కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం

ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం

అధ్యాయం 3

ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం

1, 2. మనం బైబిలునెందుకు పరీక్షించాలి?

1 బైబిలు అట్టి ఉన్నత జ్ఞానంగల గ్రంథమేనా? జీవిత సంకల్పానికి సంబంధించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు అది నిజమైన సమాధానములనివ్వగలదా?

2 నిశ్చయంగా బైబిలు మన పరిశీలనకు తగిన విలువను కలిగివున్నది. ఒక కారణమేమంటే సమకూర్చబడిన వాటిలోకెల్లా యిది అత్యంత అసాధారణమైన పుస్తకమును, గ్రంథాలలోకెల్లా విభిన్నమైన గ్రంథమైయుంది. ఈ క్రింది వాస్తవాలను పరిశీలించండి.

అతి ప్రాచీనమైన, విస్తారంగా పంచిపెట్టబడిన గ్రంథము

3, 4. బైబిలెంత పురాతనమైనది?

3 వ్రాయబడిన వాటిలోకెల్ల బైబిలు అతి ప్రాచీన గ్రంథము, దానిలోని కొన్నిబాగాలు దాదాపు 3,500 సంవత్సరాల పూర్వం కూర్చబడ్డాయి. పరిశుద్ధ గ్రంథమని పరిగణించబడిన మరే పుస్తకముకంటెను ఇది శతాబ్దాల పురాతనమైనది. దానియందలి 66 పుస్తకాల్లో మొదట వ్రాయబడినవి బుద్ధుడు, కన్‌ఫ్యూసియస్‌కంటె వెయ్యి సంవత్సరాల ముందుగా, మహమ్మదుకంటే రెండు వేల సంవత్సరాల ముందుగా వ్రాయబడ్డాయి.

4 బైబిల్లో వ్రాయబడిన చరిత్ర మానవ కుటుంబ ఆరంభాన్ని గూర్చి తెలియజేస్తూ, మనమీ భూమ్మీదికి ఎలావచ్చామో వివరిస్తున్నది. అది మానవులు సృష్టింపబడని ముందు కాలానికి తీసుకెళ్లి, ఈ భూమి రూపింపబడిన విధానాన్ని గూర్చిన వాస్తవాలను మనకు తెలియజేస్తుంది.

5. లౌకికమైన ప్రాచీన వ్రాతలతో పోలిస్తే, బైబిలుకు సంబంధించిన ఎన్ని ప్రాచీన చేతివ్రాత ప్రతులు ఉనికిలో వున్నాయి?

5 ఇతర మత గ్రంథాల, మతేతర గ్రంథాల పురాతన చేతివ్రాత ప్రతులు కేవలం కొద్దికాపీలే ఉనికిలోవున్నాయి. హెబ్రీ, గ్రీకు భాషల్లో బైబిలుకు సంబంధించిన దాదాపు 13,000 చేతివ్రాత ప్రతులు ఉనికిలోవున్నాయి, వీటిలో కొన్ని ఆదిమ వ్రాతల కాలానికి దగ్గర కాలంలో వ్రాయబడ్డాయి. బైబిలుకు వ్యతిరేకంగా పథకం ప్రకారం దాడులు నిర్వహించినప్పటికి కూడ ఇవి తప్పించుకున్నాయి.

6. బైబిలు ఎంత విస్తారంగా పంచిపెట్టబడింది?

6 అంతేకాకుండ, చరిత్రలో బైబిలు అత్యంత విస్తారంగా అందింపబడిన గ్రంథం. దాదాపు 2,000 భాషల్లో మూడు అరబ్‌ల [300 కోట్ల] బైబిళ్లు లేదా దానిభాగాలు పంచిపెట్టబడ్డాయి. మానవ కుటుంబంలో దాదాపు 98 శాతం మంది తమ భాషలోనే బైబిలు చదువ వీలున్నదని చెప్పబడింది. మరే పుస్తకం కూడ బైబిలంత విస్తారంగా పంచిపెట్టబడలేదు.

7. బైబిలు ప్రామాణికతను గూర్చి ఏమిచెప్పవచ్చును?

7 దానికితోడు, మరే ప్రాచీన గ్రంథం కూడ బైబిలు ప్రామాణికతకు సాటిరాదు. విజ్ఞానశాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, భూగోళ పరిశోధకులు, భాషా పండితులు, అంతకంతకు ఎక్కువగా బైబిలు వృత్తాంతాలను ధృవపరస్తున్నారు.

విజ్ఞానశాస్త్ర ప్రామాణికత

8. విజ్ఞానశాస్త్ర విషయాల్లో బైబిలెంత ప్రామాణికంగా ఉంది?

