవా వారియెడల కల్గియున్న ప్రేమాపూర్వక లక్షణమును ఉన్నతపర్చే ఒక ఉపమానముతో యేసు తదుపరి తన శిష్యులను ప్రోత్సహించును. “రెండుపిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా? అయినను, మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెంట్రుకలన్నియు లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”
ప్రకటించుమని యేసు తన శిష్యులకు అప్పగించిన రాజ్యవర్తమానమును కుటుంబ సభ్యులలో కొందరు అంగీకరించి మరికొందరు నిరాకరించుట వలన కుటుంబములు విభాగింపబడును. “భూమి మీదికి నేను సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు” అని ఆయన వివరించెను. ఆ విధముగా కుటుంబ సభ్యుడొకరు బైబిలు సత్యమును హత్తుకొనవలెనంటే ధైర్యము అవసరము. యేసు యిలా చెప్పెను, “తండ్రినైనను, తల్లినైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు, కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు.”
తన ఉపదేశములను ముగించుచు తనశిష్యులను చేర్చుకొనువాడు తన్ను చేర్చుకొనుచున్నాడని యేసు వివరించును. “మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్లు మాత్రమునిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” మత్తయి 10:16-42.
▪ యేసు తన శిష్యులకు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చును?
▪ వారికి ఆయన ఎలాంటి ప్రోత్సాహమును, ఓదార్పును ఇచ్చును?
▪ యేసు ఉపదేశములు ఆధునిక-దిన క్రైస్తవులకు కూడా ఎందుకు వర్తించును?
▪ యేసు శిష్యుడు ఏ విధముగా తన బోధకునికంటె అధికుడుకాడు?