కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితానికొక సంకల్పమున్నదా?

జీవితానికొక సంకల్పమున్నదా?

అధ్యాయం 1

జీవితానికొక సంకల్పమున్నదా?

1. జీవిత సంకల్పాన్ని గూర్చి తరచు ఏమని అడుగుచున్నారు, ఒక వ్యక్తి దీన్నిగూర్చి ఏమని వ్యాఖ్యానించాడు?

ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారు జీవిత సంకల్పమేమిటాని ఆలోచిస్తూవుంటారు. అది మన జీవన పరిస్థితుల్ని మెరుగు పర్చుకొనేందుకు కష్టపడి పనిచేయడం, మన కుటుంబాల్ని పోషించుకొనడం, 70 లేదా 80 సంవత్సరాల తర్వాత చనిపోయి ఆ తర్వాత శాశ్వతంగా ఉనికిలో లేకుండా పోవడమేనా? ఇదే విధంగా భావించిన ఒక యువకుడు “జీవిస్తూ, పిల్లల్ని కని, సంతోషంగా ఉండడం” మినహా జీవితానికి మరో సంకల్పం లేదని చెప్పాడు. అయితే అది నిజమా? మరణమే ఇక అన్నిటి అంతమా?

2, 3. వస్తు సంపత్తిని సమకూర్చుటే ఎందుకు జీవిత సంకల్పం కాదు?

2 ప్రాచ్య, పాశ్చాత్త దేశాల్లోని అనేకులు వస్తు సంపత్తిని సంపాదించడమే జీవితపు ముఖ్య ధ్యేయమని భావిస్తున్నారు. ఇది సంతోషభరితమైన, అర్థవంతమైన జీవితానికి నడిపిస్తుందని వారి నమ్మకం. అయితే ఇప్పటికే ధనవంతులుగానున్న ప్రజల విషయమేమి? కెనడా దేశపు రచయితయగు హారి బ్రూస్‌ యిలాచెప్పాడు: “గొప్ప సంఖ్యలో ధనవంతులు తాము సంతోషంగా లేమని గట్టిగా చెబుతున్నారు.” ఆయనింకా ఇట్లన్నాడు: “తీవ్రమైన వ్యాకులతా భావం ఉత్తర అమెరికాలో ప్రబలిందని అభిప్రాయ సేకరణలు సూచిస్తున్నాయి . . . ఈ లోకంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అలా ఉంటే, వారి సంతోషానికి కీలకమేమిటి?”

3 అమెరికా మాజీ అధ్యక్షుడైన జిమ్మి కార్టర్‌ యిలాచెప్పాడు: “వస్తు సంపత్తిని కలిగివుండి వాటిననుభవించడం, అర్థాన్ని అన్వేషించే మన కోరికను తృప్తిపర్చదు. . . . వస్తుసంపత్తిని సమకూర్చడం నమ్మకం లేదా సంకల్పంలేని జీవితాల నిర్వేదాన్ని పూరించలేవు.” మరో రాజకీయ నాయకుడు యిలా అన్నాడు: “ఇప్పటికి నేననేక సంవత్సరాల నుండి నన్నుగూర్చి, నా జీవితాన్ని గూర్చిన సత్యాలను తీవ్రంగా అన్వేషిస్తున్నాను; అనేకమంది ఇదేవిధంగా చేస్తున్నారనీ నాకు తెలుసు. క్రితమెన్నటికంటే ఎక్కువగా ప్రజలు యిలా అడుగుతున్నారు, ‘మనమెవరము? మన సంకల్పమేమిటి?’”

మరింత జటిలమైన సమస్యలు

4. జీవితానికి సంకల్పమంటూ వుందా అని అనేకులు ఎందుకు సందేహిస్తున్నారు?

