“ప్రమాదకరమైన ఆటలు”—మీరు ఆడాలా?
బైబిలు అభిప్రాయం ఏంటి?
“ప్రమాదకరమైన ఆటలు”—మీరు ఆడాలా?
“ఈరోజుల్లో చాలామంది పారాచూట్‌తో విమానం నుండి దూకడం, కొండలు ఎక్కడం, జలపాతాల మీద చిన్న పడవలో ప్రయాణించడం, సొరచేపలతో ఈదడం వంటి ప్రమాదకరమైన ఆటల్ని వీక్షించడమే కాదు, థ్రిల్ కోసం అలాంటివి చేస్తున్నారు కూడా.”—విల్లో గ్లెన్ రెసిడెంట్ వార్తాపత్రిక.
పైన చెప్పిన మాటలు, ఆటల్లో పెరిగిన ట్రెండ్‌ని వర్ణిస్తున్నాయి. స్కై డైవింగ్, ఐస్ క్లైంబింగ్, పారాగ్లైడింగ్ వంటి ఆటలు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. రిస్క్ ఉన్న ఆటల్ని ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారని ఇది చూపిస్తుంది. అలాగే ప్రజలు బైకుల మీద, మంచు మీద, స్కేట్‌బోర్డుల మీద సాహసాలు చేస్తున్నారు. టైమ్ అనే పత్రిక చెప్తున్నట్టు, అవి ఎందుకు పాపులర్ అవుతున్నాయంటే, “ప్రజలు సాహసాలు చేసి తమలో భయాన్ని పోగొట్టుకోవాలని, జీవితంలో థ్రిల్ పొందాలని కోరుకుంటున్నారు.”
అయితే, అలాంటి ఆటల వల్ల నష్టాలు కూడా పెరుగుతున్నాయి. ఒక మోస్తరు సురక్షితమైన ఆటల్ని కూడా ప్రమాదకరమైన స్థాయి వరకు తీసుకెళ్లడం వల్ల ఎక్కువమంది గాయపడతారు. అమెరికాలో 1997 లో స్కేట్‌బోర్డింగ్ ద్వారా గాయపడినవాళ్ల సంఖ్య 33 శాతం, మంచు మీద సాహసాలు చేసి గాయపడినవాళ్ల సంఖ్య 31 శాతం, కొండలు ఎక్కడం ద్వారా గాయపడినవాళ్ల సంఖ్య 20 శాతం పెరిగింది. వేరే ఆటల్లో అయితే, ఆఖరికి మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఆటలు ఆడేవాళ్లు అందులో ఉన్న ప్రమాదమేంటో తెలిసే ఆడుతున్నారు. మంచు మీద సాహసాలు చేసే ఒకామె ఇలా చెప్తుంది: “నేను ఏ క్షణమైనా చనిపోతానని నాకు తెలుసు, తెలిసే ఆడుతున్నాను.” స్నోబోర్డింగ్ బాగా ఆడే మరొకతను ఇలా అంటున్నాడు: “అసలు దెబ్బలు తగలకపోతే బాగా ఆడనట్టే లెక్క.”
ఈ ఆటల్లో ఎంత ప్రమాదముందో ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి, ఒక క్రైస్తవుడు వాటిని ఆడవచ్చా? ఈ ప్రమాదకరమైన ఆటల్ని ఆడాలో లేదో నిర్ణయించుకోడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది? జీవాన్ని దేవుడు ఎంత విలువైనదిగా చూస్తున్నాడో పరిశీలించడం ద్వారా ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవచ్చు.
జీవాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు?
యెహోవా దగ్గర “జీవపు ఊట” ఉందని బైబిలు చెప్తుంది. (కీర్తన 36:9) ఆయన మనుషుల్ని సృష్టించడమే కాదు, వాళ్లు జీవితాన్ని ఆనందించడానికి కావల్సినవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చాడు. (కీర్తన 139:14; అపొస్తలుల కార్యాలు 14:16, 17; 17:24-28) కాబట్టి, ఆయన అంత దయతో ఇచ్చిన జీవాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన కోరుకోవడం సరైనదే. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నియమాలు, సూత్రాలు జీవాన్ని ఆయన ఎంత విలువైనదిగా చూస్తున్నాడో తెలియజేస్తున్నాయి.