8 ఉదాహరణకు, బైబిలు విజ్ఞానశాస్త్ర బోధినిగా వ్రాయబడకపోయినను, విజ్ఞానశాస్త్ర విషయాల్ని ప్రస్తావించినప్పుడు అది నిజమైన విజ్ఞానశాస్త్రంతో పొందిక కలిగివుంది. అయితే పరిశుద్ధమని పరిగణింపబడిన ఇతర ప్రాచీన గ్రంథాల్లో విజ్ఞానశాస్త్రపు కట్టుకథలు, అప్రమాణికతలు, వట్టి అబద్ధాలు ఉన్నాయి. బైబిలు విజ్ఞానశాస్త్ర ప్రామాణికతకున్న అనేక ఉదాహరణల్లో కేవలం నాలుగింటిని గమనించండి:

9, 10. ఆ కాలమందలి విజ్ఞానరహిత విషయాల్ని చెప్పడానికి బదులు భూమికున్న ఆధారాన్ని గూర్చి బైబిలు ఏమిచెప్పింది?

9భూమి అంతరిక్షంలో ఎలా ఉంచబడింది. బైబిలు వ్రాయబడుతున్న ప్రాచీన కాలాల్లో, భూమి అంతరిక్షంలో ఎలా ఉంచబడిందనే విషయంలో ఎన్నో ఊహలుండేవి. ఒక పెద్ద తాబేలుపై నిలబడ్డ నాలుగు ఏనుగులపై భూమి మోపబడిందని కొందరు నమ్మారు. గ్రీకు తత్వజ్ఞాని, సా.శ.పూ. నాల్గవ శతాబ్దపు శాస్త్రజ్ఞుడైన అరిస్టోటిల్‌ భూమి ఎన్నటికిని అంతరిక్షంలో వ్రేలాడలేదని బోధించాడు. బదులుగా, ఆయన ఒక గోళంలో మరో గోళంతోనున్న స్ఫటికంవంటి ఖగోళ ఘన పదార్థానికి ఆకాశపు గ్రహాలన్నీ అతికించబడ్డాయని బోధించాడు. అన్నింటికంటె లోనవున్న గోళం లోపలి భాగాన భూమి అతికింపబడిందని, అన్నింటికంటే బయటవున్న గోళానికి బయట నక్షత్రాలు అతికించబడ్డాయని తలంచారు.

10 బైబిలు వ్రాయబడిన కాలంలో ఉనికియందున్న అట్టి కల్పిత, విజ్ఞానరహిత దృక్పథాలను అనుసరించే బదులు అది (సా.శ.పూ. దాదాపు 1473 వ సంవత్సరంలో) యిలా చెప్పింది: “శూన్యముపైని [దేవుడు] భూమిని వ్రేలాడచేసెను.” (యోబు 26:7) ఇక్కడ “శూన్యము” అని ఉపయోగింపబడిన ఆదిమ హెబ్రీపదమునకు “దేనిపైనా కాదు” అనే భావముంది. బైబిల్లో ఇక్కడ మాత్రమే ఆ పదం ఉపయోగింపబడింది. భూమిచుట్టూ శూన్యముందనే బైబిలు వర్ణనను గూర్చి విద్వాంసులు ఆ కాలానికి బైబిలు ఆశ్చర్యకరమైన బావిజ్ఞానం చూపిందని గుర్తించారు. థియోలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ ఇట్లనుచున్నది: “యోబు 26:7 ఆనాటి లోకం శూన్యమందు వ్రేలాడుతుందని స్పష్టంగా చిత్రీకరించి, బావి విజ్ఞానశాస్త్ర పరిశోధనకు నాంది పలికింది.”

11, 12. యోబు 26:7 నందలి సత్యాన్ని మానవులు ఎప్పుడు అర్థంచేసుకున్నారు?

11 ప్రామాణికమైన ఈ బైబిలు మాట అరిస్టోటిల్‌కు 1,100 సంవత్సరాల పూర్వమే చెప్పబడింది. అయిననూ, అరిస్టోటిల్‌ మరణం తర్వాత దాదాపు 2,000 సంవత్సరాల వరకు ఆయన అభిప్రాయాలే వాస్తవాలుగా బోధించబడ్డాయి. చివరకు సా.శ. 1687 లో సర్‌ ఐజక్‌ న్యూటన్‌, గురుత్వాకర్హణ అనే పరస్పర ఆకర్షణ శక్తితో ఆకాశమందలి ఇతర గ్రహాలతో కలిసి భూమి శూన్యంలో ఉందని తన పరిశోధనా ఫలితాల్ని ప్రచురించాడు. అయితే భూమి “శూన్యముపైని” వ్రేలాడుతున్నదని బైబిలు సామాన్య పరిభాషలో కడురమ్యంగా చెప్పిన దాదాపు 3,200 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది.

