జీవితం ఎందుకు ఇంతగా సమస్యలతో నిండివుంది?
రాజ్య వార్త నం. 34
జీవితం ఎందుకు ఇంతగా సమస్యలతో నిండివుంది?
సమస్యలులేని పరదైసు సాధ్యమేనా?
గంభీరమైన సమస్యలు మరింత జటిలమౌతాయి—ఎందుకు?
ప్రజలకు ఎల్లప్పుడూ సమస్యలున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాటిని తీర్చగలదని అనేకులు తలంచినప్పటికీ, గంభీరమైన సమస్యలు మరింత జటిలమౌతూనే ఉన్నాయి.
నేరం: వీధుల్లో నడవడం లేక తమ స్వంత గృహాల్లో కూర్చోవడం కూడా క్షేమకరమని తలంచేవారు కొద్దిమందే. ఒక ఐరోపీయ దేశమందు ఇటీవలి ఓ సంవత్సరంలో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒక వ్యక్తి నేర బాధితుడే.
పర్యావరణం: వాయు, భూ, జల కాలుష్యం మరీ మరీ విస్తరించింది. వర్ధమాన దేశాల్లో, నాల్గోవంతు జనాబాకు మంచి నీటి సౌకర్యం లేదు.
పేదరికం: మునుపెన్నటి కంటే నేడు ఎక్కువమంది పేదవారు, క్షుధ్బాధితులు ఉన్నారు. కొన్ని దేశాల్లో 90 శాతం కంటే ఎక్కువమంది ప్రజలు పేదరికమందు జీవిస్తున్నారు; ప్రపంచ కార్మిక శక్తిలో 30 శాతం అంటే దాదాపు 80 కోట్లమంది నిరుద్యోగులు లేక తగిన ఉద్యోగంలేని వారు—మరియు ఆ సంఖ్యలు పెరుగుతూనే ఉంటాయి.
ఆకలి: మీవరకు మీకు తినడానికి తగినంత ఉన్నప్పటికీ, పెరుగుతున్న లక్షలాదిమందికి తగినంత లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ప్రతి సంవత్సరం కనీసం 1.3 కోట్లమంది ప్రజలు, ఎక్కువగా పిల్లలు, క్షుధ్బాధిత ప్రభావాల వల్ల మరణిస్తున్నారు.
యుద్ధం: ఇటీవల జరిగిన జాతి సంబంధమైన దౌర్జన్యంలో లక్షలాదిమంది మరణించారు. ఇరవయ్యవ శతాబ్దంలో, యుద్ధాలు పది కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలను చంపాయి.
ఇతర సమస్యలు: పైవాటికి తోడు, కుటుంబ విచ్ఛిన్నం మరీ అధికమవ్వడం, ఎక్కువమంది అవివాహిత తల్లులు, పెరుగుతున్న గృహాల కొరత, విస్తృత మాదకద్రవ్యాల దుర్వినియోగం, పెచ్చుపెరిగిపోతున్న దుర్నీతి కూడా ఉన్నాయి. ఒక మాజీ అమెరికా కాబినెట్ సభ్యుడు, సరిగ్గానే ఇలా చెప్పాడు: “నాగరికత దిగజారిపోయిందనడానికి . . . కేవలం అనేకానేక సూచనలు ఉన్నాయి.” ఇటీవలి 30 సంవత్సరాల కాలంలో, అమెరికా జనాబా 41 శాతం పెరిగింది, కాని హింసాయుత నేరం 560 శాతం, చట్టవిరుద్ధమైన జననాలు 400 శాతం, విడాకులు 300 శాతం, యౌవనస్థుల ఆత్మహత్యా స్థాయి 200 శాతం అకస్మాత్తుగా పెరిగాయి. ఇతర దేశాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది.
సమస్యలెందుకు జటిలమయ్యాయి?
