కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది

దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది

అధ్యాయం 7

దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది

1, 2. దేవుడు దుష్టత్వాన్ని, వేదనను అంతంచేసే చర్య గైకొంటాడని మనెమందుకు నిశ్చయత కలిగివుండగలము?

1 మానవుల దృష్టిలో ఇంత దీర్ఘకాలంగా దేవుడు అసంపూర్ణతను, వేదనను అనుమతించినను, ఈ చెడ్డ పరిస్థితులు నిరంతరము కొనసాగుటకు ఆయనిక అనుమతించడు. ఈ సంగతులు జరుగునట్లు అనుమతించుటకు దేవునికొక నిర్దిష్ట సమయము కలదని బైబిలు మనకు చెబుతున్నది.

2 “ప్రతిదానికి సమయము కలదు.” (ప్రసంగి 3:1) దుష్టత్వాన్ని, వేదనను దేవుడు అనుమతించిన సమయము ముగింపుకొచ్చినప్పుడు, ఆయన మానవవ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు. ఆయన ఈ దుష్టత్వాన్ని, వేదనను అంతమొందించి, పరిపూర్ణ, సంతోషభరితమగు మానవకుటుంబము పరదైసు పరిస్థితుల్లో సంపూర్ణ సమాధానమును, ఆర్థిక భద్రతను అనుభవించాలనే తన తొలి సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తాడు.

దేవుని తీర్పులు

3, 4. దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు కలిగే ఫలితాల్ని సామెతల గ్రంథమెట్లు వర్ణిస్తున్నది?

3 దేవుని జోక్యాన్ని గూర్చి తెలిపే అనేక బైబిలు ప్రవచనాల్లో కొన్నింటిని అనగా మానవ కుటుంబానికి ఆయన తీర్పులుతెచ్చే ఫలితాల్ని గమనించండి:

4 “యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”—సామెతలు 2:21, 22.

5, 6. దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఏమి సంభవిస్తుందో కీర్తన 37 ఎలా చూపిస్తున్నది?

5 “కీడుచేయువారు నిర్మూలమగుదురు, యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:9-11.

6 “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము, సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.”—కీర్తన 37:34, 37, 38.

7. దేవుని వాక్యము మనకెలాంటి చక్కని సలహానిస్తున్నది?

7 కాబట్టి, సర్వశక్తిగల సృష్టికర్త మనలను పాలించు హక్కు కలిగియున్నాడని గుర్తించువారికున్న మహోజ్వల భవిష్యత్తు దృష్ట్యా, మనకిలా ఉద్భోదించబడింది: “నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును.” వాస్తవానికి, దేవుని చిత్తము చేయుటకు నిర్ణయించుకొన్న వారికి నిత్యజీవం ప్రసాదించబడును. దేవుని వాక్యము మనకీవిధంగా సలహానిస్తున్నది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:1, 2, 5, 6.

పరలోకము నుండి దేవుని పరిపాలన

8, 9. దేని మూలంగా దేవుడు ఈ భూమిని పరిశుభ్రం చేస్తాడు?

8 మానవజాతి క్రితమెన్నడు కలిగియుండని అత్యంత శ్రేష్ఠమైన ప్రభుత్వము ద్వారా దేవుడు శుభ్రపరచు ఈ పని నెరవేరుస్తాడు. ఆ ప్రభుత్వం దేవుని నడిపింపు క్రింద పరలోకమునుండి పరిపాలిస్తుంది గనుక అది పరలోక జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. మరియు ఆ ప్రభుత్వం భూమినుండి సమస్త విధములైన మానవ ప్రభుత్వాలను తొలగిస్తుంది. దేవుని నుండి స్వంతంత్రంగా పరిపాలించుకొన ప్రయత్నించే ఎంపికను మానవులిక ఎన్నడు కలిగివుండరు.

