మనకెవరు చెప్పగలరు?
అధ్యాయం 2
మనకెవరు చెప్పగలరు?
1, 2. రూపింపబడిన ఒకానొక వస్తువు సంకల్పాన్ని తెలుసుకోవడానికి శ్రేష్టమైన మార్గమేమి?
నిజంగా జీవిత సంకల్పమేమిటో మనకు ఎవరు చెప్పగలరు? సరే, మీరు ఒక యంత్ర నిర్మాణకుడి దగ్గరకు వెళ్లి మీకు తెలియని ఒక సంశ్లిష్టమైన యంత్రాన్ని ఆయన తయారుచేయడం చూస్తే, అదేమిటో మీరెలా తెలుసుకోగలరు? ఆ నిర్మాణకున్నే అడిగి తెలుసుకోవడం మంచిది.
2 అట్లయిన, అతి సూక్ష్మ జీవాణువుతో సహా ఈ భూమ్మీద మన చుట్టూ మనం చూస్తున్న సమస్త జీవరాసుల్లోగల మహాద్భుత రూపకల్పన విషయమేమి? అతిచిన్న కణాలు, అణువుల అంతర్భాగం సహితం అద్భుతంగా రూపించబడి, క్రమపర్చబడింది. మరి మహాద్భుతంగా రూపించబడిన మానవ మెదడు సంగతేమి? మన సౌర కుటుంబం, మన పాలపుంత నక్షత్రరాశి, ఈ విశ్వం విషయమేమి? సంభ్రమాశ్చర్యాలు కల్గించే ఈ రూపాలకు నిర్మాణకుడు అవసరం లేదా? ఇటువంటి వాటిని ఎందుకు రూపించాడో ఆయన నిశ్చయంగా మనకు చెప్పగలడు.
ఆకస్మిక సంఘటనవల్ల జీవోత్పత్తి జరిగిందా?
3, 4. బహుశ ఆకస్మిక సంఘటన ద్వారా జీవం ఉత్పన్నమైందనే విషయం సంగతేమిటి?
3 “జీవరాసుల్లోగల సంశ్లిష్టత, వ్యవస్థ అసాధారణ స్థాయిలోవుందని” వ్రాస్తూ ది ఎన్‌సైక్లోపిడియా అమెరికానా యింకనూ యిలాచెప్పింది: “పుష్పాలు, కీటకాలు లేక పెద్ద జంతువుల నిశిత పరిశీలన ఆయాభాగాలు అమోఘంగా, అత్యంత ప్రామాణికంగా రూపించబడినట్లు చూపిస్తుంది.” జీవరాసుల రసాయనిక సమ్మేళనాన్ని సూచిస్తూ బ్రిటీష్ వ్యోమగామి సర్ బెర్‌నార్డ్ లోవెల్ యిలా వ్రాశాడు: “అతిసూక్ష్మ మాంసకృత్తులుగల జీవకణాలు రూపొందడానికి బహుశ . . . ఒక ఆకస్మిక సంఘటన దోహదపడిందనేది ఊహకందని విషయం. . . . నిజం చెప్పాలంటే దాని ప్రభావం సున్న.”
4 అదేవిధంగా వ్యోమగామి ఫ్రెడ్ హోయల్ కూడ యిలా చెప్పాడు: “జీవమొక హఠాత్‌పరిణామమేనని సైద్ధాంతిక జీవ శాస్త్రమింకనూ నమ్ముతుంది. అయితే జీవంయొక్క మహాద్భుతమైన సంశ్లిష్టతను గూర్చి జీవరసాయన శాస్త్రజ్ఞులు అంతకంతకు ఎక్కువ కనిపెట్టుకొలది, అది ఆకస్మిక సంఘటనవల్ల పుట్టిందనే విషయం ఎంత అల్పంగావుందంటే మనం దానిని పూర్తిగా కొట్టివేయవచ్చును. ఆకస్మిక సంఘటనవల్ల జీవం ఉత్పన్నం కానేరదు.”
