క్రైస్తవమత సామ్రాజ్యం దేవున్ని, బైబిలును మోసగించింది
అధ్యాయం 4
క్రైస్తవమత సామ్రాజ్యం దేవున్ని, బైబిలును మోసగించింది
1, 2. కొందరికి బైబిలుయెడల గౌరవమెందుకు లేదు, అయితే బైబిలేమి చెబుతున్నది?
1 బైబిలు ననుసరిస్తున్నామని చెప్పుకునే వారి ప్రవర్తన చెడ్డగా ఉన్నందున అనేక దేశాల్లోని ప్రజలు బైబిలును నిరాకరిస్తూ దానియెడల గౌరవం కోల్పోయారు. బైబిలు యుద్ధానికి నడిపే పుస్తకమని, శ్వేతజాతీయుల పుస్తకమని, వలసవిధానాన్ని ప్రోత్సహించే పుస్తకమని కొన్నిదేశాల్లో అనుకుంటున్నారు. అయితే అవి తప్పుడు అభిప్రాయాలే.
2 మధ్య ప్రాచ్యమందు వ్రాయబడిన బైబిలు, వలస యుద్ధాలను, ఇంతకాలం క్రైస్తవత్వం పేరిట జరిగింపబడిన దురాశతోకూడిన వంచనను బలపర్చదు. దానికి భిన్నంగా, బైబిలును చదివి, దానిలో యేసు బోధించిన నిజ క్రైస్తవ బోధలను నేర్చుకొనుట ద్వారా నీవు యుద్ధాలను, లైంగిక అవినీతిని, ఇతరులను మోసగించడాన్ని బైబిలు గట్టిగా ఖండిస్తుందని గ్రహిస్తావు. దోషం దురాశపరుల్లోవుంది గాని బైబిల్లో లేదు. (1 కొరింథీయులు 13:1-6; యాకోబు 4:1-3; 5:1-6; 1 యోహాను 4:7, 8) కాబట్టి చక్కని బైబిలు సలహాకు విరుద్ధంగా జీవించు స్వార్థపరుల దుష్ప్రవర్తన దాని ధననిధి నుండి ప్రయోజనం పొందకుండా నిన్ను ఆటంకపర్చనీయవద్దు.
3. క్రైస్తవమత సామ్రాజ్యాన్ని గూర్చి చారిత్రక వాస్తవాలు ఏమి చూపిస్తున్నాయి?
3 బైబిలు సలహాను పాటించని వారిలో క్రైస్తవమత సామ్రాజ్యమందలి ప్రజలు, జనాంగములు చేరియున్నారు. ప్రపంచంలో ఎక్కడైతే క్రైస్తవత్వముందో ఆ భాగం “క్రైస్తవమత సామ్రాజ్యం” అని నిర్వచింపబడింది. ఇది దాదాపు సా.శ. నాల్గవ శతాబ్దం నుండి ప్రముఖమైన చర్చివిధానాలు
ఎక్కువగానున్న పాశ్చాత్త ప్రపంచమైయుంది. అనేక శతాబ్దాల నుండి క్రైస్తవమత సామ్రాజ్యంలో బైబిలుంది, పైగా దాని మతనాయకులు తాము దేవుని ప్రతినిధులుగా దానిని బోధిస్తున్నామని చెప్పుకొనిరి. అయితే క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు, మిషనరీలు సత్యం బోధిస్తున్నారా? వారి క్రియలు నిజంగా దేవున్ని, బైబిలును సూచిస్తున్నవా? క్రైస్తవమత సామ్రాజ్యంలో అసలు క్రైస్తవత్వం ఉందా? లేదు. నాల్గవ శతాబ్దంలో అది ప్రాచుర్యంలోనికి వచ్చినప్పటినుండి, క్రైస్తవమత సామ్రాజ్యం దేవునికి, బైబిలుకు విరోధియని నిరూపించుకుంది. అవును, చరిత్రలోని వాస్తవాలు క్రైస్తవమత సామ్రాజ్యం దేవున్ని, బైబిలును మోసగించిందని చూపిస్తున్నవి.బైబిలు విరుద్ధ సిద్ధాంతాలు
4, 5. చర్చీలు ఎటువంటి బైబిలు విరుద్ధ సిద్ధాంతాలను బోధిస్తున్నాయి?
4 క్రైస్తవమత సామ్రాజ్య మూల సిద్ధాంతాలు బైబిలు మీద కాదుగాని గ్రీసు, ఐగుప్తు, బబులోను, ఇంకాయితర ప్రాచీన పుక్కిటి పురాణాలపై ఆధారపడియున్నవి. మానవునికి అమర్త్యమైన ఆత్మ ఉందని, నరకాగ్నిలో నిత్యయాతన, పాపవిమోచన స్థానం, త్రిత్వము (ఒకే దేవునిలో ముగ్గురు దేవుళ్లు) వంటి బోధలు బైబిలునందు లేవు.