మన సృష్టికర్త సమాధానం దయ చేస్తున్నాడు. “వ్యవహరించుటకు క్లిష్టమైన కాలములుగా” ఉండే ఒక కాలమైన ఈ సమస్యలతో నింపబడిన కాలములను “అంత్యదినముల”ని ఆయన వాక్యము పిలుస్తోంది. (2 తిమోతి 3:1 NW) దేనికి అంత్య దినాలు? బైబిలు “ప్రపంచ అంతాన్ని” గూర్చి మాట్లాడుతుంది.—మత్తయి 24:3, కింగ్ జేమ్స్ వర్షెన్.
దుష్టత్వం మరియు దానికి బాధ్యులైనవారి అంతంతో సహా ఈ విధానాంతం సమీపంలో ఉందనడానికి పెరుగుతున్న నేటి సమస్యలే స్పష్టమైన నిదర్శనాలు. (మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5; ప్రకటన 12:7-12) త్వరలోనే దేవుడు జోక్యం చేసుకుని నేటి సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరింపబడేలా చూస్తాడు.—యిర్మీయా 25:31-33; ప్రకటన 19:11-21.
ఈ ప్రపంచ మతాలు విఫలమయ్యాయి
నేటి సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేసే బదులు, ఈ ప్రపంచ మత విధానం వాటిని అధికం చేసింది. యుద్ధాల సమయాల్లో, కాథోలిక్కులు కాథోలిక్కులను, ప్రొటెస్టంట్లు ప్రొటెస్టంట్లను లక్షల సంఖ్యలో చంపుతారు. కాథోలిక్కులు ఎక్కువగా ఉన్న రువాండాలో ఇటీవల, ప్రజలు లక్షల సంఖ్యలో ఒకరినొకరు చంపుకుంటున్నారు! (ఎడమవైపువున్న చిత్రాన్ని చూడండి.)
తన జాతీయత నుండి తన శిష్యుల జాతీయత వేరుగా ఉన్నందున వారిని చంపడానికి యేసు ఒక తుపాకీనో లేక పెద్ద కత్తినో తీసుకుని యుద్ధానికి వెళతాడా? కచ్చితంగా వెళ్లడు! బైబిలు ఇలా చెబుతుంది: “దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెను.” (1 యోహాను 4:20, 21) దానిని చేయడంలో ఈ ప్రపంచ మతాలు విఫలమయ్యాయి. “దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, . . . తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.”—తీతు 1:16.
అంతేగాక, బైబిలు యొక్క నైతిక ప్రమాణాలను నిజంగా ఉన్నతపర్చకపోవడం ద్వారా ప్రపంచ మతాలు భీతిగొల్పే భూవ్యాప్త నైతిక పతనానికి దోహదపడుతున్నాయి.
‘దాని ఫలాల’ ద్వారా, అంటే దాని సభ్యులు చేసేదాన్ని బట్టి ఏది అబద్ధ మతమో ఏది నిజమైన మతమో చెప్పవచ్చునని యేసు తెలియజేశాడు. ఆయనిలా కూడా చెప్పాడు: “మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.” (మత్తయి 7:15-20) చెడు ఫలాలను ఫలించి, తద్వారా నాశనానికిపోయే మతాన్ని విడిచి పారిపొమ్మని దేవుని వాక్యం మనల్ని కోరుతుంది.—ప్రకటన 18:4.
నిజమైన మతం విఫలం కాలేదు
నిజమైన మతం “మంచి ఫలాలను” ప్రాముఖ్యంగా, ప్రేమను ఫలిస్తుంది. (మత్తయి 7:17; యోహాను 13:34, 35) ఏ ఐక్యమైయున్న అంతర్జాతీయ క్రైస్తవ సహోదరత్వం అలాంటి ప్రేమను కలిగివుంది? తమ స్వంత మతం వారిని గాని, లేక ఏ మతం వారినైనా గాని చంపడానికి నిరాకరించేది ఎవరు?—1 యోహాను 3:10-12.