4 జీవన పరిస్థితులు మరింత కష్టతరంగా మారడం చూసినప్పుడు అనేకులు జీవితానికొక సంకల్పమున్నదనే విషయాన్ని సందేహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఒక అరబ్‌ [నూరు కోట్లమంది] ప్రజలు తీవ్రరోగాలతో, కుపోషణతో బాధపడుతున్నారు, దీని ఫలితంగా ఒక్క ఆఫ్రికాలోనే ప్రతియేటా ఒక కోటిమంది పిల్లలు మరణిస్తున్నారు. దాదాపు 6 అరబ్‌లకు [600 కోట్లకు] చేరిన ప్రపంచ జనాబా ప్రతియేటా 9 కోట్ల చొప్పున అంతకంతకు పెరుగుతున్నది, దీనిలో 90 కంటే ఎక్కువశాతం వర్థమాన దేశాల్లోనే జరుగుతుంది. ఇలా స్థిరంగా జనాబా పెరగడం ఆహారం గృహవసతి, పరిశ్రమల అవసరతను పెంచుతుంది, వీటి మూలంగాను పరిశ్రమలు ఇతర కాలుష్య కారణాల వల్లను నేలకు, నీటికి, గాలికి మరింత నష్టం వాటిల్లుతోంది.

5. ఈ భూమ్మీది వృక్షసంపదకు ఏమి సంభవిస్తుంది?

5వరల్డ్‌ మిలటరీ అండ్‌ సోషల్‌ ఎక్స్‌పెండిచర్స్‌ 1991 అనే సాహిత్యం యిలా రిపోర్టు చేస్తుంది: “ప్రతి సంవత్సరం [గ్రేట్‌ బ్రిటన్‌కు] సమానమైన ప్రదేశంలో అడవులు నాశనం చేయబడుతున్నాయి. ఈ పద్ధతి (యిలా అడవుల్ని నరకడం) కొనసాగితే 2,000 సంవత్సరం నాటికి వాతావరణంలో అధిక తేమగల ఉష్ణమండల ప్రాంతాల్లో 65 శాతం అడవులు నిర్మూలమౌవుతాయి.” ఐక్యరాజ్య సమితి ప్రతినిధి వర్గం తెల్పిన ప్రకారం ఆ ప్రాంతాల్లో నాటిన ఒక చెట్టుకు పదిచెట్ల చొప్పున నరకబడుతున్నాయి; ఆఫ్రికాలో ఈ నిష్పత్తి మరియెక్కువగా అంటే ఒకటికి ఇరవై చొప్పునవుంది. తత్ఫలితంగా ప్రతియేటా ఎడారులు విస్తరిస్తున్నాయి, అంటే బెల్జియమంత పరిమాణంలో వ్యవసాయ క్షేత్రాలు పనికిరాకుండా పోతున్నాయి.

6, 7. మానవ నాయకులు పరిష్కరించలేని సమస్యలు కొన్నిఏవి, కాబట్టి ఏ ప్రశ్నలకు జవాబులు అవసరం?

6 అంతేకాకుండ, గడచిన నాలుగు శతాబ్దాల్లో జరిగిన యుద్ధాల్లో చనిపోయిన మొత్తం సంఖ్యకంటె ఈ 20 వ శతాబ్ద యుద్ధాల్లో మరణించిన వారి సంఖ్య నాలుగురెట్లు ఎక్కువున్నది. ప్రతిచోట నేరాలు, ప్రాముఖ్యంగా హింసతోకూడిన నేరాలు పెరిగిపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమగుట, మాదక ద్రవ్యాల దుర్వినియోగము, ఎయిడ్స్‌, సుఖరోగాలు, ఇతర ప్రతికూల సంగతులు కూడ జీవితాన్ని దుర్బరం చేస్తున్నాయి. మానవుల్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు ప్రపంచ నాయకులు పరిష్కారం చూపలేకపోతున్నారు. కాబట్టి, జీవిత సంకల్పమేమిటి? అని ప్రజలు ఎందుకు అడుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

7 ఆ ప్రశ్నను విద్వాంసులు, మతనాయకులు ఎలా సంబోధిస్తున్నారు? చివరకు ఇన్ని శతాబ్దాల తర్వాతయినా వారు సంతృప్తికరమైన జవాబునిస్తున్నారా?

వారేమి చెబుతున్నారు

8, 9. (ఎ) జీవిత సంకల్పాన్ని గూర్చి చైనాదేశపు విద్వాంసుడేమి చెప్పాడు? (బి) నాజీ డెత్‌ క్యాంపునుండి బ్రతికి బయటపడ్డ ఒకవ్యక్తి ఏమిచెప్పాడు?