5-7. జీవరాసులు ఆకస్మిక సంఘటన ద్వారా ఉత్పన్నం కావని అణు జన్యు జీవశాస్త్రం ఎలా నిరూపిస్తుంది?
5 కణాల, పరమాణువుల, అణువుల స్థాయిలో జీవరాసుల అధ్యయనమైన అణుజన్యు జీవశాస్త్రం ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన రంగాల్లో ఒకటి. అణు జన్యు జీవశాస్త్రజ్ఞుడైన డెంటన్ క్రొత్తగా కనుగొన్న విషయంపై యిలా వ్యాఖ్యానిస్తున్నాడు: “మనకు తెలిసిన సూక్ష్మాతి సూక్ష్మ అణువుల్లోగల సంశ్లిష్టత ఎంత అద్భుతంగా ఉందంటే అది ఏదో తెలియని, ఊహించని సంఘటనవల్ల ఆకస్మికంగా వచ్చిందనే విషయాన్ని అంగీకరించడం అసాధ్యం.” “అయితే కేవలం జీవరాసుల సంశ్లిష్టత మాత్రమే ఈ గొప్ప సవాలును విసరడంలేదు, గానీ వాటి రూపకల్పనలో తరచు ప్రదర్శింపబడు బుద్ధిసూక్ష్మత కూడా విస్మయ కారణమౌతుంది.” “పరమాణు స్థాయిలోనే . . . జీవప్రక్రియా నమూనా ప్రతిభ, అది సాధించే లక్ష్యాల పరిపూర్ణత బహుగా కొనియాడబడుతుంది.”
6 డెంటన్ యింకనూ యిట్లన్నాడు: “మనమెక్కడ చూచినా, ఎంత లోతుగా చూచినా ఇవి ఆకస్మిక సంఘటనవల్ల కల్గినవనే నమ్మకాన్ని బలహీనపరచే అతిశయోక్తికరమగు సూక్ష్మబుద్ధినే మేము కనుగొంటున్నాము. అతి సూక్ష్మ ధాతువు అనగా సజీవ మాంసపుకృత్తి లేదా జీవాణువునందలి సంశ్లిష్టత మన సృజనాత్మక సామర్థ్యాలకు అతీతంగా, ఆకస్మిక సంఘటనావాదానికి విరుద్ధంగా, మానవ పరిజ్ఞానం ఉత్పత్తిచేయగల దేనినైననూ మించిపోవుచుండగా, అట్టి వాస్తవిక సంగతిని ఒక హఠాత్‌పరిణామం నిర్మించగలదని చెప్పుట నమ్మదగిన విషయమేనా?” ఆయనింకా యిలా చెబుతున్నాడు: “జీవకణానికి, స్ఫటికం లేదా మంచు బిందువువంటి అత్యంత ప్రామాణికంగానున్న జీవరహిత పదార్థాల నడుమ గ్రహించజాలనంత పెద్ద అగాధం కలదు.” భౌతికశాస్త్ర పండితుడైన చెట్ రామో యిలా అంటున్నాడు: “ప్రతి జన్యుకణం దాని పనికొరకు అత్యంత అద్భుతంగా నిర్మించబడటం . . . నాకు విస్మయం కల్గించింది.”
7 “ఈ నూతన నిజత్వం ఆకస్మిక సంఘటన ఫలితమేనని మొండిగా వాదించు వారెవరైననూ” కట్టుకథల్ని నమ్మే వారేనని అణుజన్యు జీవశాస్త్రజ్ఞుడైన డెంటన్ తేల్చిచెప్పాడు. వాస్తవానికి, జీవరాసులు ఆకస్మిక సంఘటనద్వారా వచ్చాయని చెప్పే డార్విన్ నమ్మకాన్ని ఆయన “సృష్టినిగూర్చి ఈ 20 వ శతాబ్దంలో చెప్పబడిన ఒక గొప్ప కట్టుకథని” పిలుస్తున్నాడు.