9 ఈ సందర్భంగా దానియేలు 2:44 నందలి ప్రవచనమిలా చెబుతున్నది: “ఆ రాజుల [ప్రస్తుతకాల ప్రభుత్వముల] కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకమందు] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు [దేవునినుండి వేరుగా పరిపాలించుటకు మరెన్నడు మానవులు అనుమతింపబడరు]. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని [ప్రస్తుతమున్న వాటిని] పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—ప్రకటన 19:11-21; 20:4-6 కూడా చూడండి.

10. దేవుని పరలోక రాజ్యం క్రింది పరిపాలనలో అవినీతి మరెన్నడూ ఉండదని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము?

10 ఆ విధంగా, మానవులు మరెన్నడూ అవినీతికరమైన ప్రభుత్వాలను కలిగివుండరు, ఎందుకంటె దేవుడు ఈ విధానాన్ని అంతమొందిస్తాడు, దానితో ఆయననుండి వేరైన మానవ పరిపాలన ఇక ఉనికిలోనే ఉండదు. దేవుడే దాని ఆరంభకుడును, సంరక్షకుడైనందున పరలోకంనుండి పరిపాలించు ఆ రాజ్యంలో అవినీతి ఉండదు. బదులుగా, దాని ప్రజల కొరకు అత్యంత శ్రద్ధతో అది పనిచేస్తుంది. పరలోకమందు నెరవేరినట్లే భూమియంతటా ఆయన చిత్తము నెరవేరును. అందుకే యేసు తన శిష్యులకు ఇలా ప్రార్థించుడని బోధించగల్గాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:10.

మనమెంత సమీపంగా ఉన్నాము?

11. ఈ విధానాంతానికి మనమెంత దగ్గరగా ఉన్నామో తీర్మానించుకొనుటకు మనకు సహాయపడు ప్రవచనాలను బైబిల్లో మనమెక్కడ కనుగొంటాము?

11 ఈ అసంతృప్తికరమైన విధానాంతానికి, దేవుని నూతనలోక ఆరంభానికి మనమెంత సమీపంగా ఉన్నాము? దానికి బైబిలు ప్రవచనము మనకు స్పష్టముగా జవాబిస్తున్నది. ఉదాహరణకు, బైబిలు చెబుతున్నట్లు “యుగసమాప్తికి” సంబంధించి మనస్థానాన్ని తీర్మానించుకొనగల్గుటకు మనం దేనికొరకు చూడవలెనో యేసు తానుగా ప్రవచించాడు. ఇది మత్తయి 24, 25, మార్కు 13, లూకా 21 అధ్యాయాల్లో వ్రాయబడింది. రెండవ తిమోతి 3 వ అధ్యాయంలో వ్రాయబడినట్లు, కాలప్రవాహంలో మనమెక్కడ ఉన్నామో రూఢిపర్చు అనేక సంఘటనలు జరుగు “అంత్యదినములు” అనబడే కాలమొకటి ఉంటుందని అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు.

12, 13. యుగాంతాన్ని గూర్చి యేసు, పౌలు ఏమి చెప్పారు?

12 ఇలాంటి సంఘటనలతో ఈ కాలం మొదలౌతుందని యేసు చెప్పాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును.” (మత్తయి 24:7) “తెగుళ్లను” గూర్చి కూడా ఆయన ప్రస్తావించాడని లూకా 21:11 చూపిస్తున్నది. ఆలాగే ‘అక్రమం విస్తరిస్తుందని’ కూడ ఆయన హెచ్చరించాడు.—మత్తయి 24:12.

13 అపొస్తలుడైన పౌలు యిలా ప్రవచించాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. . . . దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.”—2 తిమోతి 3:1-5, 13.

14, 15. మనం నిజంగా అంత్యదినాల్లో ఉన్నామని ఈ 20 వ శతాబ్ద సంఘటనలు ఎలా రూఢిపరుస్తున్నవి?