ఆ “మంచి ఫలాలను” ఫలిస్తారన్న పేరు యెహోవాసాక్షులకు ఉంది. భూగోళవ్యాప్తంగా, 230 కంటే ఎక్కువ దేశాల్లో, ‘వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టారు.’ (యెషయా 2:4) ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యాన్ని గూర్చిన “సువార్తను” ప్రకటించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు వారు విధేయత చూపించడాన్ని బట్టి కూడా ప్రజల యెడల వారికి గల ప్రేమ ప్రదర్శించబడుతుంది. (మత్తయి 24:14) వారు బైబిలునందు బోధించబడిన ఉన్నతమైన నైతికతలను కూడ పాటించి, సమర్థిస్తారు.—1 కొరింథీయులు 6:9-11.
నిజమైన మతం విఫలం కాలేదు. మానవజాతి సమస్యలను పరిష్కరించగల ఏకైక సమర్థునివైపు అది ప్రజలను నడిపిస్తుంది. త్వరలోనే ఆ ఒకరు పూర్తిగా క్రొత్తదైన లోకాన్ని తీసుకువస్తారు. ఆయన ఎవరు? (దయచేసి వెనుక పేజీ చూడండి.)
సమస్యలులేని పరదైసు నిశ్చయం
మీరు పరిష్కరించగల్గినట్లయితే, మానవజాతిని బాధిస్తున్న సమస్యలన్నిటినీ మీరు పరిష్కరించరా? తప్పకుండా మీరలా చేస్తారు! మానవజాతి సమస్యలను పరిష్కరించే శక్తి, జ్ఞానం తనకు మాత్రమేవున్న మన ప్రేమగల సృష్టికర్త అంతకంటే తక్కువ ఏమైనా చేస్తాడని మనం తలంచాలా?
యేసుక్రీస్తు అధికారం క్రిందనున్న తన పరలోక ప్రభుత్వం ద్వారా దేవుడు మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడని బైబిలు తెలియజేస్తుంది. అది భూమిపైనున్న భ్రష్ట ప్రభుత్వాలను “పగులగొడుతుంది.” (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) ఎందుకు? దేవున్ని సంబోధిస్తూ కీర్తనల గ్రంథకర్త ఇలా సమాధానమిస్తున్నాడు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.”—కీర్తన 83:18.
ఈ లోకం అంతమైనప్పుడు, తప్పించుకొనే వారుంటారా? “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని బైబిలు తెలియజేస్తుంది. (1 యోహాను 2:17) ఈ తప్పించుకొనేవారు నిరంతరం ఎక్కడ జీవిస్తారు? “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని బైబిలు సమాధానమిస్తుంది.—కీర్తన 37:9-11, 29; సామెతలు 2:21, 22.
దేవుని నూతన లోకంలో, “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:4) నేరం, పేదరికం, ఆకలి, అనారోగ్యం, దుఃఖం, లేక మరణం ఇక ఉండనే ఉండవు! అంతెందుకు, మరణించిన వారు కూడా తిరిగి జీవిస్తారు! “పునరుత్థానం కలుగబోవుచున్నది.” (అపొస్తలుల కార్యములు 24:15) మరియు భూమి అక్షరార్థకమైన పరదైసుగా మార్చబడుతుంది.—యెషయా 35:1, 2; లూకా 23:43.
దేవుని నూతన లోకంలో జీవితాన్ని అనుభవించడానికి మనం ఏమి చేయాలి? యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది యథార్థ హృదయులు ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇది వారు ఇప్పుడు తమ వ్యక్తిగత సమస్యలనెన్నింటినో ఎదుర్కోడానికి వారికి సహాయం చేస్తుంది, కాని మరింత ప్రాముఖ్యంగా, తాము పరిష్కరించలేని సమస్యలు దేవుని నూతన లోకంలో పూర్తిగా పరిష్కరించబడతాయన్న పూర్ణ విశ్వాసాన్ని అది వారికి ఇస్తుంది.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO photo by P. Almasy
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Jerden Bouman/Sipa Press