నమూనాకు నమూనాదారుడు కావాలి
8, 9. ప్రతి నమూనాకు ఒక నమూనాదారుడు అవసరమని చూపిస్తూ ఒక ఉదాహరణ చెప్పండి.
8 ఆకస్మిక సంఘటన లేదా ఏదో హఠాత్‌పరిణామము ద్వారా నిర్జీవ పదార్థాలనుండి జీవం పుట్టిందనే తలంపు అసాధ్యం. ప్రతి నమూనాకు తప్పకుండా ఒక నమూనాదారుడు ఉండాలి గనుక, బహు ఉత్కృష్టంగా ఈ భూమ్మీద నిర్మింపబడిన జీవరాసులన్నీ ఆకస్మికంగా వచ్చివుండవు. మీకు మరో అభిప్రాయమేమైనా ఉందా? అలాంటిదేదీ ఉండదు. నమూనా ఎంత సంశ్లిష్టంగా ఉంటే, దాని నమూనాదారుడు అంత సమర్థుడై యుండాలి.
9 విషయాన్ని మనమీవిధంగా కూడ ఉదహరించవచ్చును: మనమొక చిత్రిపటాన్ని చూసినప్పుడు, దానికో చిత్రకారుడున్నాడని మనమంగీకరిస్తాము. మనమొక పుస్తకం చదివినప్పుడు, దానికొక గ్రంథకర్త ఉన్నాడని మనమంగీకరిస్తాము. మనమొక ఇంటిని చూసినప్పుడు దానిని నిర్మించిన వాడొకడున్నాడని మనకు తెలుసు. ట్రాఫిక్ లైటు చూసినప్పుడు చట్ట నిర్దేశకులు వారున్నారని మనకు తెలుసు. అవన్నియు వాటిని చేసినవారివలన ఒక సంకల్పంతో చేయబడ్డాయి. వాటిని రూపించిన వారినిగూర్చి మనకు పూర్తిగా అర్థంకాకున్ననూ, వారసలు ఉనికిలో ఉన్నారా అని మనం సందేహించము.
10. సర్వోన్నత నిర్మాణకుని గూర్చిని ఏ రుజువును మనం చూడగలము?
10 అదేవిధంగా, సర్వోన్నత నిర్మాణకుని ఉనికిని గూర్చిన రుజువును మనం భూమ్మీది జీవరాసుల నమూనా,
క్రమము, సంశ్లిష్టతయందు చూడగలము. అవన్నియు ఒక సర్వోన్నత జ్ఞానము ఉన్నదనే విషయాన్ని సూచిస్తున్నాయి. అరబ్‌ల [కోటానుకోట్ల] నక్షత్రాలున్న అరబ్‌ల [కోటానుకోట్ల] నక్షత్రరాశులతో అలరారుతున్న ఈ విశ్వపు నమూనా, క్రమము, సంశ్లిష్టత విషయంలో కూడ ఇది సత్యమైయుంది. ఈ ఆకాశ గ్రహాల కదలిక, ఉష్ణము, వెలుతురు, శబ్దము, విద్యుత్తయస్కాంతశక్తి, గురుత్వాకర్షణ వంటి ప్రామాణిక నియమాలచే నిర్దేశింపబడుతున్నాయి. చట్టం తయారు చేయువారు లేకుండా చట్టాలు ఉండగలవా? రాకెట్ శాస్త్రజ్ఞుడైన డా. వెర్న్‌హెర్ ఫాన్ బ్రాన్ యిట్లన్నాడు: “విశ్వమందలి ప్రకృతి నియమాలు ఎంత ప్రామాణికంగా ఉన్నాయంటే, చంద్రునిమీదికి పంపగల వ్యోమనౌకల్ని నిర్మించడంలో మాకేమాత్రం కష్టం కలగడం లేదు, లేశమాత్ర సూక్ష్మతతో నౌకా సమయాన్ని మేము నిర్ణయించగల్గుచున్నాము. ఈ నియమాల్ని ఎవరో ఒకరు తప్పక నియమించారు.”11. ఆయన్ని మనం చూడలేము కాబట్టి సర్వోన్నత నిర్మాణకుని ఉనికిని మనమెందుకు నిరాకరించకూడదు?
