కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానేయాలని గట్టిగా కోరుకోండి

మానేయాలని గట్టిగా కోరుకోండి

మానేయాలని గట్టిగా కోరుకోండి

“సిగరెట్‌ మానేయాలి అని చేసే ప్రయత్నానికి కట్టుబడి ఉండడమే, దాన్ని విజయవంతంగా మానుకోవడానికి తొలిమెట్టు.”​—“స్టాప్‌ స్మోకింగ్‌ నవ్‌!” అనే పుస్తకం.

ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు పొగతాగడం మానేయాలి అనుకుంటుంటే, ముందు దాన్ని మానేయాలని గట్టిగా కోరుకోవాలి. ఆ కోరికను మీరు ఎలా పెంచుకోవచ్చు? ఒక మార్గం ఏంటంటే, పొగతాగడం ఆపేస్తే జీవితం ఎంత బావుంటుందో ఆలోచించండి.

మీ డబ్బు ఆదా అవుతుంది. రోజుకు ఒక ప్యాకెట్‌ కాలిస్తే, సంవత్సరం తిరిగేసరికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. “పొగాకు మీద నేను ఎంత డబ్బు తగలేస్తున్నానో అస్సలు ఆలోచించలేదు.”​—గ్యాను, నేపాల్‌.

మీ జీవితాన్ని ఇంకా ఆనందిస్తారు. “పొగతాగడం మానేసినప్పటి నుంచి నా జీవితం మొదలైంది. చెప్పాలంటే, అది రోజురోజుకు మెరుగౌతుంది.” (రెజీనా, దక్షిణాఫ్రికా) పొగతాగడం మానేసినవాళ్లకు వాసన చూసే, రుచి చూసే సామర్థ్యాలు అంతకుముందు కన్నా మెరుగౌతాయి. అంతేకాదు, వాళ్లకు సాధారణంగా ఎక్కువ బలం ఉంటుంది, చూడడానికి కూడా ఆరోగ్యంగా కనిపిస్తారు.

మీ ఆరోగ్యం మెరుగవ్వవచ్చు. “పొగతాగడం మానేస్తే అన్ని వయసుల వాళ్లకు అంటే మగవాళ్లకైనా, ఆడవాళ్లకైనా ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు వస్తాయి. అది కూడా వెంటనే కనిపిస్తాయి.”​—ద యు.ఎస్‌. సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌.

మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. “పొగతాగడం నేనెందుకు మానేశానంటే, నా జీవితం మీద హక్కు నాకే ఉండాలి. అంతేగానీ, పొగాకు నా మీద పెత్తనం చెలాయించడం నాకు ఇష్టంలేదు.”​—హెన్నింగ్‌, డెన్మార్క్‌.

మీ ఇంట్లోవాళ్లు, స్నేహితులు ప్రయోజనం పొందుతారు. “పొగతాగడం . . . మీ చుట్టూ ఉన్నవాళ్లకు కూడా హాని చేస్తుంది. . . . ప్రతీ సంవత్సరం, వేరేవాళ్లు వదిలిన పొగ పీల్చడం వల్ల కొన్ని వేలమంది బ్లడ్‌ క్యాన్సర్‌తో, గుండె జబ్బులతో చనిపోతున్నారని పరిశోధనలు చెప్తున్నాయి.”​—అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ.

మీ సృష్టికర్త సంతోషిస్తాడు. ‘ప్రియ సహోదరులారా, శరీరానికి ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.’ (2 కొరింథీయులు 7:1) “మీ శరీరాల్ని . . . పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించండి.”​—రోమీయులు 12:1.

“శరీరానికి హానిచేసే వాటిని దేవుడు అంగీకరించడని నేను అర్థం చేసుకున్నప్పుడు, పొగతాగడం మానేయాలని నిర్ణయించుకున్నాను.”​—సిల్వియా, స్పెయిన్‌.

కానీ చాలావరకు, పొగతాగడం మానేయాలనే కోరిక ఒక్కటే సరిపోదు. బహుశా మనకు వేరేవాళ్ల సహాయం, అంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల సహాయం అవసరం అవ్వవచ్చు. వాళ్లు ఎలా సహాయం చేస్తారు?