5 ఉదాహరణకు, చెడు ప్రజలు నరకాగ్నిలో నిత్యము బాధింపబడతారనే బోధను తలంచండి. ఈ తలంపును గూర్చి మీరేమని భావిస్తున్నారు? అనేకమంది దానిని ప్రతికూల భావంతో చూస్తున్నారు. మానవులను మిక్కిలి బాధకు గురిచేయుచు దేవుడు వారిని నిత్యము బాధిస్తాడనుట సమంజసముగా ఉన్నట్లు వారు భావించడం లేదు. “దేవుడు ప్రేమాస్వరూపి” గనుక అటువంటి కౄర ఆలోచన బైబిలు దేవునికి విరుద్ధమై యుంది. (1 యోహాను 4:8) అటువంటి బోధ సర్వశక్తిగల దేవుని ‘హృదయానికి తోచలేదని’ బైబిలు స్పష్టం చేస్తున్నది.—యిర్మీయా 7:31; 19:5; 32:35.
6. అమర్త్యమైన ఆత్మను గూర్చిన బోధను బైబిలెట్లు త్రోసిపుచ్చుతున్నది?
6 క్రైస్తవమత సామ్రాజ్యమందలి చర్చీలతో సహా ఈనాడు అనేక మతాలు మానవులకు అమర్త్యమైన ఆత్మ ఉన్నదని మరణమప్పుడు అది పరలోకానికి లేదా నరకానికి వెళ్తుందని బోధిస్తాయి. ఇది బైబిలు బోధకాదు. అయితే బైబిలు స్పష్టముగా ఇట్లు తెలియజేస్తుంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . నీవు పోవు పాతాళమునందు [సమాధిలో] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 10) మరణమైనప్పుడు మానవులు “మంటిపాలగుదురు; వారి సంకల్పములు నాడే నశించునని” కీర్తనల రచయిత చెబుతున్నాడు.—కీర్తన 146:4.
7. దేవుని నియమాన్ని ఉల్లంఘించినందుకు ఆదాము హవ్వలు ఏ శిక్ష ననుభవించారు?
7 ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు, వారికి అమర్త్యత శిక్షగా ఇవ్వబడలేదని జ్ఞాపకం తెచ్చుకోండి. అది శిక్షగా కాకుండ ఒక బహుమతిగా ఉండేది. బదులుగా వారు ‘నేలకు తిరిగెదరు, ఎందుకంటె వారు నేలనుండి తీయబడిరని’ దేవుడు వారికి చెప్పాడు. ఆదికాండము 3:19) ఆ విధంగా మానవునికొక అమర్త్యమైన ఆత్మవుందనే బోధ బైబిలు బోధ కాదుగాని, క్రైస్తవమత సామ్రాజ్యం దానిని అంతకంటె ముందు జీవించిన క్రైస్తవేతర ప్రజలనుండి తీసుకుంది.
దేవుడు ఆదాముకు యిలా నొక్కిచెప్పాడు: “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (8. క్రైస్తవమత సామ్రాజ్య త్రిత్వ బోధను బైబిలెట్లు త్రోసిపుచ్చుతున్నది?
8 అంతేకాకుండ, క్రైస్తవమత సామ్రాజ్య త్రిత్వ సిద్ధాంతం దేవున్ని మర్మంతోకూడిన ఒక్కనిలోనే ముగ్గురు దేవుళ్లగా చిత్రీకరించింది. అయితే ఇదికూడ బైబిలునందు లేని బోధయే. ఉదాహరణకు, యెషయా 40:25, దేవుని గూర్చి స్పష్టంగా యిలా చెబుతున్నది: “నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటిచేయుదురు?” దానికి జవాబు స్పష్టమే: ఆయనకెవరూ సాటిరారు. కీర్తన 83:18 కూడ ఇట్లనుచున్నది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.”—యెషయా 45:5; 46:9; యోహాను 5:19; 6:38; 7:16 కూడ చూడండి.
9. బైబిలు బోధను గూర్చి, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల బోధను గూర్చి మనమేమి చెప్పగలము?
9 దేవుని గూర్చి, ఆయన సంకల్పాన్ని గూర్చిన బైబిలు బోధలు స్పష్టం, సహేతుకం పైగా సులభంగా అర్థంచేసుకోవచ్చు. అయితే క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల బోధలు అలాలేవు. అంతకంటే నీచమేమంటే అవి బైబిలుకు విరుద్ధము.