11 నిజమే, మన అక్షరార్థ నేత్రాలతో సర్వోన్నత నిర్మాణకున్ని, శాసనకర్తను చూడలేము. అయితే గురుత్వాకర్షణ, అయస్కాంతశక్తి, విద్యుత్, లేదా రేడియో తరంగాలవంటి వాటిని చూడలేము కాబట్టి మనం వాటి ఉనికిని నిరాకరించగలమా? లేదు, మనమలా చేయము, ఎందుకంటే మనం వాటి ప్రభావాన్ని చూడగలము. అట్లయిన ఆశ్చర్యకరమైన ఆయన చేతిపనుల ఫలితాల్ని చూడగల్గి, కేవలం ఆయన్ని చూడనంత మాత్రాన మనమెందుకు సర్వోన్నత నిర్మాణకుని ఉనికిని నిరాకరించాలి?
12, 13. సృష్టికర్త ఉనికిని గూర్చి సాక్ష్యాధారం ఏమి చెబుతున్నది?
12 భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన పాల్ డేవిస్ మానవుని ఉనికిని ఏదో విధివశాత్తు, ఆకస్మికంగా వచ్చిందికాదని తేల్చి చెప్పాడు. ఆయనిట్లంటున్నాడు: “నిజానికి మనమిక్కడే వుండాలని చేయబడ్డాము.” ఈ విశ్వాన్నిగూర్చి ఆయనిలా అంటున్నాడు: “నా విజ్ఞానశాస్త్ర అధ్యయనం ద్వారా నేను తెలుసుకున్నదేమంటే, ఇది జ్ఞానరహిత విషయమని నేను అంగీకరించలేనంత విస్మయంగా ఈ భౌతిక విశ్వం బుద్ధి సూక్ష్మతతో కట్టబడిందని నేను మరింత బలంగా నమ్ముతున్నాను. దీనికి తప్పకుండా లోతైన వివరణ ఉంటుందని నాకన్పిస్తుంది.”
13 ఆ విధంగా, ఈ విశ్వం, ఈ భూమి భూమిపైనున్న జీవరాసులు ఆకస్మిక సంఘటన ద్వారా కలుగవని నిదర్శనాలు మనకు తెలియజేస్తున్నాయి. అవన్నీ మహా జ్ఞానవంతుడైన, శక్తిమంతుడైన సృష్టికర్త ఉన్నాడని మౌన సాక్ష్యానిస్తున్నవి.
బైబిలు ఏమి చెబుతున్నది
14. సృష్టికర్తను గూర్చి బైబిలు ఏమి తేల్చి చెబుతున్నది?
14 మానవజాతి యొక్క అతిపురాతన గ్రంథమగు బైబిలు కూడా అదే విషయాన్ని తేల్చి చెబుతున్నది. ఉదాహరణకు, బైబిల్లో అపొస్తలుడైన పౌలు వ్రాసిన హెబ్రీ పత్రికలో మనకిలా ఉపదేశింపబడింది: “ప్రతి యిల్లును ఎవడైనను ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:4) అపొస్తలుడైన యోహాను వ్రాసిన బైబిలు చివరి పుస్తకమగు ప్రకటన కూడా ఇట్లు చెబుతున్నది: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవియుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావను పొంద నర్హుడవు.”—ప్రకటన 4:11.
15. దేవుని లక్షణాలను కొన్నింటిని మనమెట్లు గ్రహించగలము?
