కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4

నా తప్పుల్ని నేనెలా సరిదిద్దుకోవాలి?

నా తప్పుల్ని నేనెలా సరిదిద్దుకోవాలి?

అది ఎందుకు ప్రాముఖ్యం?

తప్పుల్ని ఒప్పుకోవడం వల్ల మీరు బాధ్యతగల వ్యక్తిగా, నమ్మదగిన వ్యక్తిగా అవుతారు.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: టిమ్‌ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటున్నప్పుడు, బాల్‌ వెళ్లి పక్కింటివాళ్ల కారుకు తగిలింది. దాంతో ఆ కారు అద్దం పగిలిపోయింది.

టిమ్‌ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

మీ ముందు మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి:

  1. అక్కడినుండి పారిపోవడం.

  2. తప్పును వేరేవాళ్లమీదకి నెట్టడం.

  3. జరిగిన విషయాన్ని కారు ఓనర్‌కి చెప్పి, డబ్బులు కడతానని చెప్పడం.

ఆప్షన్‌ A ఎంచుకోవాలని మీకు బలంగా అనిపించవచ్చు. కానీ, తప్పును ఒప్పుకోవడమే మంచిది. అది, కారు అద్దాన్ని పగలగొట్టడం కావచ్చు, మరేదైనా కావచ్చు.

మీ తప్పుల్ని ఒప్పుకోవడానికి మూడు కారణాలు

  1. అదే సరైన పని.

    బైబిలు ఇలా చెప్తుంది, ‘మేము అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం.’—హెబ్రీయులు 13:18.

  2. సాధారణంగా, తప్పులు ఒప్పుకునేవాళ్లనే ఇతరులు క్షమించడానికి ఇష్టపడతారు.

    బైబిలు ఇలా చెప్తుంది, ‘అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.’—సామెతలు 28:13.

  3. అన్నిటికంటే ముఖ్యంగా అది దేవుణ్ణి సంతోషపెడుతుంది.

    బైబిలు ఇలా చెప్తుంది, “వక్ర బుద్ధి గలవారంటే యెహోవాకు చెడ్డ అసహ్యం! నిజాయితీపరులకు ఆయన సన్నిహితుడు.”—సామెతలు 3:32, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

20 ఏళ్ల కరీనా, కారును స్పీడ్‌గా నడిపినందుకు ఫైన్‌ కట్టాల్సి వచ్చింది. ఫైన్‌ కట్టిన రసీదును వాళ్ల డాడీకి కనిపించకుండా దాచిపెట్టింది. కానీ, అది ఎంతోకాలం దాగలేదు. కరీనా ఇలా అంటుంది, “దాదాపు ఒక సంవత్సరం తర్వాత, అది మా డాడీ కంటపడినప్పుడు నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను.”

కరీనా ఏ పాఠం నేర్చుకుంది? ఆమె ఇలా అంటుంది, “తప్పులు దాచిపెడితే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారౌతుంది. తర్వాతైనా వాటి ఫలితాల్ని అనుభవించాల్సివస్తుంది!”

తప్పుల నుండి ఎలా పాఠం నేర్చుకోవచ్చు?

బైబిలు ఇలా చెప్తుంది, “మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము.” (యాకోబు 3:2, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తప్పుల్ని ఒప్పుకోవడం వల్ల, అదికూడా వెంటనే ఒప్పుకోవడం వల్ల, మీరు తెలివిగా ఆలోచించేవాళ్లని, వినయంగల వాళ్లని ఇతరులు అర్థం చేసుకుంటారు.

మీ తప్పుల నుండి పాఠం నేర్చుకోండి. వీరా అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “తప్పుచేసిన ప్రతీసారి దానినుండి పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అలా నేర్చుకున్న విషయాలు, నేను మంచి వ్యక్తిగా అవ్వడానికీ, అలాంటి పరిస్థితే మళ్లీ వస్తే దాన్ని నేర్పుగా ఎదుర్కోవడానికీ నాకు సహాయం చేస్తాయి.” దాన్ని మీరెలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

మీరు మీ డాడీ బైక్‌ తీసుకొని బయటికెళ్లారు. బైక్‌ని దేనికో గుద్దడంవల్ల ఒక చిన్న సొట్ట పడింది. మీరిప్పుడు ఏం చేస్తారు?

  • మీ డాడీ చూడడులే అని ఆ విషయాన్ని దాచిపెడతారు.

  • అసలు ఏం జరిగిందో మీ డాడీకి చెప్తారు.

  • ఏం జరిగిందో మీ డాడీకి చెప్తారు కానీ, ఆ తప్పును వేరేవాళ్లమీదకి నెట్టేస్తారు.

సరిగ్గా చదవకపోవడంవల్ల మీరు ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయ్యారు. మీరిప్పుడు ఏం చేస్తారు?

  • క్వశ్చన్‌ పేపరు కష్టంగా వచ్చిందని చెప్తారు.

  • సరిగ్గా చదవకపోవడం వల్లే ఫెయిల్‌ అయ్యారని ఒప్పుకుంటారు.

  • టీచర్‌కి నేనంటే గిట్టదు, అందుకే నన్ను ఫెయిల్‌ చేశారు అని చెప్తారు.

జరిగిపోయిన తప్పుల గురించే ఆలోచిస్తూ ఉండడం, అద్దంలో వెనక వచ్చే వాహనాల్నే చూస్తూ కారు నడపడం లాంటిది

ఇంతకుముందు చెప్పిన సన్నివేశాల్లో మీరు (1) మీ డాడీ స్థానంలో, (2) మీ టీచర్‌ స్థానంలో ఉన్నట్టు ఊహించుకోండి. మీ తప్పుల్ని వెంటనే ఒప్పుకొనివుంటే, మీ డాడీగానీ, మీ టీచర్‌గానీ మీ గురించి ఏమనుకునేవాళ్లు? ఒకవేళ మీరు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకొనివుంటే వాళ్లు ఏమనుకునేవాళ్లు?

పోయిన సంవత్సరం మీరు చేసిన ఒక తప్పును గుర్తుతెచ్చుకొని, ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి.

మీరు చేసిన తప్పు ఏంటి? అప్పుడు ఏం చేశారు?

  • తప్పు దాచిపెట్టాను.

  • తప్పును వేరేవాళ్లమీదకి నెట్టేశాను.

  • వెంటనే తప్పు ఒప్పుకున్నాను.

మీ తప్పును ఒప్పుకోనప్పుడు, మీకెలా అనిపించింది?

  • చాలా బాగా దాచిపెట్టగలిగాను అనిపించింది.

  • నిజం చెప్తే బాగుండేది అనిపించింది.

ఆ పరిస్థితిలో మీరు ఇంకా ఏం చేస్తే బాగుండేది?

మీరు చేసిన తప్పు నుండి ఏ పాఠం నేర్చుకున్నారు?

మీకేమనిపిస్తుంది?

కొంతమంది తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి ఎందుకు వెనకాడతారు?

ఎప్పుడూ తప్పుల్ని దాచిపెడుతుంటే వేరేవాళ్లు మీ గురించి ఏమనుకుంటారు? అలా కాకుండా మీరు మీ తప్పుల్ని ఒప్పుకుంటే వాళ్లు ఏమనుకుంటారు?—లూకా 16:10.