12 అవును, భూమికి దృశ్యమైన ఏ ఆధారం లేదని బైబిలు దాదాపు 3,500 సంవత్సరాల క్రితమే సరిగ్గా చెప్పింది, ఈ వాస్తవం ఇటీవల కాలంలో మరింత అర్థంచేసుకున్న గురుత్వాకర్హణ, కదలిక నియమాలతో పొందిక కలిగివుంది. “ఆ సత్యం యోబుకు ఎలా తెలుసనే ప్రశ్నకు జవాబు పరిశుద్ధ లేఖనాలు ప్రేరేపితమని నిరాకరించేవారికి అంత సుళువుగా దొరకదని” ఒక విద్వాంసుడు అన్నాడు.

13. శతాబ్దాల క్రితం మానవులు భూమి ఆకారం ఎలావుందనుకున్నారు, అయితే వారి మనస్సునేది మార్చింది?

13భూమి ఆకారం. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా యిట్లన్నది: “పూర్వ కాలమందు మానవులు భూమి గట్టిగా, బల్లపరుపుగా విశ్వానికి మధ్యలో ఉందని నమ్మేవారు. . . . భూమి గోళాకారంలో ఉందనే తలంపు పునరుద్ధరించబడే వరకు ఎక్కువగా అంగీకరింపబడని విషయంగా ఉండేది.” కొంతమంది నావికులు తాము భూమి అంచువరకు వెళ్తే దొర్లిపడిపోతామని కూడా భయపడేవారు. ఆ తర్వాత సుదూర సముద్ర ప్రయాణాలు చేయడాన్ని సాధ్యపరచిన దిక్సూచి, ఇతర పరికరాలు పరిచయం చేయబడ్డాయి. “అనేకమంది ప్రజలు నమ్మునట్లుగా భూమి బల్లపరుపుగా లేదుగాని, గుండ్రంగా ఉందని ఈ పరిశోధనాత్మక సముద్ర ప్రయాణాలు చూపాయి” అని మరో సర్వసంగ్రహ నిఘంటువు వివరిస్తున్నది.

14. భూమి ఆకారాన్ని బైబిలు ఎలా వర్ణించింది, ఎప్పుడు?

14 అయితే అటువంటి సముద్ర ప్రయాణాలకు ఎంతోకాలం ముందే, దాదాపు 2,700 సంవత్సరాల పూర్వం బైబిలిట్లు చెప్పింది: “ఆయన భూమండలము మీద ఆసీనుడై యున్నాడు.” (యెషయా 40:22) వివిధ గ్రంథాలు వ్రాసినట్లుగా “మండలము” అని ఇక్కడ అనువదింపబడిన హెబ్రీ పదానికి “గోళము” అని కూడ అర్థం కలదు. కాబట్టి ఇతర బైబిలు భాషాంతరాలు “భూగోళము,” (డుయే వర్హన్‌) “గుండ్రని భూమి” (మోఫత్‌) అని అనువదించాయి.

15. భూమిని గూర్చిన విజ్ఞానరహిత దృక్కోణాల ప్రభావానికి బైబిలెందుకు లోనుకాలేదు?

15 అలా భూమికివున్న ఆధారం, ఆకారాన్ని గూర్చి ఆ కాలంలో ప్రబలమైవున్న విజ్ఞానరహిత అభిప్రాయాలచే బైబిలు ప్రభావితం కాలేదు. దానికిగల కారణం అతిసామాన్యం: బైబిలు గ్రంథకర్త ఈ విశ్వసృష్టికే కారకుడై యున్నాడు. ఆయన ఈ భూమిని సృష్టించాడు, కావున అది ఎక్కడ వ్రేలాడుతున్నది, దాని రూపం ఎలావున్నది ఆయనకు తెలిసివుండాలి. కావున, ఆయన బైబిలును ప్రేరేపించినప్పుడు, ఆ కాలమందలి ఇతరులెంత బలంగా నమ్మిననూ, అట్టి విజ్ఞానవిరుద్ధ విషయాలు అందులో వ్రాయబడకుండా చూశాడు.

16. జీవరాసుల నిర్మాణం ఎలా బైబిలు కథనంతో అంగీకరిస్తున్నది?

16జీవరాసుల కూర్పు. “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించెనని” ఆదికాండము 2:7 చెబుతున్నది. ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇట్లనుచున్నది: “జీవరాసులందున్న రసాయన ధాతువులన్నియు నిర్జీవ పదార్థాల్లో కూడా కలవు.” మానవునితో సహా జీవరాసులన్నీ కలిగివున్న ప్రాథమిక రసాయనాలన్నీ భూమిలో లభించగలవు. మానవులను, ఇతర జీవరాసులను సృష్టించుటకు దేవుడు ఉపయోగించిన పదార్థాలను గుర్తించి బైబిలు చెప్పిన ఆ మాటతో ఇది పొందిక కలిగియున్నది.