తోటివాళ్ల ప్రాణాన్ని కాపాడడానికి మోషే ధర్మశాస్త్రం కొన్ని నియమాల్ని ఇచ్చింది. ఒక ఇశ్రాయేలీయుడు ఆ నియమాల్ని పాటించకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే, అతనికి శిక్ష పడేది. ఉదాహరణకు, ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి పిట్టగోడ కట్టాలని ధర్మశాస్త్రం చెప్పింది. ఒకవేళ ఇంటి యజమాని పిట్టగోడ కట్టకపోవడం వల్ల, ఎవరైనా దానిమీద నుండి కిందపడి చనిపోతే ఆ ఇంటి యజమానికి మరణశిక్ష పడుతుంది. (ద్వితీయోపదేశకాండం 22:8) అనుకోకుండా ఒక ఎద్దు పొడవడం వల్ల ఎవరైనా చనిపోతే, ఆ ఎద్దు యజమానికి శిక్ష పడదు. కానీ ఒకవేళ ఆ ఎద్దుకు పొడిచే అలవాటు ఉండి, ఆ విషయం గురించి దాని యజమానిని హెచ్చరించినా అతను దాన్ని అదుపులో ఉంచకపోవడం వల్ల అది ఎవర్నైనా చంపితే, దాని యజమానికి మరణశిక్ష పడవచ్చు. (నిర్గమకాండం 21:28, 29) యెహోవా జీవాన్ని విలువైనదిగా చూస్తున్నాడు, ప్రజలు కూడా అలాగే చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టే, ఇశ్రాయేలు ప్రజలకు ఈ నియమాల్ని ఇచ్చాడు.
ప్రత్యేకించి ఒక నియమం అంటూ ఏదీ లేకపోయినా, నమ్మకమైన దేవుని సేవకులు తమ ప్రాణాల్ని గానీ, అవతలివాళ్ల ప్రాణాల్ని గానీ ప్రమాదంలో పడేయడం తప్పు అని అర్థంచేసుకున్నారు. ఒక సందర్భంలో, దావీదు “బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు” తాగాలని కోరుకున్నాడు. అప్పట్లో బేత్లెహేము ఫిలిష్తీయుల అధీనంలో ఉంది. ఆయన కోరికను విన్న సైనికుల్లో ముగ్గురు, ఫిలిష్తీయుల శిబిరంలోకి చొరబడి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావిలో నుండి నీళ్లు తోడి, దావీదు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఆయన ఆ నీళ్లను తాగలేదు. బదులుగా నేలమీద పారబోశాడు. ఆయన ఇలా అన్నాడు: “నా దేవుడంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఈ పని చేయడం నా ఊహకందని విషయం! తమ ప్రాణాలకు తెగించిన ఈ మనుషుల రక్తాన్ని నేను తాగాలా? వాళ్లు ప్రాణాలకు తెగించి మరీ ఈ నీళ్లు తీసుకొచ్చారు.” (1 దినవృత్తాంతాలు 11:17-19) తన సంతోషం కోసం అవతలివాళ్ల ప్రాణాల్ని ప్రమాదంలో పడేయడం దావీదుకు ఊహకందని విషయం.
ఒక సందర్భంలో యేసు కూడా అలాగే స్పందించాడు. అపవాది అయిన సాతాను యేసును ఆలయం గోడమీద నుండి దూకమని, ఆయనకు ఏ దెబ్బా తగలకుండా దేవదూతలు వచ్చి కాపాడతారో లేదో చూడమని ప్రలోభపెట్టాడు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను పరీక్షించకూడదు.” (మత్తయి 4:5-7) అవును, ప్రాణాలతో చెలగాటం ఆడడం దేవుని దృష్టిలో తప్పని దావీదు అలాగే యేసు గుర్తించారు.
ఈ ఉదాహరణల్ని మనసులో ఉంచుకుని, మనం ఇలా ఆలోచించవచ్చు: ‘ఏవి ప్రమాదకరమైన ఆటలో మనం ఎలా తెలుసుకోవచ్చు? కొంతమంది మాములుగా ఆడే ఆటల్ని సైతం ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తారు, కాబట్టి వాటిని మనం ఆడవచ్చో లేదో ఎలా తెలుస్తుంది?’
అంత రిస్క్ అవసరమా?
మనం ఆడాలనుకుంటున్న ఆటల్ని నిజాయితీగా పరిశీలించుకున్నప్పుడు, మనకే జవాబు దొరుకుతుంది. ఉదాహరణకు, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ ఆటలో ఎంత తరచుగా ప్రజలకు గాయాలౌతూ ఉంటాయి? నాకు సరిపడినంత శిక్షణ ఉందా? గాయాలవ్వకుండా నా దగ్గర భద్రతా పరికరాలు ఉన్నాయా? ఒకవేళ నేను పడిపోయినా, తప్పుగా దూకినా, లేదా నా భద్రతా పరికరాలు పని చేయకపోయినా, చిన్నచిన్న గాయాలౌతాయా లేక ప్రాణాల్నే పోగొట్టుకోవాల్సి వస్తుందా?’
ఒక క్రైస్తవుడు కావాలనే ప్రమాదకరమైన ఆటల్ని ఆడితే, అతను యెహోవాను బాధపెట్టవచ్చు. అలాగే సంఘంలోని వాళ్లకు మంచి ఆదర్శంగా ఉండకపోవచ్చు. (1 తిమోతి 3:2, 8-10; 4:12; తీతు 2:6-8) కాబట్టి సరదా కోసం చేసే మామూలు పనుల్లోనైనా సరే, జీవాన్ని సృష్టికర్త ఎంత విలువైనదిగా చూస్తున్నాడో క్రైస్తవులు గుర్తుపెట్టుకోవడం మంచిది.