భక్తిహీన క్రియలు
10, 11. క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు చేస్తున్న క్రియలకు భిన్నంగా బైబిలు బోధలు ఏయే విషయాలను కోరుచున్నవి?
10 అబద్ధ సిద్ధాంతాలను బోధించుటకు తోడుగా, క్రైస్తవమత సామ్రాజ్యం తన క్రియల ద్వారా దేవున్ని, బైబిలును మోసగించింది. గడచిన శతాబ్దాల్లో మతనాయకులు, చర్చీలు జరిగించినదే మన కాలంలోకూడా కొనసాగుతుంది. అది, దేవుడు బైబిలు కోరు విషయాలకు, క్రైస్తవత్వ స్థాపకుడైన యేసుక్రీస్తు బోధించిన దానికి, చేసిన దానికి విరుద్ధమైయుంది.
11 ఉదాహరణకు, ఈ లోక రాజకీయ వ్యవహారాల్లో లేదా దాని యుద్ధాల్లో తలదూర్చవద్దని యేసు తన శిష్యులకు బోధించాడు. సమాధానాన్ని ప్రేమించేవారిగా, చట్టాలకు లోబడేవారిగా, ఎలాంటి దురభిమానం లేకుండా తోటి మానవుల్ని ప్రేమించేవారిగా, ఇతరుల ప్రాణాలు తీయుటకు బదులు తమ ప్రాణాలు సహితం త్యాగం చేయుటకు ఇష్టపడువారిగా ఉండాలని కూడ ఆయన వారికి బోధించాడు.—యోహాను 15:13; అపొస్తలుల కార్యములు 10:34, 35; 1 యోహాను 4:20, 21.
12. నిజ క్రైస్తవులను ఏది గుర్తిస్తుందని యేసు చెప్పాడు?
12 నిజానికి, ఇతర మానవులయెడల కనబరచే ప్రేమ నామకార్థ అబద్ధ క్రైస్తవులనుండి నిజ క్రైస్తవులను గుర్తిస్తుందని యేసు బోధించాడు. తనను అనుసరించే వారికి ఆయనిలా చెప్పాడు: “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”—యోహాను 13:34, 35; 15:12.
13, 14. క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు దేవునికి ప్రాతినిధ్యంగా లేవని ఏది చూపిస్తున్నది?
13 అయినను, శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు రాజకీయాల్లో తలదూర్చి వారివారి దేశముల యుద్ధాలను బలపర్చారు. ఈ శతాబ్దంలో జరిగిన 1 యోహాను 3:10-12, 15) ఆ విధంగా మతనాయకులు, వారి అనుచరులు తాము క్రైస్తవులమని చెప్పుకొన్నను, ‘కత్తి ప్రక్కనబెట్టుమని’ తన అనుచరులకు చెప్పిన యేసుక్రీస్తు బోధలకు విరుద్ధముగా ప్రవర్తించారు.—మత్తయి 26:51, 52.
రెండు ప్రపంచ యుద్ధాల్లో వలెనే క్రైస్తవమత సామ్రాజ్యంలో జరిగిన యుద్ధాల్లో పరస్పర వ్యతిరేక పక్షాలకు వారు మద్దతునిచ్చారు. ఆ పోరాటాల్లో ఇరువైపులనున్న మతనాయకులు విజయం కొరకు ప్రార్థించారు, ఒక దేశంలోని మతస్థులు వేరొక దేశానికి చెందిన అదే మతస్థులను హతమార్చారు. సాతాను పిల్లలుతప్ప, దేవుని పిల్లలు అలా ప్రవర్తించరని బైబిలు చెబుతున్నది. (14 ఆయాదేశాలు విజయం సాధించి ఏకఛత్రాధిపత్య కాలమందు ఇతర ప్రజలను బానిసలుచేసి అణగద్రొక్కినప్పుడు శతాబ్దాలుగా చర్చీలు క్రైస్తవమత సామ్రాజ్య రాజకీయ శక్తులతో చేతులు కలిపాయి. ఆఫ్రికాలో శతాబ్దాలపాటు అలా జరిగింది. నల్లమందు యుద్ధాలు, బాక్సర్ తిరుగుబాటు కాలంలోవలె పశ్చిమ దేశాలు బలప్రయోగం ద్వారా తమ ప్రాబల్యాన్ని తీసుకొచ్చినప్పుడు చైనాలోకూడ ఇది సంభవించింది.
15. క్రైస్తవమత సామ్రాజ్యం ఎలాంటి దురాగతాలకు పాల్పడింది?