15 దేవున్ని మనం చూడలేకపోయిననూ, ఆయన చేసిన వాటినిబట్టి ఆయనెటువంటి దేవుడో మనం గ్రహించవచ్చని బైబిలు చూపుతున్నది. అదిలా చెబుతున్నది: “[సృష్టికర్త] అదృశ్యలక్షణాలు, అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వం లోకారంభం నుండి ఆయన చేసిన వాటిలో సహేతుక దృష్టికి దృశ్యముగానే కనబడుతున్నవి.”—రోమీయులు 1:20, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్.
16. మానవులు దేవున్ని చూడలేరనుటను బట్టి మనమెందుకు సంతోషించాలి?
16 కాబట్టి బైబిలు మనల్ని ప్రభావంనుండి కారకానికి తీసుకెళ్తుంది. ఆ ప్రభావం అనగా చేయబడిన సంభ్రమాశ్చర్య సంగతులు జ్ఞాన సంపన్నమైన, శక్తివంతమైన కారకమగు నిర్గమకాండము 33:20
దేవుడున్నాడనుటకు రుజువైయుంది. పైగా ఈ యావత్ విశ్వసానికే సృష్టికర్తగా ఆయన నిస్సందేహంగా రక్తమాంసాలుగల మానవులు చూసి, బ్రదుకలేనంత అఖండ శక్తిసంపన్నుడు గనుక, ఆయన అదృశ్యడైయున్నందుకు మనం కృతజ్ఞులమై యుండాలి. బైబిలు చెప్పేది కూడా అదే: “ఏ నరుడును నన్ను [దేవున్ని] చూచి బ్రదుకడు.”—17, 18. సృష్టికర్తను గూర్చిన తలంపు మనకెందుకు ప్రాముఖ్యము?
17 గొప్ప నిర్మాణకుడు, సర్వోన్నత ప్రాణి అనగా దేవుడున్నాడనే భావన మనకు అత్యంత ప్రాముఖ్యమైన సంగతై యుండాలి. మనమొక సృష్టికర్తచే చేయబడితే, మనల్ని సృష్టించడంలో ఆయనకు తప్పకుండా ఒక కారణమంటూ ఉండాలి, ఒక సంకల్పముండాలి. జీవిత సంకల్పం కలిగివుండడానికి మనం సృష్టించబడితే, భవిష్యత్తు బాగుంటుందని నిరీక్షించే కారణం మనకుంటుంది. లేనట్లయితే, ఏ నిరీక్షణ లేకుండా మనం బ్రతికి చనిపోతాం. కాబట్టి, మనకొరకు దేవుని సంకల్పమేమిటో తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యం. అప్పుడు మనమా సంకల్పం చొప్పున జీవించడానికి ఇష్టపడాలా లేదా అనేది ఎంచుకోగలము.
18 అంతేకాకుండ, సృష్టికర్త ప్రేమగల దేవుడని, మనయెడల ఆయనకెంతో శ్రద్ధవుందని బైబిలు చెబుతున్నది. అపొస్తలుడైన పేతురు యిలా చెప్పాడు: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు.” (1 పేతురు 5:7; యోహాను 3:18; 1 యోహాను 4:8, 16 కూడా చూడండి.) దేవుడు మనలను మానసికంగా, భౌతికంగా ఎంత అద్భుతంగా చేశాడో పరిశీలించుట ద్వారా ఆయన మనయెడల ఎంత శ్రద్ధ చూపుతున్నాడో మనం చూడగలము.
‘అద్భుతంగా చేయబడ్డాము’
19. ఏ సత్యాన్ని కీర్తనల రచయిత దావీదు మన దృష్టికి తెస్తున్నాడు?
19 బైబిల్లో కీర్తనల రచయిత దావీదు యిలా అంగీకరించాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.” (కీర్తన 139:14) అది సత్యం, ఎందుకంటె మానవ మెదడును, శరీరాన్ని సర్వోన్నత నిర్మాణకుడు అత్యద్భుతంగా రూపించాడు.