14 యేసు, పౌలు ప్రవచించిన సంగతులు మనకాలంలో నెరవేరుతున్నాయా? నిశ్చయంగా అవి నెరవేరుతున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం అప్పటివరకు జరిగిన యుద్ధాల్లోకెల్లా మహా ఘోరమైన యుద్ధంగా ఉండెను. అది మొట్టమొదటి ప్రపంచ యుద్ధమైయుండి ఆధునిక చరిత్రలో ఒక మలుపై యుండెను. ఆ యుద్ధంతోపాటు కరవులు, అంటురోగాలు, ఇతర విపత్తులు సంభవించాయి. యేసు చెప్పినట్లుగా 1914 నుండి జరుగుతున్న ఆ సంఘటనలు కేవలం “వేదనలకు ప్రారంభము” మాత్రమే. (మత్తయి 24:8) అవి ప్రవచింపబడిన రీతిగా “అంత్యదినములు” అని అనబడిన కాలాన్ని ఆరంభించాయి, దానితో దేవుడు దుష్టత్వాన్ని, వేదనను అనుమతించిన చివరి తరము ఆరంభమయింది.

15 మీరు బహుశ ఈ 20 వ శతాబ్దపు సంఘటనలను ఎరిగినవారై యుండవచ్చు. అది కల్గించిన ఆరాచకం మీకు తెలుసు. యుద్ధాల్లో దాదాపు 10 కోట్లమంది చనిపోయారు. అనేక కోట్లమంది ప్రజలు ఆకలితో, రోగాలతో మరణించారు. భూకంపాల్లో లెక్కలేనంతమంది చనిపోయారు. ప్రాణాలయెడల, ఆస్తులయెడల గౌరవం లేకపోవడం ఎక్కువయ్యింది. నేరభయం దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. నైతిక విలువలు ప్రక్కకు నెట్టబడుతున్నాయి. జనాబా పెరుగుదల పరిష్కారం దొరకని సమస్యలకు కారణమౌతోంది. కలుషితం జీవన నాణ్యతను పాడుచేయడమే కాకుండ అపాయాన్ని కల్గిస్తోంది. నిజంగా, మనం 1914 నుండి అంత్యదినాల్లో ఉన్నాము, ఆలాగే మనకాలాన్ని గూర్చిచెప్పే బైబిలు ప్రవచనాల నెరవేర్పు ముగింపుకు సమీపమౌతున్నాము.

16. ఈ అంత్యదినాలు ఎంత కాలంపాటు ఉంటాయి?

16 ఈ అంత్యదినాలు ఎంతకాలం ఉంటాయి? ఆ 1914 నుండి ‘వేదనల ఆరంభాన్ని’ అనుభవించే కాలాన్నిగూర్చి యేసు యిలాచెప్పాడు: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.” (మత్తయి 24:8, 34-36) ఆ విధంగా, అంత్యదినాల అన్ని సంఘటనలు ఒకే కాలంలో అనగా 1914 వ తరంలోనే నెరవేరాలి. కాబట్టి 1914 లో జీవించియున్న ప్రజలు ఇంకనూ బ్రదికియుండగానే ఈ విధానం అంతమౌతుంది. ఆ తరం వారిప్పుడు కడువృద్ధులుగా ఉన్నారు, ఇది ఈ ప్రస్తుత విధానంపై దేవుడు అంతం తీసుకురావడానికి ఇంకెంతో కాలం మిగిలిలేదని సూచిస్తున్నది.

17, 18. ఈ లోకాంతానికి మనం చాలాదగ్గరగా ఉన్నామని ఏ ప్రవచనం చూపిస్తున్నది?

17 ఈ విధానాంతము సమీపమైందని చూపించే మరో ప్రవచనాన్ని అపొస్తలుడైన పౌలు ప్రవచిస్తూ యిలాచెప్పాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చును. . . . లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా . . . వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.”—1 థెస్సలొనీకయులు 5:2, 3; మరియు లూకా 21:34, 35 కూడ చూడండి.