8 కన్‌ఫ్యూషన్‌ విద్వాంసుడై టు వామిన్‌ యిలాచెప్పాడు: “జీవిత పరమార్థాన్ని మన సాధారణ, మానవ ఉనికిలోనే కనుక్కోవచ్చును.” ఈ అభిప్రాయం ప్రకారం మానవులు ఎడతెగక జన్మిస్తూ, ఉనికి కొరకు పోరాడుతూ, చనిపోతారు. అటువంటి దృక్కోణమందు నిరీక్షణ ఏమాత్రం లేదు. ఇంతకూ అది నిజమేనా?

9 రెండవ ప్రపంచ యుద్ధమందు నాజీ డెత్‌ క్యాంపులనుండి బ్రతికి బయటపడ్డ ఎలీ వీసెల్‌ యిలా అభిప్రాయపడ్డాడు: “‘మనమెందుకు ఇక్కడున్నాము?’ అనేది మానవుడు ఎదుర్కోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న. . . . అర్థంలేని మరణాల్ని నేనెన్నో చూశాను అయినా జీవితానికొక అర్థముందని నా నమ్మకం.” అయితే జీవితానికున్న ఆ అర్థమేమిటో ఆయన చెప్పలేకపోయాడు.

10, 11. (ఎ) మానవుని దగ్గర సమాధానం లేదని ఒక సంపాదకుడు ఎలా చూపాడు? (బి) ఒక పరిణామవాద శాస్త్రవేత్త దృక్కోణం ఎందుకు సంతృప్తికరంగా లేదు?

10 సంపాదకుడైన వర్‌మాంట్‌ రోయిస్టర్‌ యిలాచెప్పాడు: “మానవుని గూర్చి, ఈ విశ్వంలో అతని ఉనికిని గూర్చిన ఆలోచనందు మనం కాలారంభం నుండి కేవలం కొద్దిగా మాత్రమే ముందుకు వెళ్లాము. అయిననూ మనమెవరము, మనమెందుకున్నాము, మనమెక్కడికి వెళ్తున్నాము అనే ప్రశ్నల్ని మనమింకా ఎదుర్కొంటూనే ఉన్నాము.”

11 పరిణామసిద్ధాంత శాస్త్రవేత్తయైన స్టీఫెన్‌ జె గౌల్డ్‌ యిలా వ్రాశాడు: “మనం ‘ఉన్నత’ జవాబును ఆశించవచ్చు—అయితే అట్టి జవాబే లేదు.” అటువంటి పరిణామవాదులు జీవితమంటే బ్రతికివుండడానికి సాగించే పోరాటమని, మరణంతో అది ముగిసిపోతుందని అంటారు. ఈ దృక్కోణమందు కూడా నిరీక్షణ లేదు. మరది సత్యమేనా?

12, 13. చర్చి నాయకుల దృక్పథాలేమై యున్నవి, అవి లోక ప్రముఖుల దృక్పథాలకంటె ఏమైనా ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నాయా?

12 మంచి జీవితాన్ని గడిపితే మరణించినప్పుడు ఆ వ్యక్తి ఆత్మ పరలోకానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా ఉండగలదని, అదే జీవిత సంకల్పమని అనేకమంది మత నాయకులు చెప్తారు. ఇక చెడ్డవారైతే నరకాగ్నిలో నిత్యమూ బాధింపబడతారనే ప్రత్యామ్నాయాన్ని చూపుతున్నారు. అయినను, ఈ నమ్మకం ప్రకారం, ఈ భూమ్మీద చరిత్రంతటిలో ఉన్నట్లే అసంతృప్తికర జీవితం ఎల్లకాలం కొనసాగుతుంది. అయితే ప్రజలు దేవదూతలవలె పరలోకంలో జీవించాలనేది దేవుని సంకల్పమైతే, ఆయన మొదటే వారినెందుకు అలా దేవదూతలవలె సృష్టించలేదు?

13 అటువంటి దృక్పథాలు కల్గివుండుట మతనాయకులకు సహితం కష్టమే. లండన్‌లో సెయింట్‌ పౌల్స్‌ కెథడ్రిల్‌నందు మాజీ డీకన్‌ అయిన డాక్టర్‌ డబ్ల్యు. ఆర్‌. ఇన్‌జె ఒకసారి యిలా అన్నాడు: “జీవిత సంకల్పాన్ని తెలుసుకుందామని నేను నా జీవితమంతా పోరాడాను. మూల విషయాలని నేను ఎల్లప్పుడు తలంచిన మూడు సమస్యలు, అనగా నిత్యత్వం; మానవ వ్యక్తిత్వం; దుష్టత్వం అనువాటి జవాబుల కొరకు ప్రయత్నించాను. కాని ఫలించలేదు. వీటిలో నేను దేన్నీ పరిష్కరించలేకపోయాను.”