20. మానవ మెదడును ఒక సర్వసంగ్రహ నిఘంటువు ఎలా వర్ణిస్తున్నది?
20 ఉదాహరణకు, మీ మెదడు ఎటువంటి కంప్యూటర్ కంటే ఎంతో సంశ్లిష్టమైనది. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యిలా వ్రాసింది: “నాడీమండల వ్యవస్థలో సమాచారం అందజేయబడు విధానం అతిపెద్ద టెలిఫోన్ ఎక్సేంజ్‌లకంటే మరెంతో సంశ్లిష్టమైనది; సమస్యను పరిష్కరించే మానవ మెదడు విధానం ఎదుట అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల సామర్థ్యం కూడ వెలవెలబోతుంది.”
21. మెదడు చేసే పనిని మనం చూసినప్పుడు, మనమే నిర్ణయానికి రావాలి?
21 కోట్లాది వాస్తవాలు, మానసిక చిత్రాలు మీ మెదడులో ఉంచబడతాయి, అంటే అది కేవలం వాస్తవాల్ని నిలవుంచే గిడ్డంగని కాదు. దానితో మీరు ఈల ఎలా వేయాలో, రొట్టెనెలా తయారుచేయాలో, మరో భాషనెలా నేర్చుకోవాలో, కంప్యూటర్‌నెలా ఉపయోగించాలో, లేదా విమామానాన్నెలా నడిపించాలో నేర్చుకోగలరు. సెలవులు ఎలా గడుస్తాయో లేదా ఒకానొక పండు రుచి ఎంత అమోఘంగా ఉంటుందో మీరు ఊహించగలరు. విషయాల్ని విశ్లేషించి మీరు పనులు చేయగలరు. ఆలాగే మీరు పథకాలు వేయగలరు, మెప్పును, ప్రేమను చూపగలరు, వర్తమాన భూత భవిష్యత్తులను గూర్చిన మీ తలంపుల్ని వివరించగలరు. సంభ్రమాశ్చర్యం కల్గించే మానవ మెదడులాంటి దానిని మానవులమైన మనం నిర్మించలేము గనుక, దాని నిర్మాత కచ్చితంగా ఏ మానవునికంటెను ఎంతో గొప్ప జ్ఞానాన్ని, సామార్థ్యాన్ని కలిగివున్నాడు.
22. మానవ మెదడును గూర్చి శాస్త్రజ్ఞులు ఏమి అంగీకరిస్తున్నారు?
22 మెదడును గూర్చి శాస్త్రజ్ఞులు యిలా అంగీకరిస్తున్నారు: “మహిమాన్వితంగా, నియమబద్ధంగా, మహాద్భుతంగా రూపించబడిన ఈ సంశ్లిష్ట యంత్రభాగంలో ఈ పనులన్నీ ఎలా నిర్వహించబడతాయో అంతుబట్టడం లేదు. . . . మెదడు సమర్పించే వివిధ చిక్కుముడులనన్నింటిని మానవులెన్నటికి పరిష్కరించలేరు.” (సైంటిఫిక్ అమెరికాన్) భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన రెమో యిట్లంటున్నాడు: “నిజం చెప్పాలంటే, మానవ మెదడు సమాచారాన్ని ఎలా
నిలువజేస్తుందో లేదా అనుకున్నదే తడవుగా విషయాల్ని ఎలా గుర్తుకుతెస్తుందో మనకింకా పూర్తిగా తెలియదు. . . . మానవ మెదడులో దాదాపు ఒక కరబ్ [పదివేల కోట్ల] నాడీకణాలున్నాయి. ప్రతికణం బీరకాయ పీచులాగా వేలాది ఇతర కణాలతో సమాచార వ్యవస్థను కలిగివుంటుంది. ఈ అంతరంగ కనెక్షన్లు విస్మయం కల్గించునంత చిక్కుగా వుంటాయి.”23, 24. అద్భుతంగా రూపింపబడిన శరీరావయవాలను కొన్నింటిని పేర్కొనండి. ఒక ఇంజనీరు ఏమని వ్యాఖ్యానించాడు?