17. జీవరాసులు ఉనికిలోనికి వచ్చుటను గూర్చిన సత్యమేమి?

17“వాటి వాటి జాతి ప్రకారము.” దేవుడు మొదటి మానవజతను సృజించాడని వారినుండే మానవులందరూ ఉద్భవించారని బైబిలు చెబుతున్నది. (ఆదికాండము 1:26-28; 3:20) చేపలు, పక్షులు, సస్తన జాతులవంటి ఇతర జీవరాసులు కూడా అదేరీతిలో “వాటి వాటి జాతి ప్రకారము” వచ్చాయని అది చెబుతున్నది. (ఆదికాండము 1:11, 12, 21, 24, 25) సహజ సృష్టిలో విజ్ఞానశాస్త్రవేత్తలు కూడ ప్రతిజీవి అదేజాతికి చెందిన తలిదండ్రులనుండి వస్తున్నదని కనుగొన్నారు. దీనికి మరో మార్గం లేదు. ఈ విషయంలో భౌతిక శాస్త్రవేత్తయగు రెమో గమనించినదేమంటే, “జీవం జీవానికి జన్మనిస్తుంది; ప్రతి కణంలో ఎల్లప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి నిర్జీవమైనది జీవాన్నెలా పుట్టించగలదు? జీవశాస్త్రంలో ఇది జవాబు దొరకని అతిపెద్ద ప్రశ్న, పైగా జీవశాస్త్ర నిపుణులు తమ ఊహాజనిత విషయాలకు మించి మరింకేమీ చెప్పలేరు. నిర్జీవ పదార్థం ఏదోవిధంగా మొత్తానికి జీవ పదార్థంగా తయారైంది. . . . ఆదికాండము వ్రాసిన గ్రంథకర్త దాన్ని సరిగానే చెప్పియుండవచ్చును.”

చారిత్రక ప్రామాణికత

18. బైబిలు చారిత్రక ప్రామాణికతను గూర్చి ఒక న్యాయవాది ఏమని చెప్పాడు?

18 ఉనికిలోనున్న మరే గ్రంథము కంటెను బైబిలునందు అత్యంత ప్రామాణికమైన ప్రాచీనకాల చరిత్ర కలదు. ఎ లాయర్‌ ఎగ్జామిన్స్‌ ది బైబిల్‌ అనే పుస్తకం దాని చారిత్రక ప్రామాణికతను యిలా నొక్కిచెబుతున్నది: “ఏదో దూర ప్రాంతాలకు, అనిశ్చయ కాలానికి సంబంధించిన సంఘటనల్ని గూర్చి ప్రేమగాథలు, కథలు, అబద్ధ సాక్ష్యాలు జాగ్రత్తగా తెల్పిననూ, అవి మంచి వాదనకు నడపడానికి మా న్యాయవాదులు నేర్చుకునే నియమాలను, అనగా ‘ఆ గాథ కాలాన్ని, ప్రదేశాన్ని ఇవ్వాలనే’ మొదటి నియమాలను ఉల్లంఘిస్తాయి. అయితే బైబిలు గాథలు విషయానికి సంబంధించిన అత్యంత ప్రామాణికమైన తేదీని, ప్రదేశాన్ని మనకు తెలియజేస్తాయి.

19. బైబిలు చారిత్రక ప్రామాణికతను గూర్చి ఒక గ్రంథమూలము ఏమని వ్యాఖ్యానించింది?

19ది న్యూ బైబిల్‌ డిక్షనరీ యిలా వ్యాఖ్యానిస్తున్నది: “[అపొస్తలుల కార్యములు రచయిత] తన రచనను సమకాలీన చరిత్ర పరిధిలోనే వ్రాశాడు; ఆయన పుస్తకంలో నగర న్యాయాధికారులు, ప్రాంత పరిపాలకులు, సామంత రాజుల వంటివారిని గూర్చిన ఎన్నో ప్రస్తావనలు కలవు. కాగా ఈ ప్రస్తావనలు పదేపదే చెప్పబడిన ప్రదేశం, కాలం విషయంలో ప్రామాణిక సత్యాలని నిరూపించబడ్డాయి.”

20, 21. బైబిలు చరిత్రను గూర్చి ఒక బైబిలు విద్వాంసుడు ఏమని చెప్పాడు?