15 డార్క్ ఏజెస్ అని పిలవబడిన ఆ శతాబ్దాల కాలంలో తమతో విభేదించిన ప్రజలను హింసించుట, చిత్రవధచేయుట, చివరకు హతమార్చుటలో కూడ క్రైస్తవమత సామ్రాజ్య మతాలు ముందున్నాయి. నాలుగువందల సంవత్సరాలపాటు సాగిన మతవిచారణా కాలంలో మర్యాదస్థులైన, అమాయక ప్రజలపై హింస, హత్యవంటి దురాగతాలు అధికారికంగా జరిగించబడ్డాయి. తాము క్రైస్తవులమని చెప్పుకొనిన మతనాయకులు, వారి అనుచరులే అట్టి దుశ్చర్యలకు పాల్పడ్డారు. సామాన్య ప్రజలు చదవడానికి వీల్లేకుండా బైబిలును పూర్తిగా నిర్మూలించాలని కూడా వారు ప్రయత్నించారు.
క్రైస్తవులు కారు
16, 17. చర్చీలు క్రైస్తవ సంబంధమైనవి కావని మనమెందుకు చెప్పగలము?
16 క్రైస్తవమత సామ్రాజ్య దేశాలు, చర్చీలు క్రైస్తవమత సంబంధమైనవి కావు. వారు దేవుని సేవకులు కారు. వారిని గూర్చి ఆయన ప్రేరేపిత వాక్యమిలా చెబుతున్నది: “దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.”—తీతు 1:16.
17 అబద్ధ మతము దాని క్రియలు, ఫలాలవలన గుర్తింపబడునని యేసు చెప్పాడు. ఆయనిట్లన్నాడు: “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. . . . ప్రతి మంచిచెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచిచెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని [అబద్ధ ప్రవక్తలను] తెలిసికొందురు.”—మత్తయి 7:15-20.
18. క్రైస్తవమత సామ్రాజ్య బోధలు, క్రియలయొక్క ఫలితమేమి?
18 ఆ విధంగా, బైబిలును నమ్ముతున్నామని, తమకు దైవభయం ఉందని, తాము క్రైస్తవులమని చెప్పుకోవడం ఒక అబద్ధమని క్రైస్తవమత సామ్రాజ్య మతాల బోధలు, క్రియలు చూపినవి. అవి దేవున్ని, బైబిలును మోసగించినవి. అలాచేయుట ద్వారా వారు లక్షలాదిమంది ప్రజలకు అసహ్యం కలిగించి, సర్వోన్నతుని యందలి వారి నమ్మకాన్ని పోగొట్టుకొనేటట్లు చేశాయి.
19. క్రైస్తవమత సామ్రాజ్య విఫలత అంటే దేవుడు, బైబిలు విఫలులయ్యారని భావమా?
19 అయితే, క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు, చర్చీలు, క్రైస్తవమత సామ్రాజ్యేతర మతాలు విఫలం కావడమంటే బైబిలు విఫలం కావడమని అర్థం కాదు. లేదా దేవుడు విఫలుడయ్యాడని అర్థం కాదు. బదులుగా, సర్వోన్నతుడు ఉన్నాడని, ఆయన మనయెడల మన భవిష్యత్తు యెడల శ్రద్ధకలిగివున్నాడని బైబిలు చెబుతోంది. సరియైనది చేయాలని, భూవ్యాప్తంగా న్యాయం, శాంతి విలసిల్లాలని కోరుకొనే యథార్థవంతులను ఆయన తప్పక దీవిస్తాడని అది చూపిస్తున్నది. దుష్టత్వాన్ని, బాధను దేవుడు ఎందుకు అనుమతించాడో, తమ పొరుగువారికి హాని తలపెట్టు వారిని ఆలాగే తనను సేవిస్తున్నామని చెప్పుకొనుచు అలాచేయని వారిని ఈ భూమ్మీదినుండి ఆయనెట్లు తొలగిస్తాడో అది చూపిస్తున్నది.
[అధ్యయన ప్రశ్నలు]
[17 వ పేజీలోని చిత్రం]
డాంటె చిత్రీకరించిన “ఇన్‌ఫెర్నో”
క్రైస్తవమత సామ్రాజ్య త్రిత్వము
[Credit Line]
Doré’s illustration of Barrators—Giampolo for Dante’s Divine Comedy
హిందూమత త్రిత్వము
[Credit Line]
Courtesy of The British Museum
ఐగుప్తీయుల త్రిత్వము
[Credit Line]
Museo Egizio, Turin
[18 వ పేజీలోని చిత్రం]
యేసు బోధలకు విరుద్ధంగా ఇరుపక్షాల మతనాయకులు యుద్ధాలను బలపర్చారు
[Credit Line]
U.S. Army photo