ఫలితం

14, 15. విభిన్న దృక్కోణాలు అనేకమంది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపాయి?

14 జీవిత సంకల్పమేమిటనే ప్రశ్నకు విద్వాంసులు, మతనాయకులిస్తున్న అనేక విభిన్న తలంపుల ఫలితమేమి? “జీవితంలో అధికభాగం నేనెందుకు ఇక్కడున్నాననీ, దానికో సంకల్పమంటూవుంటే, నేను దానిని పట్టించుకోను” అని ఒక పెద్దమనిషి అన్నట్లే అనేకమంది ప్రతిస్పందిస్తున్నారు.

15 లోక మతాల్లో విస్తారంగావున్న దృక్పథాల్ని గమనించిన అనేకమంది, ఓవ్యక్తి ఏది నమ్మినా ఒకటే అనే నిర్ణయానికొచ్చారు. మతమనేది కేవలం మనస్సును మభ్యపెట్టి, జీవిత సమస్యలను ఎదుర్కొనగల్గునట్లు కొంత నెమ్మదిని, ఓదార్పును ఇచ్చేది మాత్రమేనని వారు భావిస్తున్నారు. మరికొందరు మతమంటే మూఢనమ్మకం తప్ప మరేమీ కాదంటారు. జీవిత సంకల్పాన్ని గూర్చి శతాబ్దాలుగావున్న ప్రశ్నకు మతం జవాబివ్వలేదని, లేదా అది సామాన్య ప్రజల జీవన స్థితిని మెరుగుపర్చలేదని వారు భావిస్తారు. నిజమే, ఈ లోకమతాలు మానవజాతి అభివృద్ధిని నిరోధించి, ద్వేషాలకు యుద్ధాలకు కారణమైనవని చరిత్ర చూపిస్తోంది.

16. జీవిత సంకల్పం తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమై యుండగలదు?

16 అయిననూ, జీవిత సంకల్పాన్ని గూర్చిన సత్యాన్ని తెలుసుకోవడం అంత ప్రాముఖ్యమా? మానసిక ఆరోగ్య ప్రొఫెషనల్‌ విక్టర్‌ ఫ్రాంకెల్‌ దానికిలా జవాబిస్తున్నాడు: “జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి చేసే కృషి మానవునికి పురికొల్పునిచ్చే ప్రాథమిక శక్తియైయుంది. . . . అత్యంత క్లిష్ట పరిస్థితులను సహితం ఒకడు ఎదుర్కొనడానికి, జీవితానికో అర్థముందనే జ్ఞానమంత సమర్థవంతంగా సహాయం చేసేది ఈ లోకంలో మరొకటి లేదని నేను నిర్భయంగా చెప్పగలను.”

17. మనమే ప్రశ్నలు అడగాల్సిన అవసరత ఉంది?

17 జీవిత సంకల్పమేమిటో మానవ తత్వాలు, మతాలు సంతృప్తికరంగా వివరించనందున, అదేమిటో తెలుసుకోవడానికి మనమెక్కడికి వెళ్లగలము? ఈ విషయంలో మనకు సత్యం చెప్పగల సర్వోన్నత జ్ఞానానికి మూలమేదైనా కలదా?

ప్రత్యేకముగా సూచింపబడని లేఖనములు బైబిల్‌ సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి. లేఖనము ఎత్తి వ్రాయబడినచోట NW అనివుంటే, అది ఆంగ్ల భాషలోని న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలి స్క్రిప్చర్చ్‌—విత్‌ రెఫరెన్సెస్‌, 1984 సంచిక నుండి తర్జుమా చేయబడినదని సూచిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]

[4 వ పేజీలోని చిత్రం]

“ప్రతి సంవత్సరం [గ్రేట్‌ బ్రిటన్‌కు] సమానమైన ప్రదేశంలో అడవులు నాశనం చేయబడుతున్నాయి”

[5 వ పేజీలోని చిత్రం]

“జీవితంలో అధికభాగం నేనెందుకు ఇక్కడున్నాను”