20ది యూనియన్‌ బైబిల్‌ కంపానియన్‌ నందు వ్రాస్తూ, ఎస్‌. ఆస్టిన్‌ ఆలిబోన్‌ ఇట్లంటున్నాడు: “సర్‌ ఐజక్‌ న్యూటన్‌ . . . కూడ ప్రాచీన వ్రాతల ప్రముఖ విమర్శకుడై యుండి, ఎంతో శ్రద్ధతో పరిశుద్ధ లేఖనాల్ని పరిశీలించాడు. ఈ విషయంలో ఆయన నిర్ణయమేమిటి? ‘[లోకమందలి] ఏ చరిత్రకంటెను క్రొత్త నిబంధన వాస్తవికతకు నిశ్చయమైన గుర్తులున్నవని నేను కనుగొన్నానని’ ఆయనన్నారు. జూలియస్‌ సీజర్‌ కాపిటోల్‌నందు మరణించాడని చెప్పడానికంటె సువార్తల్లో చెప్పబడినట్లు యేసుక్రీస్తు కల్వరీపై మరణించాడని చెప్పడానికి మనకెక్కువ రుజువుంది అని డా. జాన్సన్‌ అన్నారు. నిజానికి దానికంటే రుజువులున్నాయి.”

21 ఈ గ్రంథమూలము ఇంకను ఇట్లనుచున్నది: “సువార్త సత్యాన్ని సందేహించు వారిని సీజర్‌ కాపిటోల్‌నందు మరణించాడని చెప్పడానికి, లేదా 800 సంవత్సరంలో పోప్‌ లియో III ద్వారా పశ్చిమ సామ్రాజ్య చక్రవర్తిగా షార్లిమాన్‌ నియామాకాన్ని నమ్మడానికి వారికే కారణాలున్నాయో అడగండి. . . . [ఇంగ్లాండుకు చెందిన] చార్షెస్‌ I అనేవ్యక్తి అసలు ఒకప్పుడు ఉండెనని, అతడు శిరచ్ఛేదన చేయబడ్డాడని, అతనికి బదులుగా ఆలివర్‌ క్రోమ్‌వెల్‌ పరిపాలకుడయ్యాడని మీకెలా తెలుసు? . . . భూమ్యాకర్షణ సూత్రాన్ని కనుగొన్న ఘనత సర్‌ ఐజక్‌ న్యూటన్‌కు దక్కింది . . . ఈ మనుష్యులను గూర్చి రూఢిగా చెప్పిన విషయాలన్నీ మనం నమ్ముతాము; ఎందుకంటే వారిని గూర్చిన సత్యాల చరిత్ర రుజువున్నందుకే. . . . అయితే రుజువునిచ్చిన తర్వాత కూడ ఎవరైనా నమ్మడానికి తిరస్కరిస్తే వారిని మనం మూర్ఖులని, నిరుపయోగులని లెక్కిస్తాము.”

22. బైబిలు వాస్తవికత నంగీకరించుటకు కొందరెందుకు తిరస్కరిస్తారు?

22 ఆ పిమ్మట ఈ గ్రంథమూలము యిలా ముగించింది: “అట్లయిన, పరిశుద్ధ లేఖనాల వాస్తవికతను నిరూపించే విస్తారమైన రుజువులనిచ్చిననూ తమకవి అంగీకారంగా లేవని త్రోసిపుచ్చేవారిని గూర్చి మనమేమి చెప్పాలి? . . . నిశ్చయంగా దోషం తలలో కాదుగాని హృదయంలో వుందనే మనం చెప్పడానికి కారణాలున్నాయి; అంటే వారి అహంభావాన్ని దెబ్బతీసి, భిన్నమైన జీవితం జీవించడానికి ఒత్తిడిచేసే దానిని నమ్మడానికి వారు ఇష్టపడ్డం లేదని దాని భావం.

అంతర్గత పొందిక, నిష్కల్మత్వం

23, 24. బైబిలు అంతర్గత పొందిక ఎందుకంత అసాధారణం?

23 విభిన్న రచయితల తోడ్పాటుతో రోమా సామ్రాజ్య కాలంలో ఆరంభమై మధ్యయుగాల్లో కొనసాగి ఈ 20 వ శతాబ్దంలో ఒక గ్రంథం పూర్తిగావించబడిందని ఊహించండి. ఆ రచయితలు సైనికులు, రాజులు, యాజకులు, జాలరులు, పశువుల కాపరులు, వైద్యులవంటి విభిన్న వృత్తులవారైతే మీరెటువంటి ఫలితం ఆశిస్తారు? ఆ పుస్తకం అనుగుణ్యతతో, పొందికగా ఉండాలని అపేక్షిస్తారా? అది అసాధ్యమని మీరనవచ్చు. సరే, బైబిలు ఇలాంటి పరిస్థితుల్లోనే వ్రాయబడింది. అయిననూ అది దాని ప్రధాన తలంపులందే కాకుండ అతిచిన్న విషయాల్లో సహితం సంపూర్ణ పొందికను కలిగివుంది.