23 ఏ కెమెరాకంటెను మీ కళ్లు ఎంతో ప్రామాణికమైనవి, సకల పరిస్థితుల్లో పనిచేయగలవు; వాస్తవానికి అవి పూర్తిగా ఆటోమేటిక్, సెల్ఫ్ ఫోకసింగ్, కలర్ మోషన్ పిక్చర్ కెమెరాలే. మీ చెవులు వివిధ శబ్దాల్ని పసిగట్టి సమతూకమైన నిర్దేశక భావాన్ని మీకందిస్తాయి. పేరు పొందిన ఇంజనీర్లు సహితం నకలు రూపించ లేకపోయినంత సామర్థ్యంగల పంపువలె మీ గుండె పనిచేస్తుంది. మరికొన్ని చెప్పాలంటే ముక్కు, నాలుక, చేతులు, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ వంటి శరీరావయవాలు కూడా మహాద్భుతమే.
24 ఒక పెద్ద కంప్యూటర్‌ను రూపించి నిర్మించడానికి నియమించబడిన ఒక ఇంజనీరు యిలా తర్కించాడు: “నా కంప్యూటర్‌కే ఒక నిర్మాణుకుడు అవసరమైతే, ఈ అనంత విశ్వంలో కేవలం అతిచిన్న భాగమైననూ, మరింత సంశ్లిష్టమైన భౌతిక-రసాయన-జీవకణ యంత్రమగు నా శరీరానికి మరెంత గొప్ప నిర్మాణుకుడు కావాలి?”
25, 26. మహాగొప్ప నిర్మాణకుడు మనకేమి చెప్పగలడు?
25 విమానాలు, కంప్యూటర్లు, సైకిళ్లు ఇతర వస్తువుల్ని తయారు చేసినప్పుడు వాటినిగూర్చి ప్రజల మనస్సులో ఒక సంకల్పమున్నట్లే, మానవుల మెదడును, శరీరాన్ని నిర్మించిన నిర్మాతకూడా మనల్ని రూపించడంలో ఒక సంకల్పాన్ని కలిగియుంటాడు. ఆయన నిర్మించి వాటి నకలును మనలో ఎవ్వరమూ చేయలేము గనుక ఈ నిర్మాణకుడు మానవుల కంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగివుంటాడు. కాబట్టి, మనల్ని ఎందుకు రూపించాడో, ఈ భూమ్మీద మనలను ఎందుకు ఉంచాడో, మన భవిష్యత్తేమిటో ఆయనే మనకు చెప్పగలడు.
26 ఆ విషయాల్ని మనం తెలిసికొంటే దేవుడు మనకిచ్చిన అట్టి అద్భుతమైన మెదడును, శరీరాన్ని మన జీవిత సంకల్పాన్ని నెరవేర్చుటకు ఉపయోగించగలము. అయితే ఆయన సంకల్పాల్ని గూర్చి మనమెక్కడ నేర్చుకోగలము? ఆ సమాచారాన్ని ఆయన మనకెక్కడ దయచేశాడు?
[అధ్యయన ప్రశ్నలు]
[7 వ పేజీలోని చిత్రం]
రూపింపబడినది ఎందుకు రూపింబడిందో తెలుసుకోవడానికి దాని నిర్మాణకున్ని అడగడమే శ్రేష్టమైన మార్గం
[8 వ పేజీలోని చిత్రం]
జీవరాసుల్లోని సంశ్లిష్టతను, నమూనాను DNA జన్యకణమందు చూడవచ్చును
[9 వ పేజీలోని చిత్రం]
“సమస్యలను పరిష్కరించే మానవ మెదడు విధానం ముందు అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల సామర్థ్యం కూడ వెలవెలబోతుంది”