18 నేడు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది, గనుక ప్రపంచ యుద్ధం సంభవిస్తుందనే భయం లేదు. కాబట్టి దేశాలు తామొక నూతన ప్రపంచ విధానంవైపు వేగంగా పయనిస్తున్నామని భావించవచ్చు. అయితే వారు తమ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఎప్పుడు భావిస్తారో అప్పుడు వారి భావాలకు వ్యతిరేకమైనది జరుగుతుంది, ఎందుకంటే అది దేవుడు ఈ విధానాన్ని వెంటనే నాశనం చేయుననే చివరి సూచన. గుర్తుంచుకోండి, రాజకీయ చర్చలు, ఒప్పందాలు ప్రజల్లో నిజమైన మార్పేమీ తీసుకురావడం లేదు. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకొనేటట్లు వారు చేయడం లేదు. లోక నాయకులు నేరాన్ని ఆపుజేయడంలేదు లేదా రోగాన్ని, మరణాన్ని వారు నిర్మూలించడం లేదు. కాబట్టి, మానవుల శాంతిభద్రతల ఏ పరిణామాలందైనను నమ్మకముంచి, సమస్యల్ని పరిష్కరించే మార్గంలో ఈ లోకం ఉందని తలంచవద్దు. (కీర్తన 146:3) నిజానికి అటువంటి శాంతి కేక ఈ లోకంయొక్క అంతం సమీపమైందనే భావాన్నిస్తున్నది.

సువార్త ప్రకటించుట

19, 20. అంత్యదినాల్లో ప్రకటించు పనికి సంబంధించిన ఏ ప్రవచన నెరవేర్పును మనం చూస్తున్నాము?

19 మనం 1914 నుండి అంత్యదినాల్లో జీవిస్తున్నామని యేసుచెప్పిన మరో ప్రవచనం యిలా చూపిస్తుంది: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:10) లేదా మత్తయి 24:14 చెప్పినట్లు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”

20 నేడు చరిత్రలో క్రితమెన్నటికంటె ఎక్కువగా ఈ లోకాంతాన్ని గూర్చిన, దేవుని రాజ్యము క్రింద నూతన పరదైసు లోకాన్ని గూర్చిన సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడుతుంది. అలా ఎవరు ప్రకటిస్తున్నారు? లక్షల సంఖ్యలోనున్న యెహోవాసాక్షులే. భూమ్మీది ప్రతి దేశమందు వారు ప్రకటిస్తున్నారు.

21, 22. యెహోవాసాక్షులను నిజమైన క్రైస్తవులుగా ఏది ప్రత్యేకంగా గుర్తిస్తున్నది?

21 దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి తోడుగా, యెహోవాసాక్షులు క్రీస్తు నిజమైన అనుచరులుగా తమను గుర్తించబడు విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకంటె ఆయనిలా ప్రకటించాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” అలా, యెహోవాసాక్షులు అవిచ్ఛిన్నమైన సహోదర ప్రేమయందు భౌగోళిక సహోదరత్వమందు ఐక్యమైయున్నారు—యోహాను 13:35; మరియు యెషయా 2:2-4; కొలొస్సయులు 3:14; యోహాను 15:12-14; 1 యోహాను 3:10-12; 4:20, 21; ప్రకటన 7:9, 10 కూడా చూడండి.

22 బైబిలు చెప్పే ఈ విషయాన్ని యెహోవాసాక్షులు నమ్ముతారు: “దేవుడు పక్షపాతికాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) రంగు, జాతి భేదం లేకుండ సమస్త దేశాల్లోని తోటి సాక్షులను వారు తమ ఆత్మీయ సహోదరులుగా, సహోదరీలుగా దృష్టిస్తారు. (మత్తయి 23:8) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉనికిలోనున్న అటువంటి సహోదరత్వము వాస్తవానికి త్వరలోనే దేవుని సంకల్పము నిజమగుననే రుజువును ద్విగుణీకృతం చేస్తున్నది.

[అధ్యయన ప్రశ్నలు]

[26 వ పేజీలోని చిత్రం]

నూతన లోకంలో దేవుని పరిపూర్ణ పరలోకరాజ్యం మాత్రమే మానవజాతిని పరిపాలిస్తుంది