24 బైబిల్లోని 66 పుస్తకాల రచన సా.శ.పూ. 1513 లో ఆరంభించబడి సా.శ. 98 నాటికి అనగా 1,600 సంవత్సరాలకంటె ఎక్కువ కాలంలో 40 మంది విభిన్న రచయితలచే పూర్తిచేయబడింది. ఆ రచయితలు వివిధ సామాజిక స్థానాలు, వివిధ వృత్తులనుండి వచ్చినవారేగాక, ఒకరికొకరు సంబంధం లేనివారై యుండిరి. అయినను, అది ఒకేవ్యక్తి వ్రాసిన గ్రంథమన్నట్లు పొందికగల, ఒకే మూల ఇతివృత్తాన్ని కలిగియుంది. కొందరు నమ్మినట్లు దానిని పాశ్చాత్త నాగరికులు కాదుగాని తూర్పు దేశీయులే వ్రాశారు.

25. బైబిలు నిష్కాపట్యత, సరళత బైబిలు రచయితల ఏ మాటలను బలపరుస్తున్నవి?

25 ప్రాచీనకాల రచయితల్లో అత్యధికులు కేవలం తమ విజయాల్ని, సద్గుణాలను మాత్రమే పేర్కొనగా, బైబిలు రచయితలు మాత్రం తమ స్వంత తప్పిదాల్ని, ఆలాగే వారి రాజుల, నాయకుల వైఫల్యాలను బాహాటంగా ఒప్పుకున్నారు. మోషే వ్రాసిన పుస్తకాలగు సంఖ్యాకాండము 20:1-13, ద్వితీయోపదేశకాండము 32:50-52లలో ఆయన తన వైఫల్యాలను ప్రస్తావించాడు. యోనా వ్రాసిన వృత్తాంతమగు యోనా 1:1-3, 4:1 ఆయన వైఫల్యాల్ని తెల్పింది. మత్తయి 17:18-20; 18:1-6; 20:20-28; 26:56 నందలి నివేదిక యేసు శిష్యులు ప్రదర్శించిన బలహీన లక్షణాల్ని పేర్కొంది. ఆ విధంగా, బైబిలు రచయితల చిత్తశుద్ధి, నిష్కాపట్యము వారు దేవునిచే ప్రేరేపించబడ్డారని వారుచెప్పిన దానిని బలపరుస్తుంది.

దాని అత్యంత విశేషాంశము

26, 27. విజ్ఞానశాస్త్రం మరియు ఇతర విషయాల్లో బైబిలు ఎందుకంత ప్రామాణికంగా ఉంది?

26 విజ్ఞాన విషయాలందు, చరిత్రయందు, మరితర విషయాల్లో అదెందుకంత అనుగుణ్యతను, పొందికను కలిగియున్నదో బైబిలే వెల్లడిచేస్తున్నది. సర్వోన్నత ప్రాణియు, సర్వశక్తిగల దేవుడు, ఈ విశ్వసృష్టికే కారకుడైనవాడు బైబిలు గ్రంథకర్తయని అది చూపిస్తున్నది. ఆయన మానవులను కేవలము తన లేఖికులుగా ఉపయోగించుకొని, తానుద్దేశించిన సంగతులు వ్రాయడానికి తన బలమైన చురుకైన శక్తిని వారిపైనుంచి వారిని ప్రేరేపించాడు.

27 బైబిలునందు అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” అపొస్తలుడైన పౌలు ఇంకనూ యిలాచెప్పాడు: “మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి.”—2 తిమోతి 3:16, 17; 1 థెస్సలొనీకయులు 2:13.

28. కాబట్టి, బైబిలు ఎక్కడనుండి వచ్చింది?

28 ఆ విధముగా, ఒకే గ్రంథకర్తయగు దేవునివలన బైబిలు వ్రాయబడింది. ఆయన మహా శక్తిసంపన్నుడు గనుక యథార్థముగా వ్రాయబడినది మనకాలము వరకు భద్రపరచబడునట్లు చేయుట ఆయనకు పెద్ద సంగతేమీ కాదు. దీనిని గూర్చి బైబిలు చేతివ్రాత ప్రతుల ప్రఖ్యాత అధికారియైన సర్‌ ఫ్రెడ్రిక్‌ కెన్యన్‌ 1940 లో యిలాచెప్పాడు: “మొదట వ్రాయబడిన రీతిగానే వాటి నిజస్థితియందు లేఖనములు మనకాలము వరకు వచ్చాయా అని ఏ విధముగానైనను సందేహించుటకు చివరి ఆధారము ఇప్పుడు తొలగించబడింది.”

29. సమాచారమందించు దేవుని సామర్థ్యాన్ని గూర్చి ఎలా ఉదహరించవచ్చు?

29 మానవులు భూమినుండి దూరంగా వేలాది కిలోమీటర్ల అంతరిక్షాన్నుండి, చంద్రున్నుండి రేడియో, టివి తరంగాలు పంపే సామర్థ్యం మానవులకుంది. అంతరిక్ష పరిశోధనా ఉపగ్రహాలు కోట్లాది కిలోమీటర్ల దూరానగల గ్రహాల సమాచారాన్ని, చిత్రాలను భూమికి పంపాయి. మానవుని సృష్టికర్త, రేడియో తరంగాల సృష్టికర్త నిశ్చయంగా దీనికంటె మరియెక్కువ చేయగలడు. బైబిలు వ్రాయడానికి తాను ఎంపికచేసుకున్న వారి మనస్సుకు మాటలను, చిత్రాలను ప్రసారం చేయడానికి తన సర్వశక్తిని ఉపయోగించుట ఆయనకు నిజంగా అతిస్వల్ప విషయము.

30. మానవులయెడల తన సంకల్పమేమిటో వారు తెలుసుకోవాలని దేవుడు ఇచ్ఛయిస్తున్నాడా?

30 అంతేకాకుండ, భూమిని, అందలి జీవరాసులను గూర్చిన అనేకసంగతులు దేవుడు మానవుల యెడల శ్రద్ధ కలిగివున్నాడని రుజువు చేస్తున్నవి. కాబట్టి, ఆయన తానెవరు, మానవులయెడల తన సంకల్పమేమిటనే విషయాలను స్పష్టంగా ఒక పుస్తకములో అనగా శాశ్వత పత్రములో వ్యక్తపర్చుట ద్వారా వారికాయన సహాయంచేయ నిష్టపడునని మనం అర్థంచేసుకోవచ్చు.

31. నోటిమాట ద్వారా అందించబడిన సమాచారంకంటె వ్రాయబడిన ప్రేరేపిత వర్తమానం ఎందుకు ఉన్నతమైనది?

31 ఆలాగే మానవుల నోటిమాట ద్వారా అందజేయబడిన వర్తమానానికి పోల్చి దేవుడు గ్రంథకర్తగావున్న పుస్తకపు ఉన్నతత్వాన్ని ఆలోచించండి. నోటిమాట నమ్మదగినదిగా ఉండదు, ప్రజలు ఆ వర్తమానాన్ని సంక్షిప్త పదాలుగా చేస్తారు, అలా కొంతకాలానికి దాని అర్థమే మారిపోతుంది. ఆపై వారు తమ స్వంత ఉద్దేశాల ప్రకారము ఆ వర్తమానాన్ని వివరిస్తారు. అయితే దైవ ప్రేరేపిత శాశ్వత లిఖితవాక్యంలో అటువంటి తప్పులు దొర్లడం బహుతక్కువే. అంతేకాకుండ, ఆ పుస్తకాన్ని మరలా ఉత్పత్తిచేయవచ్చు, వివిధ భాషల ప్రజలు ప్రయోజనం పొందునట్లు దానిని అనువదించనూవచ్చు. కాబట్టి మన సృష్టికర్త వర్తమానాన్ని అందజేయుటకు అటువంటి పద్ధతులు ఉపయోగించాడనుట సమంజసముగా లేదా? తాను చేసిందేనని సృష్టికర్త చెబుతున్నందున నిజముగా అది మరింత సహేతుకముగా ఉన్నది.

నెరవేరిన ప్రవచనము

32-34. మరే పుస్తకమందులేని ఏ విషయం బైబిలునందున్నది?

32 అదనంగా, దైవావేశంవల్ల కలిగినదనే ఒక ఉన్నతమైన అసాధారణ గుర్తును బైబిలు కలిగివుంది: ఏమాత్రం తప్పిపోకుండా నెరవేరిన ఇంకనూ నెరవేరుచున్న ప్రవచనాలుగల గ్రంథమైయుంది.

33 ఉదాహరణకు, ప్రాచీనకాల తూరుపట్టణ నాశనము, బబులోను పడిపోవడం, యెరూషలేము తిరిగి కట్టబడటం, మాదీయులు, పారశీకులు, గ్రీసు రాజులు ఏలికూలడం బైబిల్లో వివరంగా ప్రవచింపబడ్డాయి. ఆ ప్రవచనాలు ఎంత ప్రామాణికంగా ఉన్నాయంటే కొంతమంది విమర్శకులు ఆ వివరాలు సంఘటనలు జరిగిన తర్వాతే వ్రాయబడ్డాయని చెప్పడానికి విఫలయత్నం చేశారు.—యెషయా 13:17-19; 44:27–45:1; యెహెజ్కేలు 26:3-6; దానియేలు 8:1-7, 20-22.

34 సా.శ. 70 లో యెరూషలేమును గూర్చి యేసు చెప్పిన ప్రవచనాలు తు.చ. తప్పకుండా నెరవేరాయి. (లూకా 19:41-44; 21:20, 21) ఆలాగే “అంత్యదినములను” గూర్చి యేసు, అపొస్తలుడైన పౌలు చెప్పిన ప్రవచనాలు మన కాలంలో వివరంగా నెరవేరుతున్నాయి.—2 తిమోతి 3:1-5, 13; మత్తయి 24; మార్కు 13; లూకా 21.

35. బైబిలు ప్రవచనం కేవలం ఎందుకు సృష్టికర్తనుండే రాగలదు?

35 మానవ మేధస్సుకెంత ప్రజ్ఞ ఉన్ననూ, భవిష్యత్తు సంఘటనలను ఇంత కచ్చితంగా ప్రవచింపలేదు. మనం 2 పేతురు 1:20, 21 లో చదువుతున్నట్లు కేవలం సర్వశక్తి, సర్వజ్ఞాన మేధస్సుగల విశ్వసృష్టికర్త మాత్రమే అలా చెప్పగలడు: “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”

అది జవాబిస్తుంది

36. బైబిలు మనకేమి చెబుతున్నది?

36 కాబట్టి, బైబిలు సర్వోన్నతుని ద్వారా ప్రేరేపించబడినదనే అనేకవిధములైన రుజువును కల్గివున్నది. అందువలన, మానవులు ఈ భూమ్మీద ఎందుకున్నారు, ఎందుకింత బాధవున్నది, మనమెక్కడికి వెళ్తున్నాము, పరిస్థితులెలా మంచిగా మారుననే విషయాల్ని గూర్చి అది మనకు తెలియజేస్తుంది. మానవులను, ఈ భూమిని ఒక సంకల్పంతో సృష్టించిన సర్వోన్నత దేవుడున్నాడని, ఆయన సంకల్పం తప్పక నెరవేరునని అది మనకు వెల్లడిచేస్తున్నది. (యెషయా 14:24) ఆలాగే నిజమైన మతమంటే ఏమిటో, దానిని మనమెలా తెలుసుకోగలమో కూడా బైబిలు మనకు వెల్లడిచేస్తున్నది. అలా అది మన జీవితాన్ని గూర్చిన అన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలను గూర్చిన సత్యాన్ని చెప్పగల ఏకైక ఉన్నత జ్ఞాన మూలమైయుంది.—కీర్తన 146:3; సామెతలు 3:5; యెషయా 2:2-4.

37. క్రైస్తవమత సామ్రాజ్యాన్ని గూర్చి ఏమి అడగాలి?

37 బైబిలు వాస్తవికతకు, సత్యత్వానికి సమృద్ధిగా రుజువున్ననూ, దానిని తాము అంగీకరిస్తున్నామని చెప్పుకొను వారందరు దాని బోధలననుసరిస్తున్నారా? ఉదాహరణకు, క్రైస్తవత్వాన్ని అభ్యసిస్తున్నామని చెప్పుకొను జనాంగములు అనగా క్రైస్తవమత సామ్రాజ్యాన్ని గూర్చి ఆలోచించండి. వారనేక శతాబ్దాలనుండి తమయొద్ద బైబిలును కలిగియున్నారు. అయితే వారి ఆలోచనా సరళి, క్రియలు నిజంగా దేవుని ఉన్నత జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నవా?

[అధ్యయన ప్రశ్నలు]

[11 వ పేజీలోని చిత్రం]

గురుత్వాకర్షణ శక్తి మూలంగా భూమి ఇతర గ్రహాలతో కలిసి శూన్యంలో నిలిచివుందని సర్‌ ఐజక్‌ న్యూటన్‌ నమ్మాడు

భూమి శూన్యంలో ఉందని బైబిలుచెప్పే విషయం ఆ కాలంలో చెప్పబడిన అసాధారణ విషయమని విద్వాంసులు గుర్తించారు

[12 వ పేజీలోని చిత్రం]

తొలి నావికులు కొందరు తాము బల్లపరుపుగానున్న భూమి అంచునుండి దొర్లిపడిపోతామని కూడ భయపడ్డారు

[13 వ పేజీలోని చిత్రం]

జూలియస్‌ సీజర్‌, షార్లిమాన్‌ చక్రవర్తి, ఆలివర్‌ క్రోమ్‌వెల్‌, లేదా పోప్‌ లియో III జీవించారని చెప్పుటకంటె యేసుక్రీస్తు ఉనికిలో ఉండెననడానికి ఎక్కువ సాక్ష్యముంది

[15 వ పేజీలోని చిత్రం]

సా.శ. 70 లో యెరూషలేమును గూర్చి యేసుచెప్పిన ప్రవచనాల నెరవేర్పు రోమ్‌నందలి టైటస్‌ కమానుచే ధృవపర్చబడింది